Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 22 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 9 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 22 ఏప్రిల్, 2027

గురువారం · మహా ఉపవాస కాలం ఆరవ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyr Eupsychius of Cæsarea in Cappadocia († 362)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 65:8–16

8యెహోవా ఇలా చెబుతున్నాడు. “ద్రాక్షగెలలో కొత్త రసం ఇంకా కనబడితే ప్రజలు, ‘దానిలో మంచి రసం ఉంది. దాన్ని నష్టం చేయవద్దు.’ అంటారు. నా సేవకుల కోసం అలాగే చేస్తాను. నేను వాళ్లందరినీ నాశనం చేయను. 9యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను. యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకునే వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకున్న వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు. 10నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది. ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది. 11అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు. 12నేను పిలిచినప్పుడు మీరు జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు. దానికి బదులు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు. కాబట్టి నేను కత్తిని మీకు విధిగా నియమిస్తాను. మీరంతా వధకు లోనవుతారు.” 13యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు. నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు. నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు. 14నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు. 15నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను. 16ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను. భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు. ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 46:1–7

1ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. 2అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 3ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను. 4నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.” 5యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు. 6యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు. 7అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 23:15–24:5

15కుమారా, నీ హృదయానికి జ్ఞానం లభిస్తే నా హృదయం కూడా సంతోషిస్తుంది. 16నీ పెదవులు యథార్థమైన మాటలు పలకడం విని నా అంతరంగం ఆనందిస్తుంది. 17పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు. 18నిశ్చయంగా భవిషత్తు అనేది ఉంది. నీ ఆశ భంగం కాదు. 19కుమారా, నీవు విని జ్ఞానం తెచ్చుకో. నీ హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో చక్కగా నడిపించుకో. 20ద్రాక్షారసం తాగేవారితోనైనా మాంసం ఎక్కువగా తినే వారితోనైనా సహవాసం చేయకు. 21తాగుబోతులు, తిండిబోతులు దరిద్రులౌతారు. నిద్రమత్తు చింపిరిగుడ్డలు ధరించడానికి దారి తీస్తుంది. 22నీ కన్నతండ్రి ఉపదేశం అంగీకరించు. నీ తల్లి వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. 23సత్యాన్ని అమ్మివేయ వద్దు. దాన్ని కొని ఉంచుకో. జ్ఞానం, ఉపదేశం, వివేకం కొని ఉంచుకో. 24ఉత్తముడి తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవాణ్ణి కన్నవాడు వాడివల్ల ఆనందపడతాడు. 25నీ తలిదండ్రులను సంతోషపెట్టాలి. నీ కన్న తల్లిని ఆనందపరచాలి. 26కుమారా, నీ హృదయం నాకియ్యి. నా మార్గాలు నీ కన్నులకు ఇంపుగా ఉండాలి. 27వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. 28దోచుకొనేవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉంటుంది. అది చాలా మందిని విశ్వాస ఘాతకులుగా చేస్తుంది. 29ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు? 30ద్రాక్షారసంతో పొద్దుపుచ్చే వారికే గదా. కలిపిన ద్రాక్షారసం సేవించే వారికే గదా. 31ద్రాక్షారసం ఎర్రగా గిన్నెలో తళతళలాడుతూ రుచిగా కడుపులోకి దిగిపోతూ ఉంటే దానివైపు చూడకు. 32అది పాములాగా కాటేస్తుంది. కట్లపాములాగా కరుస్తుంది. 33నీ కళ్ళకు విపరితమైనవి కనిపిస్తాయి. నీవు వెర్రిమాటలు పలుకుతావు. 34నీవు నడిసముద్రంలో పడుకున్నవాడి లాగా ఉంటావు. ఓడ తెరచాప కొయ్య చివరన తల వాల్చుకున్నవాడి లాగా ఉంటావు. 35“నన్ను కొట్టినా నాకు నొప్పి తెలియలేదు నామీద దెబ్బలు పడినా నాకేమీ అనిపించలేదు. నేనెప్పుడు నిద్ర లేస్తాను? మరికాస్త మద్యం తాగాలి” అని నీవనుకుంటావు. 24:1దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. 2వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది. 3జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది. 4తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి. 5జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 9 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 22 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు