హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 2 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 20 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 2 ఏప్రిల్, 2027
శుక్రవారం · మహా ఉపవాస కాలం మూడవ వారం · స్వరం 2
పండుగలు మరియు పరిశుద్ధులు
Venerable Fathers slain at the Monastery of Saint Sabbas: John, Sergius, Patrick and others († 796)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
2చెట్లు లేని కొండ మీద గుర్తు కోసం ఒక జెండా పాతండి. ప్రజలు ప్రధానుల ద్వారాల్లో ప్రవేశించమని కేకపెట్టి వాళ్ళను పిలిచి, చెయ్యి ఊపి సైగ చెయ్యండి. 3నాకు ప్రతిష్ఠితులైన వాళ్లకు నేను ఆజ్ఞ ఇచ్చాను. నా కోపం అమలు చెయ్యమని నా శూరులను పిలిచాను. నా ప్రభావాన్నిబట్టి ఆనందించే వాళ్ళను పిలిపించాను. 4కొండల్లో ఒక పెద్ద జనసమూహం ఉన్నట్టు వినిపిస్తున్న ఆ శబ్దం వినండి. సమకూడుతున్న రాజ్యాల ప్రజలు చేసే అల్లరి శబ్దం వినండి. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా యుద్ధం కోసం తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. 5సర్వలోకాన్ని పాడు చెయ్యడానికి దూర దేశం నుంచీ, ఆకాశపు అంచుల నుంచీ యెహోవా, ఆయన తీర్పు అమలు చేసే సాధనాలు వస్తున్నారు. 6బిగ్గరగా అరవండి, ఎందుకంటే, యెహోవా దినం దగ్గరపడింది. అది సర్వశక్తుడైన దేవుని దగ్గర నుండి విధ్వంసం తెస్తుంది. 7అందువలన చేతులన్నీ బలహీనమై వేలాడతాయి, ప్రతివాడి గుండె కరిగిపోతుంది. 8ప్రజలు భయభ్రాంతులౌతారు. పురిటినొప్పులు పడే స్త్రీలాగా వాళ్లకు వేదనలు, దుఃఖాలు కలుగుతాయి. ఒకరినొకరు విస్తుపోయి చూసుకుంటారు. వాళ్ళ ముఖాలు మండిపోతూ ఉంటాయి. 9యెహోవా దినం వస్తోంది. దేశాన్ని పాడు చెయ్యడానికీ, పాపులు దానిలో ఉండకుండా పూర్తిగా నాశనం చెయ్యడానికీ క్రూరమైన ఉగ్రతతో, ప్రచండమైన కోపంతో అది వస్తోంది. 10ఆకాశ నక్షత్రాలు, నక్షత్రరాసులు తమ వెలుగును ఇయ్యవు. ఉదయం నుంచే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు ప్రకాశించడు. 11చెడుతనాన్ని బట్టి ఈ లోకాన్నీ, తమ దోషాన్ని బట్టి దుష్టులనూ శిక్షిస్తాను. గర్విష్టుల అహంకారం అంతమొందిస్తాను. క్రూరుల అహంకారం అణిచివేస్తాను. 12బంగారం కన్నా మనుషులనూ, ఓఫీరు దేశపు సువర్ణం కన్నా మానవజాతినీ అరుదుగా ఉండేలా చేస్తాను. 13సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.
సాయంకాల ప్రార్థన: పఠనం
4ఏడవ నెల పదిహేడవ రోజున అరారాతు కొండలమీద ఓడ నిలిచింది. 5పదో నెల వరకూ నీళ్ళు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. పదోనెల మొదటి రోజున కొండల శిఖరాలు కనిపించాయి. 6నలభై రోజులు గడిచిన తరువాత నోవహు ఓడ కిటికీ తీసి 7ఒక బొంతకాకిని బయటకు పోనిచ్చాడు. అది బయటకు వెళ్ళి భూమిమీద నుంచి నీళ్ళు ఇంకిపోయేవరకూ ఇటూ అటూ తిరుగుతూ ఉంది. 8నీళ్ళు నేలమీదనుంచి తగ్గాయో లేదో చూడడానికి అతడు తన దగ్గరనుంచి ఒక పావురాన్ని బయటకు వదిలాడు. 9భూమి అంతటా నీళ్ళు నిలిచి ఉన్నందువల్ల దానికి అరికాలు మోపడానికి స్థలం దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని దగ్గరికి తిరిగి వచ్చింది. అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. 10అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని ఓడలోనుంచి బయటకు పంపాడు. 11సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు. 12అతడు మరో ఏడు రోజులు ఆగి ఆ పావురాన్ని బయటకు పంపాడు. అది అతని దగ్గరికి తిరిగి రాలేదు. 13ఆరువందల ఒకటో సంవత్సరం మొదటి నెల మొదటి రోజున నీళ్ళు భూమి మీద నుంచి ఇంకిపోయాయి. నోవహు ఓడ కప్పు తీసి చూడగా ఆరిన నేల కనబడింది. 14రెండో నెల ఇరవై ఏడో రోజున భూమి పొడిగా అయిపోయింది. 15అప్పుడు దేవుడు నోవహుతో, 16“నువ్వు, నీతోపాటు నీ భార్య, నీ కొడుకులు, కోడళ్ళు ఓడలోనుంచి బయటకు రండి. 17పక్షులను, పశువులను భూమి మీద పాకే ప్రతి జాతి పురుగులను, శరీరం ఉన్న ప్రతి జీవినీ నీతోపాటు ఉన్న ప్రతి జంతువును నువ్వు వెంటబెట్టుకుని బయటకు రావాలి. అవి భూమిమీద అధికంగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందాలి” అని చెప్పాడు. 18కాబట్టి నోవహు, అతనితోపాటు అతని కొడుకులు అతని భార్య, అతని కోడళ్ళు బయటకు వచ్చారు. 19ప్రతి జంతువు, పాకే ప్రతి పురుగు, ప్రతి పక్షి, భూమి మీద తిరిగేవన్నీ వాటి వాటి జాతుల ప్రకారం ఆ ఓడలోనుంచి బయటకు వచ్చాయి. 20అప్పుడు నోవహు యెహోవాకు పవిత్రమైన పశువులు, పక్షులన్నిట్లో నుంచి కొన్నిటిని తీసి హోమబలి అర్పించాడు. 21యెహోవా ఆ ఇంపైన వాసన ఆస్వాదించి “వారి హృదయాలు బాల్యం నుంచే దుష్టత్వం వైపు మొగ్గుచూపాయి. ఇక ఎప్పుడూ మనుషులను బట్టి భూమిని కీడుకు గురిచేయను. నేనిప్పుడు చేసినట్టు ప్రాణం ఉన్నవాటిని ఇకపై ఎన్నడూ నాశనం చెయ్యను.
సాయంకాల ప్రార్థన: పఠనం
31ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు. 32ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. 11:1దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం. 2గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు. 3నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది. 4దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు. 5యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు. 6నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు. 7దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి. 8ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు. 9మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు. 10నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి. 11నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి. 12తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 20 మార్చి పౌర కాలెండర్లో 2 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు