Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 21 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 8 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 21 ఏప్రిల్, 2027

బుధవారం · మహా ఉపవాస కాలం ఆరవ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

Apostles of the Seventy Herodion (Rodion), Agabus, Asyncritus, Rufus, Phlegon and Hermes (1st C)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 58:1–11

1పెద్దగా కేకలు వెయ్యి. ఆపవద్దు. బూరలాగా నీ గొంతెత్తు. వారు చేసిన తిరుగుబాటు నా ప్రజలకు తెలియజెయ్యి. యాకోబు ఇంటివారికి వారి పాపాలను తెలియజెయ్యి. 2అయినా వాళ్ళు తమ దేవుని ఆజ్ఞలను వదలని ప్రజలుగా నీతిని అనుసరించే దేశంగా ప్రతిరోజూ నన్ను వెతుకుతూ ఉంటారు. నా విధానాలను తెలుసుకోవడంలో ఆనందిస్తారు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చాలని నన్ను అడుగుతారు. దేవుడు తమకు దగ్గరవ్వాలని ఆశిస్తారు. 3“మేమెందుకు ఉపవాసమున్నాం? నువ్వెందుకు చూడవు? మమ్మల్ని మేము ఎందుకు తగ్గించుకున్నాం? నువ్వు గమనించలేదు” అని వాళ్ళు అంటారు. మీ ఉపవాస దినాన మీరు మీకిష్టం వచ్చినట్టు చేస్తూ మీ పనివాళ్ళను కఠినంగా చూస్తారు. 4మీరు ఉపవాసమున్నప్పుడు పోట్లాడుకుంటారు. మీ పిడికిళ్ళతో కొట్టుకుంటారు. మీరు ఈ రోజుల్లో ఉపవాసముండేది మీ స్వరం పైన వినబడాలని కాదు. 5నేను కోరేది అలాంటి ఉపవాసమా? ప్రతివాడు తనను తాను అణుచుకుంటే సరిపోతుందా? ఒకడు రెల్లులాగా తలవంచుకుని గోనెపట్ట కట్టుకుని బూడిద పరచుకుని కూర్చోవడం ఉపవాసమా? అలాంటి ఉపవాసం యెహోవాకు ఇష్టమని మీరనుకుంటారా? 6నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. 7ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం. దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు. 8అప్పుడు నీ వెలుగు, ఉదయకాంతిలాగా ఉదయిస్తుంది. నీ ఆరోగ్యం నీకు త్వరగా లభిస్తుంది. నీ నీతి, నీకు ముందుగా వెళ్తుంది. యెహోవా మహిమ నీ వెనుక కావలి కాస్తుంది. 9అప్పుడు నువ్వు పిలిస్తే యెహోవా జవాబిస్తాడు. సహాయం కోసం నువ్వు మొర్ర పెడితే “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటాడు. ఇతరులను అణిచివేయడం, వేలుపెట్టి చూపిస్తూ నిందించడం, మోసంగా మాట్లాడడం నువ్వు మానుకుంటే, 10ఆకలితో అలమటించే వారికి నీకున్న దానిలోనుంచి ఇచ్చి, బాధితుల అవసరాలను తీర్చి వాళ్ళను తృప్తి పరిస్తే చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. నీ చీకటి నీకు మధ్యాహ్నం లాగా ఉంటుంది. 11అప్పుడు యెహోవా ఎప్పటికీ నీకు దారి చూపుతూ ఉంటాడు. ఎండిపోయిన నీ ఆత్మను తృప్తిపరుస్తాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. నువ్వు నీరు కట్టిన తోటలాగా ఉంటావు. ఎన్నడూ ఆగని నీటి ఊటలాగా ఉంటావు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 43:26–31; 45:1–16

26యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి, అతనికి నేలను వంగి, నమస్కారం చేశారు. 27అప్పుడు “మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకా బతికే ఉన్నాడా?” అని వారి క్షేమ సమాచారం అడిగినప్పుడు వారు, 28“నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు” అని చెప్పి వంగి సాగిలపడ్డారు. 29అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడూ తన తమ్ముడు అయిన బెన్యామీనును చూసి “మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా?” అని అడిగి “బాబూ, దేవుడు నీకు దయ చూపుతాడు గాక” అన్నాడు. 30అప్పుడు తన తమ్ముని మీద యోసేపుకు ప్రేమ పొర్లుకుని వచ్చింది కాబట్టి అతడు త్వరగా ఏడవడానికి చోటు వెతికి, లోపలి గదిలోకి వెళ్ళి, అక్కడ ఏడ్చాడు. 31అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. 45:1అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. 2అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు. 3అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. 4అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. 5అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు. 7మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు. 9మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు. 10నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి. 11ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి. 12ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి. 13ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు. 14తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు. 15అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు. 16“యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 21:23–22:4

23నోటిని నాలుకను కాపాడుకునేవాడు ఇబ్బందుల నుండి తనను కాపాడుకుంటాడు. 24అహంకారి, గర్విష్టి-అతనికి అపహాసకుడు అని పేరు. అలాంటివాడు గర్వంతో మిడిసి పడతాడు. 25సోమరిపోతు చేతులు పనిచేయవు. వాడి కోరికలే వాడికి చావు తెచ్చిపెడతాయి. 26రోజంతా అతనిలో ఆశలు ఊరుతూనే ఉంటాయి. యథార్థంగా ప్రవర్తించేవాడు వెనుదీయకుండా ఇస్తూనే ఉంటాడు. 27దుష్టులర్పించే బలులు అసహ్యం. ఆ బలులు వారు దురాలోచనతో అర్పిస్తే అవి మరింకెంత అసహ్యమో గదా. 28అబద్ధసాక్షి నాశనమై పోతాడు. శ్రద్ధగా వినేవాడు పలికే మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. 29దుర్మార్గుడు ముఖం మాడ్చుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటాడు. 30యెహోవాకు విరోధమైన జ్ఞానంగానీ వివేచనగానీ ఆలోచనగానీ నిలవదు. 31యుద్ధదినానికి గుర్రాన్ని సిద్ధపరుస్తారు. అయితే విజయం యెహోవాదే. 22:1గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారాలకంటే దయ మరింత అభిలషించ దగినవి. 2ఐశ్వర్యవంతులు, దరిద్రులు వీరిద్దరినీ సృష్టించింది యెహోవాయే. 3బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. ఆజ్ఞానులు అనాలోచనగా పోయి బాధలు కొని తెచ్చుకుంటారు. 4యెహోవా పట్ల భయభక్తులు వినయాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను, జీవాన్ని తెస్తాయి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 8 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 21 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు