Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 16 మే

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 16 మే, 2027

ఆదివారం · పాస్కా కాలం ఏడవ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

పెంతెకొస్తు ఆదివారం

మహోత్సవం · ఆరాధన రంగు: ఎరుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 2:1–11

1పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. 2అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. 3అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. 4అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు. 5ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. 6ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. 7వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. 8మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? 9పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ 10ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన 11యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 104:1, 24, 29–31, 34

1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. 24యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. 29నీవు ముఖం దాచుకుంటే అవి కలత చెందుతాయి. నీవు వాటి ఊపిరి ఉపసంహరిస్తే అవి ప్రాణం విడిచి మట్టిపాలవుతాయి. 30నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. ఆ విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు. 31యెహోవా మహిమ నిత్యం ఉండుగాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించు గాక. 34ఆయన్ను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండు గాక. నేను యెహోవా విషయం సంతోషిస్తాను.

రెండవ పఠనం

గలతీ 5:16–25

16నేను చెప్పేది ఏమిటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు. 17శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పని చేస్తాయి. ఇవి ఒకదాని కొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు. 18ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. 19శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం, 20విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు, 21శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. 22అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. 23అలాంటి వాటికి వ్యతిరేకంగా ఏ చట్టమూ లేదు. 24క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు. 25మనం దేవుని ఆత్మతో జీవిస్తూ ఉంటే ఆ ఆత్మ ననుసరించి నడుద్దాం.

సువార్త

యోహా 15:26–27; 16:12–15

26“తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు. 16:12“నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు