Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 25 డిసెంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 25 డిసెంబర్, 2027

శనివారం · క్రిస్మస్ కాలం

పండుగలు మరియు పరిశుద్ధులు

ప్రభువు జననం (క్రిస్మస్)

మహోత్సవం · ఆరాధన రంగు: తెలుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యెష 52:7–10

7సువార్త ప్రకటిస్తూ శాంతిసమాధానాలు చాటిస్తూ శుభ సమాచారం తెస్తూ విడుదల సమాచారం తీసుకు వచ్చే వారి పాదాలు “నీ దేవుడు పరిపాలిస్తున్నాడు” అని సీయోనుతో చెప్పే వారి పాదాలు పర్వతాల మీద ఎంతో అందంగా ఉన్నాయి. 8విను! నీ కావలివారు తమ గొంతు పెంచుతున్నారు. వాళ్ళంతా కలిసి సంతోషంతో కేకలు వేస్తున్నారు. యెహోవా సీయోనుకు తిరిగి వచ్చేటప్పుడు వారు కళ్ళారా చూస్తారు. 9యెరూషలేము శిథిలాల్లారా! కలిసి ఆనంద గీతాలు పాడండి. యెహోవా తన ప్రజలను ఆదరించాడు. యెరూషలేమును విమోచించాడు. 10అన్ని రాజ్యాల కళ్ళెదుటే యెహోవా తన పవిత్ర హస్తం బయలుపరచాడు. ప్రపంచమంతా మన దేవుని రక్షణ చూస్తారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 98:1–6

1ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి. 2యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు. 3ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు. 4లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి. 5తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి. 6బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.

రెండవ పఠనం

హెబ్రీ 1:1–6

1పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు. 2ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. 3దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. 4దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. 5ఎందుకంటే దేవుడు, “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” అని గానీ, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు” అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా? 6అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.

సువార్త

యోహా 1:1–18

1ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే. 2ఆ వాక్కు ప్రారంభంలో దేవుడితో ఉన్నాడు. 3సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. 4ఆయనలో జీవం ఉంది. ఆ జీవం సమస్త మానవాళికీ వెలుగుగా ఉంది. 5ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది. చీకటి ఆ వెలుగును లొంగదీసుకోలేక పోయింది. 6దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు యోహాను. 7అందరూ తన ద్వారా ఆ వెలుగును నమ్మడం కోసం అతడు ఆ వెలుగుకు సాక్షిగా ఉండడానికి వచ్చాడు. 8ఈ యోహానే ఆ వెలుగు కాదు. కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. 9లోకంలోకి వస్తున్న నిజమైన వెలుగు ఇదే. ఈ వెలుగు ప్రతి వ్యక్తినీ వెలిగిస్తూ ఉంది. 10లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు. 11ఆయన తన సొంత ప్రజల దగ్గరికి వచ్చాడు. కానీ వారు ఆయనను స్వీకరించలేదు. 12తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు. 13వారంతా దేవుని వలన పుట్టినవారే గాని, వారి పుట్టుకకు రక్తమూ, శరీర వాంఛలూ, మనుషుల ఇష్టాలూ కారణం కానే కావు. 14ఆ వాక్కు శరీరంతో మన మధ్య కృపా సత్యాల సంపూర్ణ స్వరూపంగా నివసించాడు. తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారునికి ఉండే మహిమలాగా ఉన్న ఆయన మహిమను మేము చూశాము. 15యోహాను ఆయనను గురించి పెద్ద స్వరంతో ఇలా సాక్ష్యం చెప్పాడు, “నా వెనుక వచ్చేవాడు నాకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయన నాకంటే గొప్పవాడు, అంటూ నేను ఎవరిని గురించి చెప్పానో ఆయనే ఈయన.” 16ఆయన సంపూర్ణతలో నుండి మనమందరం కృప తరువాత కృపను పొందాం. 17మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి. 18దేవుణ్ణి ఇంతవరకూ ఎవరూ చూడలేదు. తండ్రిని అనునిత్యం హత్తుకుని ఉండే దేవుడైన ఏకైక కుమారుడే ఆయనను వెల్లడి చేశాడు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం C, వారపు రోజుల సంవత్సరం II.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు