హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 5 ఆగస్టు
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 5 ఆగస్టు, 2027
గురువారం · సామాన్య కాలం 18వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 18వ వారపు గురువారం
ఐచ్ఛిక స్మరణ దినం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
పునీత మరియ మహా బసిలికా (సాంతా మరియా మాజ్జోరే) ప్రతిష్ఠ · ఐచ్ఛిక స్మరణ దినం
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు. 2ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు. 3ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది! 4మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు? 5ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు. 6అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది. 7అప్పుడు యెహోవా మోషేతో, 8“నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు. 9యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు. 10తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు. 11అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి. 12అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు. 13ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
ప్రతిస్పందన కీర్తన
1రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం. 2కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం. 6రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం. 7ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు! 8మెరీబా దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు. 9అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.
సువార్త
13యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?” 14వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు. 15“అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 16వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. 17అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. 18ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు. 19పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దాన్ని పరలోకంలో బంధించడం, దేనిని విడిపిస్తావో దాన్ని పరలోకంలో విడిపించడం జరుగుతుంది.” 20అప్పుడు తానే క్రీస్తు అని ఎవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు. 21అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడవ రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలుపెట్టాడు. 22అప్పుడు పేతురు ఆయన్ని ఒక పక్కకి తీసుకు పోయి, “ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు” అని గద్దింపుగా అన్నాడు. 23అయితే యేసు పేతురు వైపు తిరిగి, “సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే మనసు పెడుతున్నావు” అన్నాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు