Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 23 మే

ఆర్థడాక్స్ కాలెండర్ · మే 10 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 23 మే, 2027

ఆదివారం · స్వరం 3

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా నాల్గవ ఆదివారం

పక్షవాత రోగి ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 3:21–4:6

21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు. 4:1ప్రియులారా, లోకంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. ప్రతి ఆత్మనూ నమ్మకండి. ఆ ఆత్మలు దేవునికి సంబంధించినవో, కావో, పరీక్షించి చూడండి. 2ఏ ఆత్మైనా దేవునికి చెందినదా లేదా అన్న విషయాన్ని ఈ విధంగా గుర్తించగలుగుతాము. యేసు క్రీస్తు మానవునిగా వచ్చాడు అని అంగీకరించే ప్రతి ఆత్మా దేవునికి చెందినది. 3యేసును అంగీకరించని ప్రతి ఆత్మా దేవుని నుండి వచ్చింది కాదు. అది క్రీస్తు విరోధికి చెందిన ఆత్మ. అది రాబోతున్నదని మీరు విన్నారు. కానీ అది ఇప్పటికే ఈ లోకంలో ఉంది. 4పిల్లలూ, మీరు దేవుని సంబంధులు. మీరు ఆ ఆత్మలను జయించారు. ఎందుకంటే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. 5ఆ ఆత్మలు లోకానికి చెందినవారు కాబట్టి వారు చెప్పేది లోక సంబంధంగా ఉంటుంది. లోకం వారి మాట వింటుంది. 6మనం దేవుని సంబంధులం. దేవుణ్ణి తెలుసుకున్నవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టి ఏ ఆత్మ సత్యమైనదో, ఏ ఆత్మ అసత్యమైనదో మనం తెలుసుకుంటాం.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 4:11–16

11ప్రియులారా, దేవుడు మనలను ఇంతగా ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 12ఎవ్వరూ, ఎన్నడూ, దేవుణ్ణి చూడలేదు. మనం ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే, దేవుడు మనలో నిలిచి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో సంపూర్ణం అవుతుంది. 13దీనివలన మనం ఆయనలో నిలిచి ఉన్నామనీ, ఆయన మనలో నిలిచి ఉన్నాడనీ తెలుసుకుంటాము. ఎందుకంటే, ఆయన తన ఆత్మను మనకిచ్చాడు. 14తండ్రి తన కుమారుణ్ణి ఈ లోక రక్షకుడుగా పంపించడం మేము చూశాము. దానికి మేము సాక్షులం. 15యేసు దేవుని కుమారుడని ఎవరు అంగీకరిస్తారో అతనిలో దేవుడు నిలిచి ఉంటాడు. అతడు దేవునిలో నిలిచి ఉంటాడు. 16దేవునికి మనపై ఉన్న ప్రేమను మనం తెలుసుకుని విశ్వసించాము. దేవుడు ప్రేమ. ప్రేమలో నిలిచి ఉన్నవాడు దేవునిలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 4:20–5:5

20“నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను” అని చెబుతూ, తన సోదరుణ్ణి ద్వేషిస్తే, అతడు అబద్ధికుడే. కనిపిస్తున్న సోదరుణ్ణి ప్రేమించని వాడు, కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు. 21దేవుణ్ణి ప్రేమించేవాడు తన సోదరుణ్ణి కూడా ప్రేమించాలి, అన్న ఆజ్ఞ ఆయన నుండి మనకు ఉంది. 5:1యేసే క్రీస్తు అని నమ్మినవారంతా దేవుని ద్వారా పుట్టినవాళ్ళే. తండ్రిగా అయిన వాణ్ణి ప్రేమించిన వారంతా ఆయన ద్వారా పుట్టినవాణ్ణి కూడా ప్రేమిస్తారు. 2మనం దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, దేవుని పిల్లలను ప్రేమిస్తున్నామని దాని వల్ల మనకు తెలుసు. 3ఆయన ఆజ్ఞలను పాటిస్తే మనం దేవుణ్ణి ప్రేమించినట్టే. ఆయన ఆజ్ఞలు భారం కాదు. 4దేవుని ద్వారా పుట్టినవారు అందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించింది మన విశ్వాసమే. 5లోకాన్ని జయించేది ఎవరు? యేసు దేవుని కుమారుడు అని నమ్మినవాడే!

ఉదయ ప్రార్థన నాల్గవ సువార్త

లూకా 24:1–12

1ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు. 2సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం చూసి లోపలికి వెళ్ళారు. 3కానీ ప్రభు యేసు దేహం వారికి కనబడలేదు. దాంతో వారికేమీ తోచలేదు. 4అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు. 5వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు, “సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు? 6ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు 7మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడవ రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి” అన్నారు. 8అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. 9వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులను పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు. 10ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో ఉన్న యితర స్త్రీలూ. 11అయితే విన్నవారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు. 12అయితే పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.

పత్రిక

అపొ.కా 9:32–42

32ఆ తరువాత పేతురు ఆ ప్రాంతమంతా తిరిగి, లుద్ద అనే ఊరులో నివసిస్తున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు. 33అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పట్టిన ఐనెయ అనే ఒకతన్ని చూసి, 34“ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేశాడు, నీవు లేచి నీ పడక సర్దుకో” అని అతనితో చెప్పగానే 35వెంటనే అతడు పైకి లేచాడు. లుద్దలో, షారోనులో నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభువును విశ్వసించారు. 36యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. (ఈ పేరు గ్రీకులో దొర్కా, అంటే లేడి). ఈమె ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, పేదలను ఆదుకుంటూ ఉండేది. 37ఆ రోజుల్లో ఆమె జబ్బుపడి చనిపోయింది. ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు. 38లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతనిని బతిమాలడానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు. 39పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు. 40పేతురు అందరినీ బయటికి పంపి మోకరించి ప్రార్థన చేశాడు. తరువాత ఆ శవం వైపు తిరిగి, “తబితా, లే” అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూడగానే లేచి కూర్చుంది. 41అతడామె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వారికి అప్పగించాడు. 42ఇది యొప్పే ప్రాంతమంతా తెలిసింది, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.

పత్రిక (పరిశుద్ధ సుమెయోను కోసం)

1 కొరింతీ 4:9–16

9దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం. 10క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం. 11ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం. 12మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం. 13మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు. 14నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు. 15ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

సువార్త

యోహా 5:1–15

1ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు. 2యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి. 3(కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు. 5అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు. 6యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు. 7అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు. 8యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు. 9వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం. 10అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు. 11అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు. 12అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు. 13అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 14ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు. 15వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.

సువార్త (పరిశుద్ధ సుమెయోను కోసం)

మత్తయి 13:53–58

53యేసు ఈ ఉపమానాలు చెప్పి ఊరుకున్న తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్ళి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాల్లో వారికి బోధిస్తూ ఉన్నాడు. వారు ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి? 55ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వారు ఇతని సోదరులు కారా? 56ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి?” అని చెప్పుకుని ఆయన విషయంలో అభ్యంతరపడ్డారు. 57అయితే యేసు, “ఒక ప్రవక్త తన స్వదేశంలో, తన సొంత ఇంట్లో తప్ప మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు” అని వారితో చెప్పాడు. 58వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 10 మే పౌర కాలెండర్‌లో 23 మే. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు