Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 28 ఫిబ్రవరి

ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 15 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 28 ఫిబ్రవరి, 2027

ఆదివారం · స్వరం 6

పండుగలు మరియు పరిశుద్ధులు

తప్పిపోయిన కుమారుని ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన ఆరవ సువార్త

లూకా 24:36–53

36వారు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా యేసే వారి మధ్య నిలబడి, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 37అయితే వారు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు. 38అప్పుడాయన, “మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో ఎందుకు సందేహపడుతున్నారు? 39నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు” అని చెప్పాడు. 40అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు. 41అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, “మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?” అని అడిగాడు. 42వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు. 44తరువాత ఆయన, “మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా” అన్నాడు. 45అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనసులను తెరిచాడు. 46“క్రీస్తు హింసల పాలై చనిపోయి మూడవ రోజున చనిపోయిన వారిలో నుండి లేస్తాడనీ, 47యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకూ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది. 48మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు. 49“వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదికి పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి” అని వారికి చెప్పాడు. 50ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. 51అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు. 52వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు. 53దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.

పత్రిక

1 కొరింతీ 6:12–20

12దేవుని దృష్టిలో న్యాయవంతులయ్యారు గాని అన్ని విషయాలూ ప్రయోజనకరం కాదు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఉంది గాని దేనినీ నన్ను లోపరచుకోనివ్వను. 13ఆహార పదార్ధాలు కడుపు కోసమూ, కడుపు ఆహార పదార్ధాల కోసమూ ఉన్నాయి. కానీ దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. శరీరం ఉన్నది లైంగిక దుర్నీతి కోసం కాదు, ప్రభువు కోసమే. ప్రభువే శరీర పోషణ సమకూరుస్తాడు. 14దేవుడు ప్రభువును సజీవంగా లేపాడు. మనలను కూడా తన శక్తితో లేపుతాడు. 15మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? నేను క్రీస్తు అవయవాలను తీసుకుపోయి వేశ్యకు అవయవాలుగా చేయవచ్చా? అలా జరగకూడదు. 16వేశ్యతో కలిసేవాడు దానితో ఏక శరీరం అవుతాడని మీకు తెలియదా? “వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని లేఖనాలు చెబుతున్నాయి కదా? 17అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మగా ఉన్నాడు. 18లైంగిక దుర్నీతికి దూరంగా పారిపొండి. ఇతర పాపాలన్నీ శరీరానికి బయటే జరుగుతాయి గానీ లైంగిక దుర్నీతి జరిగించేవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. 19మీ శరీరం మీలో నివసించే పరిశుద్ధాత్మకు ఆలయమనీ, ఆయనను అనుగ్రహించింది దేవుడే అనీ మీకు తెలియదా? మీరు మీ సొంతం కాదు. 20దేవుడే మిమ్మల్ని ఖరీదు పెట్టి కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో ఆయనను మహిమ పరచండి.

సువార్త

లూకా 15:11–32

11ఆయన ఇంకా ఇలా అన్నాడు, “ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. 12వారిలో చిన్నవాడు ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు’ అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు. 13కొద్ది రోజుల తరువాత చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. 14అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. అతనికి ఇబ్బందులు మొదలైనాయి. 15దాంతో అతడు వెళ్ళి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి అతనిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు. 16అతడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ అతనికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు. 17అతనికి బుద్ధి వచ్చింది. అతడిలా అనుకున్నాడు, ‘నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్ళకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. 18నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. 19ఇక నుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను.’ ఇలా అనుకుని అతడు లేచి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. 20అతడింకా దూరంగా ఉండగానే తండ్రి అతణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. 21అప్పుడు ఆ కొడుకు తండ్రితో, ‘నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు’ అన్నాడు. 22“అయితే తండ్రి తన సేవకులతో, “శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి. 23కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. 24నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు. అప్పుడు వారంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. 25“ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటిని సమీపిస్తుండగా సంగీతం, నాట్యధ్వని అతనికి వినిపించాయి. 26ఒక సేవకుణ్ణి పిలిచి, ‘ఏం జరుగుతోంది?’ అని అడిగాడు. 27ఆ పనివాడు అతనితో, ‘నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. 28దాంతో పెద్ద కొడుక్కి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు. 29కాని అతడు, ‘ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు. 30కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ చిన్న కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు’ అంటూ నిష్టూరంగా మాట్లాడాడు. 31అందుకతని తండ్రి, ‘నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే. 32మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు’ అని చెప్పాడు.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 15 ఫిబ్రవరి పౌర కాలెండర్‌లో 28 ఫిబ్రవరి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు