Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › బోధ

సువార్తలు పక్కపక్కనే · బోధ

విత్తనాలు చల్లేవాని ఉపమానానికి వివరణ

మత్తయి 13:18–23 · మార్కు 4:13–20 · లూకా 8:11–15

మత్తయి

మత్తయి 13:18–23

18“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.

19ఎవరైనా రాజ్యం గురించిన వాక్కు విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన చల్లిన విత్తనాలు వీరే.

20రాతినేలను చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవారు.

21అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.

22ముళ్ళ మొక్కల్లో చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్యం వింటారు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వారు ఫలించకుండా పోతారు.

23మంచి నేలపై చల్లిన విత్తనాలు ఎవరంటే, వాక్కు విని దాన్ని అర్థం చేసుకునేవాడు. అలాటి వారు నిజంగా ఫలించి వృద్ధి పొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫై రెట్లు ఫలిస్తారు.”

మార్కు

మార్కు 4:13–20

13ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు?

14విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు.

15దారి పక్కన ఉన్నవారెవరంటే, వాక్కు వారిలో పడింది గాని, వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు.

16అలాగే కొంతమంది రాతినేల లాంటి వారు. వీళ్ళు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.

17కానీ వారిలో వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు.

18కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. దేవుని వాక్కు వింటారు.

19కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి.

20మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు.”

లూకా

లూకా 8:11–15

11ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.

12దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు.

13రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు.

14ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.

15మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు