హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 26 మే
ఆర్థడాక్స్ కాలెండర్ · మే 13 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 26 మే, 2027
బుధవారం · పాస్కా నాల్గవ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు మధ్య పండుగ
ఉపవాస దినం
చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
మీకా 4:2–3, 5; 6:2–5, 8; 5:4–5
2అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు, “యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం, పదండి. ఆయన తన విధానాలను మనకు నేర్పిస్తాడు. మనం ఆయన దారుల్లో నడుచుకుందాం.” సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు వెలువడతాయి. 3ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు. దూరంగా ఉండే విస్తారమైన రాజ్యాల వివాదాలను పరిష్కరిస్తాడు. వారు తమ కత్తులను నాగటి నక్కులుగా తమ ఈటెలను మచ్చు కత్తులుగా సాగగొడతారు. రాజ్యం మీదికి రాజ్యం కత్తి ఎత్తకుండా ఉంటారు. యుద్ధ విద్య నేర్చుకోవడం మానివేస్తారు. 5ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు. మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి ఎప్పటికీ నడుచుకుంటాము. 6:2పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు యెహోవా చేసిన ఫిర్యాదు వినండి. ఆయన ఇశ్రాయేలీయుల మీద ఫిర్యాదు చేస్తున్నాడు. 3నా ప్రజలారా, నేను మీకేం చేశాను? మిమ్మల్ని నేనెలా కష్టపెట్టాను? జవాబివ్వండి. 4ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను. బానిస ఇంట్లో నుంచి మిమ్మల్ని కాపాడాను. మీ కోసం మోషే అహరోను మిర్యాములను పంపించాను. 5నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన, బెయోరు కుమారుడు బిలాము అతనికిచ్చిన జవాబు గుర్తుకు తెచ్చుకోండి. యెహోవా నీతి పనులు మీరు తెలుసుకునేలా షిత్తీము మొదలు గిల్గాలు వరకూ జరిగిన వాటిని మనసుకు తెచ్చుకోండి. 8మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు. ఆయన నిన్ను కోరేదేంటంటే, న్యాయంగా ప్రవర్తించు. కనికరాన్ని ప్రేమించు. వినయంగా నీ దేవునితో నడువు. 5:4ఆయన యెహోవా బలంతో తన యెహోవా దేవుని పేరులోని గొప్పదనంతో నిలబడి తన మంద మేపుతాడు. వాళ్ళు క్షేమంగా ఉంటారు. భూమి కొనల వరకూ ఆయన గొప్పవాడిగా ఉంటాడు. 5అష్షూరీయులు మన దేశంలో చొరబడినప్పుడు, వాళ్ళు మన ప్రాకారాల మీద దండెత్తినప్పుడు వాన్ని ఎదిరించడానికి మేము ఏడుగురు గొర్రెల కాపరులను, ఎనిమిది మంది నాయకులను నియమిస్తాం. ఆయనే మనకు శాంతి.
సాయంకాల ప్రార్థన: పఠనం
1“దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి. రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి. 12:3ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు, 4“యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి. 55:2తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి. 3శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. 4ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.” 5నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు. 6యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. 7భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి. వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు. 8“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు. 9“ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి. 10వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు. 11ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది. 12మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు. మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి. 13ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”
సాయంకాల ప్రార్థన: పఠనం
1జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. 2పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. 3తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. 4“జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. 5తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. 6ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” 7ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. 8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. 9జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. 10జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. 11నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
పత్రిక
6వారు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకూ చుట్టుపక్కల ప్రదేశానికీ పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. 7లుస్త్రలో కాళ్ళు చచ్చుబడిన ఒకడున్నాడు. 8అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. 9అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, 10“లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు. 11ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి, 12బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు. 13పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు. 14అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి 15“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. 16ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. 17అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.” 18వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.
సువార్త
14పండగ ఉత్సవాల్లో సగం రోజులు గడిచాక యేసు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉపదేశించడం ప్రారంభించాడు. 15ఆయన ఉపదేశానికి యూదులు ఆశ్చర్యపడి, “చదువూ సంధ్యా లేని వాడికి ఇంత పాండిత్యం ఎలా కలిగింది” అని చెప్పుకున్నారు. 16దానికి యేసు, “నేను చేసే ఉపదేశం నాది కాదు. ఇది నన్ను పంపిన వాడిదే. 17దేవుని ఇష్టప్రకారం చేయాలని నిర్ణయం తీసుకున్నవాడు నేను చేసే ఉపదేశం దేవుని వలన కలిగిందో లేక నా స్వంత ఉపదేశమో తెలుసుకుంటాడు. 18తనంతట తానే బోధించేవాడు సొంత గౌరవం కోసం పాకులాడతాడు. తనను పంపిన వాని గౌరవం కోసం తాపత్రయ పడేవాడు సత్యవంతుడు. ఆయనలో ఎలాంటి దుర్నీతీ ఉండదు. 19మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా! కానీ మీలో ఎవరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించరు. మీరు నన్ను చంపాలని ఎందుకు చూస్తున్నారు?” అన్నాడు. 20అందుకు ఆ ప్రజలు, “నీకు దయ్యం పట్టింది. నిన్ను చంపాలని ఎవరు కోరుకుంటారు?” అన్నారు. 21యేసు వారితో, “నేనొక కార్యం చేశాను. దానికి మీరంతా ఆశ్చర్యపడుతున్నారు. 22మోషే మీకు సున్నతి అనే ఆచారాన్ని నియమించాడు. ఈ ఆచారం మోషే వల్ల కలిగింది కాదు. ఇది పూర్వీకుల వల్ల కలిగింది. అయినా విశ్రాంతి దినాన మీరు సున్నతి కార్యక్రమం చేస్తున్నారు. 23విశ్రాంతి దినాన సున్నతి పొందినా మోషే ధర్మ శాస్త్రాన్ని అతిక్రమించినట్టు కాదు గదా! అలాంటప్పుడు నేను విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని బాగు చేస్తే నా మీద ఎందుకు కోపం చూపుతున్నారు? 24బయటకు కనిపించే దాన్ని బట్టి కాక న్యాయసమ్మతంగా నిర్ణయం చేయండి” అన్నాడు. 25యెరూషలేము వారిలో కొందరు, “వారు చంపాలని వెదకుతున్నవాడు ఈయన కాదా? 26చూడండి, ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నా ఈయనను ఏమీ అనరు. ఈయనే క్రీస్తని అధికారులకి తెలిసి పోయిందా ఏమిటి? 27అయినా ఈయన ఎక్కడి వాడో మనకు తెలుసు. క్రీస్తు వచ్చినప్పుడైతే ఆయన ఎక్కడి వాడో ఎవరికీ తెలియదు” అని చెప్పుకున్నారు. 28కాబట్టి యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ, “మీకు నేను తెలుసు. నేను ఎక్కడ నుండి వచ్చానో కూడా మీకు తెలుసు. నేను నా స్వంతంగా ఏమీ రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు. 29నేను ఆయన దగ్గర నుండి వచ్చాను. ఆయనే నన్ను పంపాడు కాబట్టి నాకు ఆయన తెలుసు” అని గొంతెత్తి చెప్పాడు. 30దానికి వారు ఆయనను పట్టుకోడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు. కాబట్టి ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు.
పత్రిక (జలాల ఆశీర్వాదం)
11పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు. 12ఆయన, “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు. 13ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు. ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు. 14కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు. 15మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు. 16ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. 17దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది. 18ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.
సువార్త (జలాల ఆశీర్వాదం)
1ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు. 2యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. 3(కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 13 మే పౌర కాలెండర్లో 26 మే. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు