హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 25 మే
ఆర్థడాక్స్ కాలెండర్ · మే 12 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 25 మే, 2027
మంగళవారం · పాస్కా నాల్గవ వారం · స్వరం 3
పండుగలు మరియు పరిశుద్ధులు
St. Epiphanius the Bishop of Cyprus († 403)
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
21పేతురు ఆ మనుషుల దగ్గరికి దిగి వెళ్ళి, “మీరు వెదికే వాణ్ణి నేనే. మీరెందుకు వచ్చారు?” అని అడిగాడు. 22అందుకు వారు, “నీతిమంతుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరి దగ్గరా మంచి పేరు సంపాదించిన శతాధిపతి కొర్నేలి అనే ఒకాయన ఉన్నాడు. తన ఇంటికి నిన్ను పిలిపించుకుని నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దూత అతనికి తెలియజేశాడు” అని చెప్పారు. అప్పుడు పేతురు వారిని లోపలికి పిలిచి అతిథ్యమిచ్చాడు. 23తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు. 24ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు. 25పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. 26అయితే పేతురు అతనిని లేపి “లేచి నిలబడు. నేను కూడా మనిషినే” అని చెప్పాడు. 27అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు. 28అప్పుడతడు, “అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషిద్ధమైన వాడుగా, అపవిత్రుడుగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. 29కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు” అని కొర్నేలితో చెప్పాడు. 30అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి 31‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి 32పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. 33వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు. అందుకు పేతురు ఇలా అన్నాడు,
సువార్త
1ఆ తరువాత యేసు గలిలయకు వెళ్ళి అక్కడే సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యూదయలో యూదులు ఆయనను చంపాలని వెతుకుతూ ఉండటంతో అక్కడ సంచరించడానికి ఆయన ఇష్టపడలేదు. 2ఇంతలో యూదుల పర్ణశాలల పండగ సమీపించింది. 3అప్పుడు ఆయన తమ్ముళ్ళు ఆయనతో, “నువ్వు చేసే కార్యాలు నీ శిష్యులు చూడాలి కదా. అందుకే ఈ స్థలం వదిలి యూదయకు వెళ్ళు. 4అందరూ మెచ్చుకోవాలని చూసేవాడు తన పనులు రహస్యంగా చేయడు. నువ్వు నిజంగా ఈ కార్యాలు చేస్తున్నట్టయితే లోకమంతటికీ తెలిసేలా చెయ్యి. నిన్ను నువ్వే చూపించుకో” అన్నారు. 5ఆయన తమ్ముళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచలేదు. 6అప్పుడు యేసు, “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. 7లోకం మిమ్మల్ని ద్వేషించదు. కానీ దాని పనులన్నీ చెడ్డవని నేను సాక్ష్యం చెబుతున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తూ ఉంది. 8మీరు పండక్కి వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నేను ఈ పండక్కి ఇప్పుడే వెళ్ళను” అని వారితో చెప్పాడు. 9వారికి ఇలా చెప్పి ఆయన గలిలయలో ఉండిపోయాడు. 10కానీ తన తమ్ముళ్ళు పండక్కి వెళ్ళిన తరువాత ఆయన బహిరంగంగా కాకుండా రహస్యంగా వెళ్ళాడు. 11ఆ ఉత్సవంలో యూదులు ‘ఆయన ఎక్కడ ఉన్నాడు’ అంటూ ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు. 12ప్రజల మధ్య ఆయనను గురించి పెద్ద వాదం ప్రారంభమైంది. కొందరేమో, “ఆయన మంచివాడు” అన్నారు. మరికొందరు, “కాదు. ఆయన మోసగాడు” అన్నారు. 13అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బయటకు మాట్లాడలేదు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 12 మే పౌర కాలెండర్లో 25 మే. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు