Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › ఆమోసు › 8

IRV · అధ్యాయం 8 / 9

ఆమోసు 8

1యెహోవా ప్రభువు నాకిది చూపించాడు. అదిగో ఎండాకాలపు పళ్ళ గంప!

2ఆయన “ఆమోసూ, నువ్వేం చూస్తున్నావు?” అని అడిగాడు. నేను “ఎండాకాలపు పళ్ళ గంప” అన్నాను. అప్పుడు యెహోవా నాతో, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చేసింది. ఇక నేను వాళ్ళను వదిలిపెట్టను.

3యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, “మందిరంలో వాళ్ళు పాడే పాటలు ఏడుపులవుతాయి. ఆ రోజు శవాలు విపరీతంగా పడి ఉంటాయి. నిశ్శబ్దంగా వాటిని అన్ని చోట్లా పడేస్తారు” అన్నాడు.

4దేశంలోని పేదలను తీసేస్తూ దీనులను అణిచేసే మీరు ఈ విషయం వినండి.

5వారిలా అంటారు, “మనం ధాన్యం అమ్మడానికి అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుందో? గోదుమల వ్యాపారం చేసుకోడానికి సబ్బాతు ఎప్పుడు పోతుందో? మనం కొలపాత్రను చిన్నదిగా చేసి, వెల పెంచుదాం. తప్పుడు తూకాలతో మనం మోసం చేద్దాం.

6పాడైపోయిన గోదుమలను అమ్మి, వెండికి పేదవారిని కొందాం. దీనులను, ఒక జత చెప్పులకు కొందాం.”

7యాకోబు అతిశయాస్పదం తోడని యెహోవా ఇలా ప్రమాణం చేశాడు. “వారు చేసిన పనుల్లో దేన్నీ నేను మరచిపోను.”

8దీన్ని బట్టి భూమి కంపించదా? అందులో నివసించే వారంతా దుఃఖపడరా? నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశపు నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది.

10మీ పండగలను దుఃఖదినాలుగా మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. మీ అందరి తలలు బోడిచేస్తాను. ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది.

11యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.

12యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు కానీ అది వారికి దొరకదు.

13ఆ రోజు అందమైన కన్యలూ యువకులూ దాహంతో సోలిపోతారు.

14సమరయ పాపంతో ఒట్టు పెట్టుకునే వారు, ‘దాను, నీ దేవుని ప్రాణం మీద ఒట్టు.’ ‘బెయేర్షెబా, దేవుని ప్రాణం మీద ఒట్టు’ అనేవారు ఇంకా ఎన్నడూ లేవలేకుండా కూలిపోతారు.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org