Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 4 ఆగస్టు

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 4 ఆగస్టు, 2027

బుధవారం · సామాన్య కాలం 18వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 18వ వారపు బుధవారం

స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు

పునీత జాన్ వియన్నీ (ఆర్స్ విచారణ గురువు), గురువు · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

సంఖ్యా 13:1–2, 25–14:1, 26–30, 34–35

1ఆ తరువాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2నేను ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్న కనాను దేశాన్ని పరీక్షించడానికి కొంతమందిని పంపించు. తమ పూర్వీకుల గోత్రాల ప్రకారం ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తిని మీరు పంపించాలి. వారిల్లో ప్రతి వాడూ తమ ప్రజల్లో నాయకుడై ఉండాలి. 25వారు ఆ దేశంలో నలభై రోజుల పాటు సంచరించి, పరీక్షించి తిరిగి వచ్చారు. 26పారాను అరణ్యంలో కాదేషులో ఉన్న మోషే అహరోనుల దగ్గరికీ, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికీ వచ్చారు. ఆ దేశం గురించిన సమాచారం తెలియజేశారు. అలాగే తాము తెచ్చిన ఆ ప్రాంతం పళ్ళు చూపించారు. 27వారు మోషేకి ఇలా చెప్పారు. “నువ్వు మమ్మల్ని పంపించిన దేశానికి మేము వెళ్లాం. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి అన్నది నిజమే. ఆ దేశం పళ్ళు ఇవి. 28కానీ అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా బలవంతులు. అక్కడి పట్టణాలు పెద్దవి. అవన్నీ బ్రమ్హాండమైన ప్రాకారాలు ఉన్న పట్టణాలు. అక్కడ మేము అనాకు వంశం వారిని చూశాం. 29దక్షిణ ప్రాంతంలో అమాలేకు ప్రజలు నివసిస్తున్నారు. కొండ ప్రాంతంలో హిత్తీ, యెబూసీ, అమోరీ తెగల వారు నివసిస్తున్నారు. ఇక సముద్రం సమీపంలోనూ, యొర్దాను నదీ ప్రాంతంలోనూ కనాను ప్రజలు నివసిస్తున్నారు.” 30అప్పుడు కాలేబు మోషే చుట్టూ చేరిన జనాన్ని ఉత్సాహపరచడానికి ప్రయత్నం చేశాడు. “మనం దానిపై దాడి చేసి స్వాధీనం చేసుకుందాం. దాన్ని జయించడానికి మనకున్న బలం సరిపోతుంది” అన్నాడు. 31కాని అతనితో వెళ్ళిన మిగతా వారు “అక్కడి ప్రజలపై మనం దాడి చేయలేం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు.” అన్నారు. 32ఈ విధంగా వారు తాము వెళ్లి చూసి వచ్చిన ప్రాంతం గురించి ఇశ్రాయేలు ప్రజలకు నిరుత్సాహ పరిచే నివేదిక ఇచ్చారు. “మేము చూసి వచ్చిన ఆ దేశం తన నివాసుల్నే మింగివేసే దేశం. మేము చూసిన ప్రజలంతా ఆజానుబాహులు. 33అక్కడ మేము నెఫీలీ ప్రజలను చూశాం. వారు అనాకు వంశం వాడైన నెఫీలీ తెగ వారు. వారి ఎదుట మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. వారి దృష్టికీ అలాగే ఉన్నాం” అన్నారు. 14:1ఆ రాత్రి ప్రజలందరూ పెద్దగా కేకలు పెట్టి ఏడ్చారు. 26ఇంకా యెహోవా మోషే అహరోనులతో మాట్లాడుతూ, 27“నాకు విరోధంగా నన్ను విమర్శించే ఈ చెడ్డ సమాజాన్ని నేనెంత వరకూ సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా చేస్తున్న విమర్శలు నేను విన్నాను. 28నువ్వు వారితో, యెహోవా చెప్పేదేమంటే, నేను జీవంతో ఉన్నట్టు, మీరు నాతో చెప్పినట్టు నేను కచ్చితంగా మీపట్ల చేస్తాను. 29మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలిపోతాయి. మీ పూర్తి లెక్క ప్రకారం మీలో లెక్కకు వచ్చిన వారందరూ, అంటే, ఇరవై సంవత్సరాలు మొదలు ఆ పైవయస్సు కలిగి, నాకు విరోధంగా విమర్శించిన వారిందరూ రాలిపోతారు. 30యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప మీకు నివాసంగా ఇస్తానని నేను ప్రమాణం చేసిన దేశంలో కచ్చితంగా మీలో ఎవరూ ప్రవేశించరు. 34మీరు ఆ ప్రదేశాన్ని సంచారం చేసి చూసిన నలభై రోజుల లెక్క ప్రకారం రోజుకు ఒక సంవత్సరం ప్రకారం నలభై సంవత్సరాలు మీ పాపశిక్షను భరించి, నేను మీకు శత్రువైతే ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. 35నేను, యెహోవాను మాట్లాడాను. నాకు విరోధంగా సమకూడిన ఈ దుర్మార్గపు సమాజం పట్ల నేను దీన్ని కచ్చితంగా జరిగిస్తాను. ఈ అరణ్యంలో వారు నాశనం అయిపోతారు. ఇక్కడే చనిపోతారు” అన్నాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 106:6–7, 13–14, 21–23

6మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము. 7ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు. 13అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు. 14అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు. 21ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను 22ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. 23అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.

సువార్త

మత్తయి 15:21–28

21యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, “ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది” అని పెద్దగా అరిచి చెప్పింది. 23కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు, “ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఈమెని పంపించెయ్యి” అని ఆయనను వేడుకున్నారు. 24దానికి ఆయన, “దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు” అని జవాబిచ్చాడు. 25అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నాకు సహాయం చెయ్యి” అంది. 26ఆయన, “పిల్లలు తినే రొట్టెను కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు” అని ఆమెతో అన్నాడు. 27ఆమె, “ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపై నుండి కింద పడే ముక్కలు తింటాయి కదా” అంది. 28అందుకు యేసు, “నీ నమ్మకం గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది” అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు