Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 2 ఏప్రిల్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 2 ఏప్రిల్, 2027

శుక్రవారం · పాస్కా అష్టదినాలు

పండుగలు మరియు పరిశుద్ధులు

పాస్కా అష్టదినాలలో శుక్రవారం

మహోత్సవం · ఆరాధన రంగు: తెలుపు

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

అపొ.కా 4:1–12

1పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. 2వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. 3వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. 4కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు. 5మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. 6ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. 7వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. 8పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, 9ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. 10మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. 11ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. 12ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.”

ప్రతిస్పందన కీర్తన

కీర్త 118:1–2, 4, 22–27

1యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. 4ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక. 22ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. 23ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. 24ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము. 25యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు. 26యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము. 27యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.

సువార్త

యోహా 21:1–14

1ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే 2సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు. 3సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. 4తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. 5యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” 6అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు. 7అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. 8ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. 10అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. 11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. 12అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు