Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 6 జూన్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 6 జూన్, 2027

ఆదివారం · సామాన్య కాలం 10వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 10వ ఆదివారం

ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 3:9–15

9దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు. 10అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు. 11దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు. 12ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు. 13దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది. 14అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు. 15నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 130:1–8

1యాత్రల కీర్తన యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. 2ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు. 3యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు. 4అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు. 5యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను. 6రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది. 7యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు. 8ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.

రెండవ పఠనం

2 కొరింతీ 4:13–5:1

13కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము. 14ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి. 16అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు. మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు. 17మేము కనిపించే వాటి కోసం కాకుండా కనిపించని వాటి కోసం ఎదురు చూస్తున్నాము. కాబట్టి క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం. 18కనిపించేవి కొంత కాలమే ఉంటాయి కానీ కనిపించనివి శాశ్వతంగా ఉంటాయి. 5:1భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.

సువార్త

మార్కు 3:20–35

20తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది ప్రజలు గుమికూడారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది. 21ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు “ఈయనకు మతి స్థిమితం లేదు” అన్నారు. 22యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర పండితులు, “బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే దయ్యాలను పారదోలుతున్నాడు” అన్నారు. 23యేసు వారిని తన దగ్గరికి పిలిచి, ఉదాహరణల రూపంలో ఇలా అన్నాడు, “సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు? 24చీలికలు వచ్చిన రాజ్యం నిలబడదు. 25చీలికలు వచ్చిన కుటుంబం నిలబడదు. 26అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే వాని అధికారం అంతమౌతుంది గదా. 27నిజానికి ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టివేయాల్సిందే. 28నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. 29కాని పరిశుద్ధాత్మను దూషించినవాణ్ణి దేవుడు ఎన్నడూ క్షమించడు. అలా చేసేవాడు శాశ్వత పాపం చేసిన దోషంలో ఉంటాడు.” 30‘ఆయనకు దయ్యం పట్టింది’ అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు. 31అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు. యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. 32వారు ఆయనతో, “నీ తల్లి, సోదరులు బయట నీ కోసం చూస్తున్నారు” అన్నారు. 33ఆయన వారితో, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అన్నాడు. 34తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 35ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి” అని అన్నాడు.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు