హోమ్ › సంఘ సంవత్సరపు పండుగలు › క్రిస్మస్
సంఘ సంవత్సరపు పండుగలు
క్రిస్మస్
మత్తయి, లూకా చెప్పినట్టు యేసు జననం, యెషయా ప్రవచనంతో, యోహాను సువార్త ప్రారంభంతో, పూర్తిగా. పాశ్చాత్య సంఘాలు క్రిస్మస్ను డిసెంబర్ 25న జరుపుకుంటాయి; జూలియన్ కాలెండర్ను అనుసరించే ఆర్థడాక్స్ సంఘాలు జనవరి 7న.
తేదీలు
| సంవత్సరం | పాశ్చాత్య సంఘాలుక్రిస్మస్ | ఆర్థడాక్స్ సంఘంక్రీస్తు జననం |
|---|---|---|
| 2026 | 25 డిసెంబర్, 2026శుక్రవారం | 7 జనవరి, 2027గురువారం |
| 2027 | 25 డిసెంబర్, 2027శనివారం | 7 జనవరి, 2028శుక్రవారం |
| 2028 | 25 డిసెంబర్, 2028సోమవారం | 7 జనవరి, 2029ఆదివారం |
| 2029 | 25 డిసెంబర్, 2029మంగళవారం | 7 జనవరి, 2030సోమవారం |
| 2030 | 25 డిసెంబర్, 2030బుధవారం | 7 జనవరి, 2031మంగళవారం |
ఒక తేదీ ఆ రోజు ఆర్థడాక్స్ లేదా కాథలిక్ కాలెండర్ పఠనాలను తెరుస్తుంది.
ఆర్థడాక్స్ తేదీలు జూలియన్ కాలెండర్ ప్రకారం; రష్యన్, సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం దాన్ని అనుసరిస్తాయి: వాటి స్థిర పండుగలు పౌర కాలెండర్లో 13 రోజులు ఆలస్యంగా వస్తాయి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా మరియు ఇతరాలు) క్రిస్మస్ను డిసెంబర్ 25న జరుపుకుంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు దాదాపు అన్ని ఆర్థడాక్స్ సంఘాలలో ఒకే విధంగా లెక్కించబడతాయి.
బైబిల్ భాగాలు
యెషయా
2చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది. 3నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. 4మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు. 5యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి. 6ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు. 7ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.
మత్తయి
18యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో ప్రదానం అయింది కానీ వారు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. 19ఆమె భర్త యోసేపు నీతిపరుడు. అందువల్ల అతడు ఆమెను బహిరంగంగా అవమానపరచకుండా రహస్యంగా వదిలేద్దామనుకున్నాడు. 20అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. 21ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు. 22“‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది. 24యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు. 25అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
లూకా
1ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజరు అగస్టస్ ఆజ్ఞాపించాడు. 2ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య. 3అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ స్వగ్రామాలకు వెళ్ళారు. 4యోసేపు కూడా దావీదు వంశంలో పుట్టినవాడు కాబట్టి ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరున్న దావీదు ఊరికి వెళ్ళాడు. 5తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు. 6వారక్కడ ఉన్న సమయంలో ఆమెకు నెలలు నిండాయి. 7ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. ఎందుకంటే సత్రంలో వారికి స్థలం దొరకలేదు. 8ఆ పరిసరాల్లో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు 9ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు. 10అయితే ఆ దూత, “భయపడకండి. ఇదిగో మీతో సహా మనుషులందరికీ మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను. 11దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. 12మీకు కొండ గుర్తు ఒకటే. ఒక పసికందు మెత్తని గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకుని ఉండడం మీరు చూస్తారు” అని వారితో చెప్పాడు. 13ఉన్నట్టుండి అసంఖ్యాకంగా పరలోక దూతల సమూహం ఆ దూతతోబాటు ఉండి, 14“సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక!” అంటూ దేవుణ్ణి స్తుతించారు. 15ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు, “జరిగిన ఈ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి చూద్దాం పదండి,” అని ఒకడితో ఒకడు చెప్పుకుని 16త్వరగా వెళ్ళి, మరియను, యోసేపును, తొట్టిలో పడుకుని ఉన్న పసికందును చూశారు. 17ఆ పసికందును గురించి దేవదూత తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు. 18గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. 19మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది. 20ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్ళిపోయారు.
మత్తయి
1హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాల నుండి జ్ఞానులు కొందరు యెరూషలేముకు వచ్చి, 2“యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం. ఆయనను ఆరాధించడానికి వచ్చాం” అన్నారు. 3హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారుపడ్డారు. 4కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులను, ధర్మశాస్త్రజ్ఞులను అందరినీ పిలిపించి, “క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?” అని వారిని అడిగాడు. 5అందుకు వారు, “యూదయ ప్రాంతంలోని బేత్లెహేములోనే. ఎందుకంటే, 6‘యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు’ అని ప్రవక్తలు రాశారు” అని చెప్పారు. 7అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రం కనిపించిన కచ్చితమైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు. 8తరవాత వారిని బేత్లెహేముకు పంపుతూ, “మీరు వెళ్ళి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయనను కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి ఆయనను ఆరాధిస్తాను” అని చెప్పాడు. 9వారు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలంపైన ఆగింది. 10ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు. 11ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు. 12హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వారు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.
యోహాను
1ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. 2ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు. 3సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. 4ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. 5ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది. 6దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. 7అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. 8ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. 9లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది. 10లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు. 11ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు. 12తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు. 14ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము.
కళలో
గొర్రెల కాపరుల ఆరాధనజార్జోనే · 1505/1510
జ్ఞానుల ఆరాధనఫ్రా ఆంజెలికో మరియు ఫ్రా ఫిలిప్పో లిప్పి · c. 1440/1460
నక్షత్రం జ్ఞానులను నడిపించడంగుస్తావ్ డోరే · 1866
యేసు జననండ్యూరర్ · c. 1502–3
జ్ఞానుల ఆరాధనడ్యూరర్ · c. 1501–1503
యేసు జననండ్యూరర్ · 1504
జ్ఞానుల ఆరాధనలూకాస్ వాన్ లైడెన్ · 1513
సువార్తల గ్రంథం నుండి కత్తిరించిన విడి పుట: యేసు జననం (ముందు వైపు)పేరు తెలియని చిత్రకారుడు, హెల్మార్స్హౌజెన్ · c. 1190
గొర్రెల కాపరులకు శుభవార్త (Ms. 125, fol. 7, ఇర్మెన్గార్డ్ కోడెక్స్ నుండి)పేరు తెలియని జర్మన్ చిత్రకారుడు · after 1053
జ్ఞానుల ఆరాధన (Ms. Ludwig VII 1, fol. 25v, ఆశీర్వచన గ్రంథం నుండి)పేరు తెలియని చిత్రకారుడు, రేగెన్స్బర్గ్ · c. 1030–1040
గొర్రెల కాపరులకు కనిపించిన దేవదూతరెంబ్రాంట్ · 1634
గొర్రెల కాపరుల ఆరాధన: దీపంతోరెంబ్రాంట్ · c. 1654
మరిన్ని పండుగలు
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు