Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 24 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · మే 11 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 24 మే, 2027

సోమవారం · పాస్కా నాల్గవ వారం · స్వరం 3

పండుగలు మరియు పరిశుద్ధులు

Hieromartyr Mocius the Presbyter of Amphipolis in Macedonia († c.295)

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 10; సామె 3; సామె 8 (ఎంచుకున్న వచనాలు)

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 10:31–11:12

31ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు. 32ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. 2గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. 3నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. 4దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. 5యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. 6నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. 7దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. 8ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. 9మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. 10నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. 11నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. 12తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఈ అనువాదంలో లేదు

ఉదయ ప్రార్థన: సువార్త

యోహా 10:1–9

1మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ప్రవేశ ద్వారం గుండా కాకుండా వేరే విధంగా ఎక్కి లోపలికి వచ్చేవాడు దొంగే, వాడు దోపిడీగాడే. 2ప్రవేశ ద్వారం ద్వారా వచ్చేవాడు గొర్రెల కాపరి. 3అతని కోసం కాపలావాడు ద్వారం తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను అతడు పేరు పెట్టి పిలిచి బయటకు నడిపిస్తాడు. 4తన సొంత గొర్రెలనన్నిటిని బయటకి ఎప్పుడు నడిపించినా, వాటికి ముందుగా అతడు నడుస్తాడు. అతని స్వరం గొర్రెలకు తెలుసు కాబట్టి అవి అతని వెంట నడుస్తాయి. 5వేరేవారి స్వరం వాటికి తెలియదు కాబట్టి అవి వారి వెంట వెళ్ళకుండా పారిపోతాయి. 6యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు. 7అందుకు యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు, “మీతో కచ్చితంగా చెబుతున్నాను, గొర్రెల ప్రవేశ ద్వారం నేనే. 8నా ముందు వచ్చిన వారంతా దొంగలు, దోపిడిగాళ్ళే. గొర్రెలు వారి మాట వినలేదు. 9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు.

పత్రిక

అపొ.కా 10:1–16

1కైసరయ పట్టణంలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉండేవాడు. ఇతడు ఇటలీ దళానికి చెందిన ఒక శతాధిపతి. 2అతడు కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. 3మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, “కొర్నేలీ” అని పిలవడం దర్శనంలో స్పష్టంగా చూశాడు. 4అతడు ఆ దూతను తేరి చూసి చాలా భయపడి, “ప్రభూ, ఏమిటి?” అని అడిగాడు. అందుకు దూత, “నీ ప్రార్థనలూ పేదలకు నీవు చేసే దానధర్మాలూ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. 5ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి, పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించుకో. 6అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు. 7ఆ దూత వెళ్ళిన తరువాత కొర్నేలి తన ఇంట్లో పని చేసే ఇద్దర్ని, తనను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉండే భక్తిపరుడైన ఒక సైనికుణ్ణి పిలిచి 8వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపాడు. 9తరువాతి రోజున వారు ప్రయాణమై పోయి పట్టణానికి దగ్గరగా వచ్చేటప్పటికి పగలు సుమారు పన్నెండు గంటల వేళకి పేతురు ప్రార్థన చేసుకోడానికి ఇంటి పైకి వెళ్ళాడు. 10అతనికి బాగా ఆకలిగా ఉండి, భోజనం చేయాలనిపిస్తే ఇంట్లో వారు వంట సిద్ధం చేస్తూ ఉన్నారు. అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై, 11ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు. 12దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి. 13అప్పుడు, “పేతురూ, లేచి చంపుకుని తిను” అనే ఒక శబ్డం అతనికి వినిపించింది. 14అయితే పేతురు, “వద్దు ప్రభూ. నిషిద్ధమైన దానినీ అపవిత్రమైన దానినీ నేనెప్పుడూ తినలేదు” అని జవాబిచ్చాడు. 15“దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధం అనకు” అని మళ్ళీ రెండవసారి ఆ స్వరం అతనికి వినబడింది. 16ఈ విధంగా మూడుసార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.

పత్రిక (పరిశుద్ధుల కోసం)

హెబ్రీ 7:26–8:2

26ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. 8:1ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. 2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.

సువార్త

యోహా 6:56–69

56నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడు నాలో ఉండిపోతాడు. నేను అతనిలో ఉండిపోతాను. 57సజీవుడైన తండ్రి నన్ను పంపాడు. ఆయన వల్లనే నేను జీవిస్తున్నాను. అలాగే నన్ను తినేవాడు కూడా నా వల్ల జీవిస్తాడు. 58పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.” 59ఆయన ఈ మాటలన్నీ కపెర్నహూములోని సమాజ మందిరంలో ఉపదేశిస్తూ చెప్పాడు. 60ఆయన శిష్యుల్లో అనేకమంది ఈ మాటలు విన్నప్పుడు, “ఇది చాలా కష్టమైన బోధ. దీన్ని ఎవరు అంగీకరిస్తారు” అని చెప్పుకున్నారు. 61తన శిష్యులు ఇలా సణుక్కుంటున్నారని యేసుకు తెలిసింది. ఆయన వారితో ఇలా అన్నాడు, “ఈ మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? 62మనుష్య కుమారుడు ఇంతకు ముందు ఉన్న చోటికే ఆరోహణం కావడం చూస్తే మీరు ఏమంటారు? 63జీవాన్ని ఇచ్చేది ఆత్మ. శరీరం వల్ల ప్రయోజనం లేదు. నేను మీతో చెప్పిన మాటలే ఆత్మ. అవే జీవం. 64కానీ మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు.” తన మీద నమ్మకం ఉంచని వారెవరో, తనను పట్టి ఇచ్చేదెవరో యేసుకు మొదటి నుంచీ తెలుసు. 65ఆయన, “నా తండ్రి ఇస్తే తప్ప ఎవరూ నా దగ్గరికి రాలేరని ఈ కారణం బట్టే చెప్పాను” అన్నాడు. 66ఆ తరువాత ఆయన శిష్యుల్లో చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వారు ఆయనను ఇక ఎప్పుడూ అనుసరించలేదు. 67అప్పుడు యేసు, “మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా?” అని తనతో ఉన్న పన్నెండుమంది శిష్యులను అడిగాడు. 68సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, మేము ఇక ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీదగ్గర మాత్రమే నిత్య జీవపు మాటలు ఉన్నాయి. 69నువ్వు దేవుని పరిశుద్ధుడివి అని మేము విశ్వసించాం, తెలుసుకున్నాం” అని చెప్పాడు.

సువార్త (పరిశుద్ధుల కోసం)

మత్తయి 5:14–19

14ప్రపంచానికి మీరు వెలుగుగా ఉన్నారు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు. 15ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడు ఆ దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది. 16మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశించనీయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు. 17“నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు. 18నేను కచ్చితంగా చెబుతున్నాను. ఆకాశం, భూమి నశించే వరకూ ధర్మశాస్త్రమంతా నెరవేరే వరకూ ధర్మశాస్త్రం నుంచి ఒక్క పొల్లు అయినా, ఒక సున్నా అయినా తప్పిపోదు. 19కాబట్టి ఈ ఆజ్ఞల్లో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, ఇతరులకు కూడా అలా చేయమని బోధించేవాణ్ణి పరలోకరాజ్యంలో అతి తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తూ, వాటిని బోధించేవాణ్ణి పరలోక రాజ్యంలో గొప్పవాడుగా లెక్కిస్తారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 11 మే పౌర కాలెండర్‌లో 24 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు