Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › పరమ గీతము › 5

IRV · అధ్యాయం 5 / 8

పరమ గీతము 5

1నా సోదరీ, చెలీ, నేను నా తోటలోకి వచ్చాను. నా జటామాంసిని నా సుగంధాలతో తెచ్చుకున్నాను. తేనె, తేనెపట్టుతో తిన్నాను. నా ద్రాక్షారసాన్ని నా పాలతో తాగాను. నేస్తమా, తిను. నేస్తం, తిను. ప్రియా, బాగా తాగు.

2నేను నిద్ర పోయాను గానీ నా మనస్సు కల కంటోంది. నా ప్రియుడు తలుపు తడుతూ పిలుస్తున్న శబ్దం “నా సోదరీ, ప్రియతమా, నా పావురమా, నిష్కళంకితా, తలుపు తియ్యి. నా తల మంచుకు తడిసింది. నా జుట్టు రాత్రి మంచుకు తడిసింది.”

3నేను బట్టలు తీసేశాను. మళ్ళీ వాటిని వేసుకోవాలా? కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ మురికి చేసుకోవాలా?

4తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి పెట్టగానే నా గుండె అతని కోసం కొట్టుకుంది.

5నా ప్రియుడి కోసం తలుపు తీయడానికి నేను లేచాను. నా చేతుల నుంచి బోళం కారుతూ ఉంది. నా వేళ్ళకున్న బోళం తడి తలుపు గడియపై కారింది.

6నా ప్రియునికి తలుపు తీశాను. కానీ అతడు వెళ్లిపోయాడు. నేను కుంగిపోయాను. నీరుగారిపోయాను. నేనతని కోసం వెతికినా కనబడలేదు. నేనతన్ని పిలిచినా అతడు పలకలేదు.

7పట్టణంలో గస్తీ తిరిగేవారు నాకు ఎదురుపడ్డారు. వాళ్ళు నన్ను కొట్టి గాయపర్చారు. ప్రాకారం మీద ఉన్న కావలివారు నా పైట చెంగు లాగేసుకున్నారు.

8యెరూషలేము ఆడపడుచులారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, అతనిపట్ల ప్రేమతో నేను సొమ్మసిల్లి పోతున్నానని అతనికి చెప్పమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

9జగదేక సుందరీ, వేరే ప్రియుల కంటే నీ ప్రియుడి విశేషమేంటి? నువ్వు మాచేత ఇలా ప్రమాణం చేయించుకోడానికి వేరే ప్రియుల కంటే నీ ప్రియుడు ఏవిధంగా గొప్ప?

10నా ప్రియుడు చూడ చక్కని వాడు. ఎర్రని వాడు. పదివేలమందిలో ప్రత్యేకమైన వాడు.

11అతని తల మేలిమి బంగారం. అతనిది ఉంగరాల జుట్టు, కాకి నలుపు.

12అతని కళ్ళు నదీతీరాన ఎగిరే గువ్వల్లాంటివి. అవి పాలతో కడిగి, రత్నాలు పొదిగినట్టుగా ఉన్నాయి.

13అతని చెక్కిళ్ళు సుగంధమొక్కల తోటలా, కమ్మని సువాసన ఇస్తున్నాయి. అతని పెదవులు లిల్లీ పువ్వుల్లా, బోళం ఊరుతున్నట్టుగా ఉన్నాయి.

14అతని చేతులు, రత్నాలు పొదిగిన బంగారు కడ్డీలు. అతని ఉదరం పచ్చలు పొదిగిన ఏనుగు దంతం.

15అతని కాళ్లు పాలరాతి స్తంభాల్లా ఉన్నాయి. అవి అచ్చమైన బంగారు కుదురు మీద నిలిపినట్టున్నాయి. అతని ఆకారం లెబానోను పర్వతాల్లా, దేవదారు వృక్షాల్లా రమ్యం.

16అతని నోరు అత్యంత మధురం. అతడు మూర్తీభవించిన పరిపూర్ణ సౌందర్యం. యెరూషలేము ఆడపడుచులారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా నెచ్చెలి.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org