IRV · అధ్యాయం 8 / 8
పరమ గీతము 8
1నా తల్లి పాలు తాగిన నా సోదరునిలా నువ్వు నాకుంటే ఎంత బాగు! అప్పుడు నువ్వు బయట ఎదురు పడితే నీకు ముద్దులిచ్చేదాన్ని. అప్పుడు నన్నెవరూ నిందించరు.
2నేను నిన్ను మా పుట్టింటికి తీసుకెళ్తాను. నువ్వు నాకు పాఠాలు నేర్పిస్తావు. తాగడానికి నీకు సుగంధ ద్రాక్షారసాన్ని, నా దానిమ్మ పళ్ళ రసాన్ని ఇస్తాను.
3అతని ఎడమచెయ్యి నా తల కింద ఉంది. అతని కుడిచేత్తో నన్ను ఆలింగనం చేసుకున్నాడు
4యెరూషలేము ఆడపడుచులారా, మీచేత ఒట్టు వేయించుకుంటున్నాను. మా ప్రేమ పని ముగిసేంత వరకూ మీరు మమ్మల్ని ఆటంకపరచవద్దు.
5తన ప్రియుని మీద ఆనుకుని ఎడారి దారిలో వచ్చేది ఎవరు? ఆపిల్ చెట్టు కింద నువ్వు పడుకుని ఉంటే నేను నిన్ను లేపాను. అక్కడ నువ్వు మీ అమ్మ కడుపులో పడ్డావు. ఆమె నిన్ను అక్కడే ప్రసవించింది.
6నీ చేతిమీదున్న పచ్చబొట్టులా నీ గుండె మీద నా పచ్చబొట్టు పొడిపించుకో. ఎందుకంటే ప్రేమకు చావుకున్నంత బలముంది. మోహం పాతాళంతో సమానమైన తీవ్రత గలది. దాని మంటలు ఎగిసి పడతాయి. అది మండే అగ్నిజ్వాల. ఏ అగ్ని మంటలకన్నా అది తీవ్రమైనది.
7ఉప్పెన కూడా ప్రేమను ఆర్పలేదు. వరదలు దాన్ని ముంచలేవు. ప్రేమ కోసం ఎవడైనా తనకున్నదంతా ఇచ్చేసినా ఆ ప్రయత్నం శుద్ధ దండగ.
8మాకొక చిన్నారి చెల్లి ఉంది. ఆమె స్తనాలు ఇంకా పెరగలేదు. ఆమె నిశ్చితార్థం రోజున మా చెల్లి కోసం మేమేం చెయ్యాలి?
9ఆమె గోడలాంటిదైతే దానిమీద వెండి గోపురం కట్టిస్తాం. ఆమె తలుపులాంటిదైతే దేవదారు చెక్కతో దానికి గడులు పెడతాం.
10నేను గోడలా ఉండేదాన్ని. అయితే ఇప్పుడు నా స్తనాలు గోపురాల్లా ఉన్నాయి. కాబట్టి నేను పూర్తిగా అతని దృష్టికి సిద్ధంగా ఉన్నా.
11బయల్ హామోనులో సొలొమోనుకు ఒక ద్రాక్షావనం ఉంది. అతడు దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ప్రతి రైతూ వెయ్యి వెండి నాణాలు కౌలు చెల్లించాలి.
12నా ద్రాక్షతోట నా సొంతం. సొలొమోనూ, ఆ వెయ్యి వెండి నాణాలు నీవే. దాన్ని కౌలు చేసేవారికి రెండు వందల నాణాలు గిట్టుతాయి.
13ఉద్యానవనంలో పెరిగేదానా, నా మిత్రులు నీ స్వరం వింటున్నారు. నన్నూ విననీ.
14ప్రియా, త్వరగా వచ్చెయ్యి. జింకలా, లేడిపిల్లలా సుగంధ పర్వతాల మీదుగా చెంగు చెంగున వచ్చెయ్యి.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org