Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 3 ఏప్రిల్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 3 ఏప్రిల్, 2027

శనివారం · పాస్కా అష్టదినాలు

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా అష్టదినాలలో శనివారం

మహోత్సవం · ఆరాధన రంగు: తెలుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 4:13–21

13వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. 14బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. 15అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, 16‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. 17అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు. 18అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. 19అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. 20మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు. 21ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 118:1, 14–16, 18–21

1యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 14యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. 15నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది. 16యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. 18యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. 19నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను. 20ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు. 21నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.

సువార్త

మార్కు 16:9–15

9వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. 10ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. 11యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు. 12ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు. 13వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు. 14ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు. 15యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు