హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 13 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 31 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 13 ఏప్రిల్, 2027
మంగళవారం · మహా ఉపవాస కాలం ఐదవ వారం · స్వరం 4
పండుగలు మరియు పరిశుద్ధులు
St. Hypatius the Wonderworker and Bishop of Gangra († c. 326)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
18కాబట్టి మీరు దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? ఏ విగ్రహ రూపాన్ని ఆయనకు సమానం చేస్తారు? 19విగ్రహాన్ని గమనిస్తే, ఒక శిల్పి దాన్ని పోతపోస్తాడు. కంసాలి దాన్ని బంగారు రేకులతో పొదిగి దానికి వెండి గొలుసులు చేస్తాడు. 20విలువైన దాన్ని అర్పించలేని పేదవాడు పుచ్చిపోని చెక్కను తీసుకొస్తాడు. స్థిరంగా నిలిచే విగ్రహాన్ని చేయడానికి నేర్పుగల పనివాణ్ణి పిలుస్తాడు. 21మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటి నుండి ఎవరూ మీతో చెప్పలేదా? భూమి పునాదులు చూసి మీరు దాన్ని గ్రహించలేదా? 22ఆయన భూమండలానికి పైగా ఆసీనుడు అయ్యాడు దాని నివాసులు ఆయన ఎదుట మిడతల్లాగా కనబడుతున్నారు. ఒకడు ఒక తెరను విప్పినట్లు ఆయన ఆకాశాలను పరచి ఒక గుడారంలాగా దాన్ని నివాసస్థలంగా ఏర్పరిచాడు. 23రాజులను ఆయన శక్తిహీనులుగా చేస్తాడు. భూమిని పాలించే వారిని నిరర్ధకం చేస్తాడు. 24చూడు, వారు నాటారో లేదో, వారు పాతిపెట్టారో లేదో, వారి కాండం భూమిలో వేరు తన్నిందో లేదో, ఆయన వారి మీద ఊదీ ఊదగానే వారు వాడిపోతారు. సుడిగాలి పొట్టును ఎగర గొట్టినట్టు ఆయన వారిని ఎగరగొడతాడు. 25“ఇతడు నీతో సమానుడు అని మీరు నన్నెవరితో పోలుస్తారు?” అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. 26మీ కళ్ళు పైకెత్తి చూడండి. ఆ నక్షత్రాలన్నిటినీ ఎవరు సృజించారు? వాటిని వరుసలో నిలిపి వాటి పేరుల చొప్పున పిలిచేవాడే గదా. తన అధికశక్తి చేతా తన బలాతిశయం చేతా ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు. 27యాకోబూ “నా మార్గం యెహోవాకు తెలియదు, నా న్యాయం నా దేవునికి కనబడదు” అని నీవెందుకు అంటున్నావు? ఇశ్రాయేలూ, నీవెందుకు ఇలా చెబుతున్నావు? 28నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతాలను సృజించిన యెహోవా నిత్యం ఉండే దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలసిపోడు. ఆయన జ్ఞానాన్ని గ్రహించడం అసాధ్యం. 29అలసిన వారికి బలమిచ్చేది ఆయనే. శక్తిహీనులకు నూతనోత్తేజం కలిగించేది ఆయనే. 30యువకులు సైతం అలసిపోతారు, కుర్రవాళ్ళు కూడా తప్పకుండా సోలిపోతారు. 31అయితే యెహోవా కోసం కనిపెట్టే వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల్లాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలసిపోకుండా పరుగెత్తుతారు, సోలిపోకుండా నడిచిపోతారు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. 2అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు. 4యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. 5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు. 6అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. 7యెహోవా “నీకు ఈ ప్రదేశాన్ని వారసత్వంగా ఇవ్వడానికి కల్దీయుల ఊర్ అనే పట్టణంలో నుంచి నిన్ను ఇవతలకు తీసుకువచ్చిన యెహోవాను నేనే” అని చెప్పినప్పుడు 8అతడు “ప్రభూ యెహోవా, ఇది నాకు సొంతం అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 9ఆయన “మూడేళ్ళ వయసు ఉన్న ఒక దూడ, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్ల గువ్వ, ఒక పావురం పిల్లను నా దగ్గరికి తీసుకురా” అని అతనితో చెప్పాడు. 10అతడు వాటిని తీసుకుని వాటిని సగానికి రెండు ముక్కలుగా నరికి, రెండు సగాలను ఎదురెదురుగా పెట్టాడు. పక్షులను మాత్రం ఖండించలేదు. 11ఆ మృతదేహాల మీద గద్దలు వాలగా అబ్రాము వాటిని తోలివేశాడు. 12చీకటి పడుతున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టింది. భయం కలిగించే చిమ్మచీకటి అతణ్ణి ఆవరించింది. 13ఆయన “దీన్ని కచ్చితంగా తెలుసుకో. నీ వారసులు తమది కాని దేశంలో పరదేశులుగా నివాసం ఉంటారు. ఆ దేశవాసులకు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అణచివేతకు గురి అవుతారు. 14వీళ్ళు దాసులుగా ఉన్న ఆ దేశానికి నేను తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వాళ్ళు అపారమైన సంపదతో బయటకు వస్తారు. 15కాని, నువ్వు నీ తండ్రుల దగ్గరికి ప్రశాంతంగా చేరుకుంటావు. పండు ముసలితనంలో నువ్వు మరణించగా నిన్ను పాతిపెడతారు.
సాయంకాల ప్రార్థన: పఠనం
7జ్ఞానుల మాటలు తెలివిని వ్యాప్తి చేస్తాయి. మూర్ఖుల మనస్సు స్థిరంగా ఉండదు. 8భక్తిహీనులు అర్పించే బలులంటే యెహోవాకు అసహ్యం. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం. 9దుర్మార్గుల మార్గాలు యెహోవాకు హేయమైనవి. నీతిని అనుసరించి నడుచుకునే వారిని ఆయన ప్రేమిస్తాడు. 10సన్మార్గం విడిచిపెట్టిన వాడు తీవ్ర కష్టాలపాలౌతాడు. దిద్దుబాటును వ్యతిరేకించే వారు మరణిస్తారు. 11మృత్యులోకం, నాశనకరమైన అగాధం యెహోవాకు తేటగా కనబడుతున్నాయి. మనుషుల హృదయాలు ఆయనకు మరింత తేటగా కనబడతాయి గదా? 12అపహాసకుడు తనకు బుద్ధి చెప్పే వాళ్ళను ప్రేమించడు. వాడు జ్ఞానుల మంచి మాటల కోసం వారి దగ్గరికి వెళ్లడు. 13ఆనందంగా ఉండే హృదయం వదనాన్ని వికసించేలా చేస్తుంది. మనోవేదన ఆత్మను కృంగదీస్తుంది. 14తెలివి గలవారి మనస్సు జ్ఞానం కోసం వెదుకుతుంది. మూర్ఖులు మూఢత్వంతోనే తమ జీవనం సాగిస్తారు. 15దీనస్థితిలో ఉన్నవారి కాలమంతా దుర్భరం. మానసిక ఆనందం గల వారికి నిత్యం విందే. 16విస్తారమైన సంపద కలిగి నెమ్మది లేకుండా ఉండడం కంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉన్నదానితో జీవించడం ఉత్తమం. 17ద్వేషం నిండిన ఇంట్లో కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ ఉన్న చోట ఆకుకూరల భోజనం తినడం మేలు. 18ముక్కోపి కలహాలు రేపుతాడు. ఓర్పు గలవాడు వివాదాలు శాంతింపజేస్తాడు. 19సోమరిపోతుల బాట ముళ్లకంచె వంటిది. నీతిమంతులు రాజమార్గంలో పయనిస్తారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 31 మార్చి పౌర కాలెండర్లో 13 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు