Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 15 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 2 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 15 ఏప్రిల్, 2027

గురువారం · మహా ఉపవాస కాలం ఐదవ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

క్రేతు పరిశుద్ధ అంద్రెయ మహా కానన్

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 42:5–16

5ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, 6“గుడ్డివారి కళ్ళు తెరవడానికీ బందీలను చెరలో నుండి బయటికి తేవడానికీ చీకటి గుహల్లో నివసించే వారిని వెలుగులోకి తేవడానికీ ఆయన వస్తాడు. 7యెహోవా అనే నేనే నీతి గురించి నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. నిన్ను నిలబెట్టి ప్రజలకు ఒక నిబంధనగా యూదేతర జాతులకు వెలుగుగా నియమించాను. 8నేనే యెహోవాను. నా పేరు ఇదే. నా మహిమను మరెవరితోనూ పంచుకోను. నాకు చెందాల్సిన ఘనతను విగ్రహాలకు చెందనియ్యను. 9గతంలో చెప్పిన విషయాలు జరిగాయి కదా, ఇదిగో కొత్త సంగతులు మీకు చెబుతున్నాను. అవి జరగక ముందే వాటిని మీకు వెల్లడి చేస్తున్నాను.” 10సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి. భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి. 11ఎడారీ, పట్టణాలూ, కేదారు ప్రాంతంలోని గ్రామాలూ సంతోషంతో కేకలు వేస్తాయి. సెల ప్రాంతవాసులు పాటలు పాడతారు. పర్వతశిఖరాల నుండి వారు కేకలు వేస్తారు. 12ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు. 13యెహోవా శూరునిలాగా బయటికి కదిలాడు. యోధునిలాగా రోషంతో ఆయన బయలుదేరాడు. తన శత్రువులను ఎదిరిస్తూ ఆయన హుంకరిస్తాడు. వారికి తన శూరత్వాన్ని కనపరుస్తాడు. 14చాలాకాలం నుండి నేను మౌనంగా ఉన్నాను. నన్ను నేను అణచుకుంటూ మాట్లాడకుండా ఉన్నాను. ప్రసవ వేదనతో ఉన్న స్త్రీలాగా నేను బలవంతంగా ఊపిరి తీస్తూ ఒగరుస్తూ ఉన్నాను. 15పర్వతాలూ కొండలూ పాడైపోయేలా, వాటి మీద ఉన్న చెట్లన్నిటినీ ఎండిపోయేలా చేస్తాను. నదులను ద్వీపాలుగా మారుస్తాను. నీటి మడుగులు ఆరిపోయేలా చేస్తాను. 16గుడ్డివారిని వారికి తెలియని దారిలో తీసుకువస్తాను. వారు నడవని మార్గాల్లో వారిని నడిపిస్తాను. వారి చీకటిని వెలుగుగా, వంకరదారులను తిన్నగా చేస్తాను. ఈ పనులన్నీ నేను చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 18:20–33

20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక 21నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.” 22ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు. 23అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా? 24ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా? 25నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?” 26దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు. 27అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. 28యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు. 29అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు. 30అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 31అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు. 32చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు. 33అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 16:17–17:17

17నిజాయితీపరులకు దుష్ట ప్రవర్తన విడిచి నడుచుకోవడమే రాజమార్గం వంటిది. తన ప్రవర్తన కనిపెట్టుకుని ఉండేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. 18ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది. 19దుర్మార్గులతో కలసి దోచుకున్న సొమ్ము పంచుకోవడం కంటే, వినయంతో దీన మనస్కులతో ఉండడం మంచిది. 20ఉపదేశం శ్రద్ధగా ఆలకించే వారికి మేలు కలుగుతుంది. యెహోవాను ఆశ్రయం కోరేవాడు ధన్యుడు. 21హృదయంలో జ్ఞానం నిండి ఉన్నవాడు వివేకవంతుడు. మధురమైన మాటలు విద్యాభివృద్ది కలిగిస్తాయి. 22తెలివిగల వారికి వారి జ్ఞానం జీవం కలిగించే ఊట వంటిది. మూఢులకు వారి మూర్ఖత్వమే శిక్షగా మారుతుంది. 23జ్ఞాని హృదయం వాడికి తెలివి బోధిస్తుంది. వాడి పెదాలకు నమ్రత జోడిస్తుంది. 24మధురమైన మాటలు కమ్మని తేనె వంటివి. అవి ప్రాణానికి మాధుర్యం, ఎముకలకు ఆరోగ్యం. 25ఒకడు నడిచే బాట వాడి దృష్టికి యథార్థం అనిపిస్తుంది. చివరకూ అది మరణానికి నడిపిస్తుంది. 26కూలివాడి ఆకలే వాడి చేత అని చేయిస్తుంది. వాడి క్షుద్బాధ వాడు పనిచేసేలా తొందరపెడుతుంది. 27దుష్టులు కీడు కలిగించడం కోసం కారణాలు వెతుకుతారు. వారి పెదాల మీద కోపాగ్ని రగులుతూ ఉంటుంది. 28మూర్ఖుడు కలహాలు కల్పిస్తాడు. చాడీలు చెప్పేవాడు మిత్రులను విడదీస్తాడు. 29దౌర్జన్యం చేసేవాడు తన పొరుగువాణ్ణి మచ్చిక చేసుకుంటాడు. చెడు మార్గంలో అతణ్ణి నడిపిస్తాడు. 30కళ్ళు మూస్తూ పెదవులు బిగబట్టేవారు, కుయుక్తులు పన్నేవారు కీడు కలిగించే వారు. 31నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం వంటివి. అవి న్యాయమార్గంలో నడుచుకునే వారికి దక్కుతాయి. 32పరాక్రమం గల యుద్ధవీరుని కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణాలను స్వాధీనం చేసుకునేవాడి కంటే తన మనస్సును అదుపులో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడు. 33చీట్లు ఒడిలో వేస్తారు. నిర్ణయం యెహోవాదే. 17:1ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది. 2బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు. 3వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే. 4చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు. 5పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు. 6మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే. 7అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు. 8లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది. 9ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు. 10బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది. 11దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు. 12మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం. 13మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు. 14పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి. 15దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం. 16బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా? 17స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 2 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 15 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు