హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 1 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 19 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 1 ఏప్రిల్, 2027
గురువారం · మహా ఉపవాస కాలం మూడవ వారం · స్వరం 2
పండుగలు మరియు పరిశుద్ధులు
Holy Martyrs Chrysanthus and Daria and with them Martyrs Claudius the Tribune with his wife Hilaria and their sons Jason and Maurus, and Diodorus the Priest and Marianus the Deacon at Rome († 283)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
10ఆ రోజున ప్రజలకు ధ్వజంగా యెష్షయి వేరు నిలుస్తుంది. జాతులు ఆయన కోసం వెదకుతాయి. ఆయన విశ్రమించే స్థలం ప్రభావం కలది అవుతుంది. 11ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు. 12జాతులను పోగు చెయ్యడానికి ఆయన ఒక ధ్వజం నిలబెట్టి, బహిష్కరణకు గురైన ఇశ్రాయేలీయులను పోగుచేస్తాడు. చెదిరి పోయిన యూదా వాళ్ళను భూమి నలుదిక్కుల నుంచి సమకూరుస్తాడు. 13ఎఫ్రాయిముకున్న అసూయను నిలువరిస్తాడు. యూదా పట్ల విరోధంగా ఉన్న వాళ్ళు నిర్మూలమౌతారు. ఎఫ్రాయిము యూదాను బట్టి అసూయ పడడు. యూదా ఎఫ్రాయిమును బాధించడు 14వాళ్ళు పడమటివైపు ఉన్న ఫిలిష్తీయుల కొండల మీదకి దూసుకొస్తారు. వాళ్ళు ఏకమై తూర్పు వారిని కొల్లగొడతారు. వాళ్ళు ఎదోము మీద, మోయాబు మీద దాడి చేస్తారు, అమ్మోనీయులు వాళ్లకు విధేయులౌతారు. 15యెహోవా ఐగుప్తు సముద్రం అగాధాన్ని విభజిస్తాడు. చెప్పులు తడవకుండా మనుషులు దాన్ని దాటి వెళ్ళేలా తన వేడి ఊపిరిని ఊది, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించి, ఏడు కాలువలుగా దాన్ని చీలుస్తాడు. 16ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు వచ్చిన రోజున వాళ్లకు దారి ఉన్నట్టు, అష్షూరులో మిగిలిన ఆయన ప్రజలు అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్లకు రాజమార్గం ఉంటుంది. 12:1ఆ రోజున మీరు ఇలా అంటారు, “యెహోవా, నువ్వు నా మీద కోపపడ్డావు, నీ కోపం చల్లారింది, నిన్ను స్తుతిస్తున్నాను. నువ్వు నన్ను ఆదరించావు. 2చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.”
సాయంకాల ప్రార్థన: పఠనం
11నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. 12నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. 13ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు. 14వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి. 15శ్వాస తీసుకోగలిగి, శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేశించాయి. 16ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు. 17ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. 18నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది. 19ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. 20ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి. 21పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. 22పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. 23మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. 24నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి. 8:1దేవుడు నోవహును, అతనితోపాటు ఓడలో ఉన్న ప్రతి జంతువునూ, పశువునూ జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు భూమి మీద గాలి విసిరేలా చేయడంవల్ల నీళ్ళు తగ్గుముఖం పట్టాయి. 2అగాధజలాల ఊటలు, ఆకాశపు కిటికీలు మూసుకొన్నాయి. ఆకాశం నుంచి కురుస్తున్న భీకర వర్షం ఆగిపోయింది. 3అప్పుడు నీళ్ళు భూమి మీద నుంచి క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చాయి. నూట ఏభై రోజుల తరువాత నీళ్ళు తగ్గిపోయాయి.
సాయంకాల ప్రార్థన: పఠనం
1జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు. 2భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు. 3ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు. 4శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది. 5బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు. 6నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది. 7నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది. 8జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు. 9నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది. 10కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు. 11నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు. 12ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది. 13వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం. 14జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి. 15ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం. 16నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది. 17బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు. 18అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు. 19వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు. 20ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి. 21నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు. 22యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 19 మార్చి పౌర కాలెండర్లో 1 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు