హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 6 జూన్
ఆర్థడాక్స్ కాలెండర్ · మే 24 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 6 జూన్, 2027
ఆదివారం · స్వరం 5
పండుగలు మరియు పరిశుద్ధులు
పాస్కా ఆరవ ఆదివారం
గుడ్డివాని ఆదివారం
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఉదయ ప్రార్థన ఎనిమిదవ సువార్త
11కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. 12ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. 13వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది. 14ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు. 15యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది. 16అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం. 17యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు. 18మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.
పత్రిక
16మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది. 17ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది. 18ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది. 19ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు. 20న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి 21రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు. 22అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. 23వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు. 24అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు. 25మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు. 26అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. 27అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు. 28అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. 29చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి, 30వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు. 31అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి 32అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు. 33రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు. 34అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు.
సువార్త
1ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 2ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. 3అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. 4పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. 5ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు. 6ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. 7“సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు. 8అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు. 9“వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు. 10వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు. 11దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు. 12వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు. 13ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు. 14యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం. 15వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు. 16“ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది. 17దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు. 18వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు. 19“గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు. 20దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు. 21అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు. 22వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 23కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు. 24కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు. 25అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు. 26దానికి వారు, “అసలు ఆయన నీకేం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని మళ్ళీ అడిగారు. 27దానికి వాడు, “ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?” అని వారితో అన్నాడు. 28అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం. 29దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు” అంటూ వాణ్ణి బాగా దూషించారు. 30అయితే వాడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు. 31దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు. 32గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు. 33ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు. 34దానికి వారు, “పాపిగా పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని చెప్పి వాణ్ణి తమ సమాజ మందిరం నుండి బహిష్కరించారు. 35పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు. 36అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు. 37యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు. 38అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 24 మే పౌర కాలెండర్లో 6 జూన్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు