హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 25 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 12 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 25 మార్చి, 2027
గురువారం · మహా ఉపవాస కాలం రెండవ వారం · స్వరం 1
పండుగలు మరియు పరిశుద్ధులు
Venerable Theophanes the Confessor of Sigriane († 818)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
1రాజైన ఉజ్జియా చనిపోయిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంపై ప్రభువు కూర్చుని ఉండగా నేను చూశాను. ఆయన అంగీ అంచులు దేవాలయాన్ని నింపివేశాయి. 2ఆయనకు పైగా సెరాపులు నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలున్నాయి. ప్రతివాడూ రెండు రెక్కలతో తన ముఖాన్ని, రెంటితో తన కాళ్లను కప్పుకుంటూ రెంటితో ఎగురుతున్నారు. 3వారు “సేనల ప్రభువు యెహోవా, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. లోకమంతా ఆయన మహిమతో నిండి ఉంది” అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. 4వారి కంఠస్వరానికి తలుపులు, గడపలు కంపిస్తున్నాయి. మందిరం నిండా పొగ అలుముకుంది. 5నేను “అయ్యో, నావి అపవిత్రమైన పెదాలు. అపవిత్రమైన పెదాలున్న జనం మధ్య నివసిస్తున్నాను. నేను నశించాను. రాజు, సేనల ప్రభువు అయిన యెహోవాను నేను కన్నులారా చూశాను” అనుకున్నాను. 6అప్పుడు ఆ సెరాపుల్లో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో ఎర్రగా కాలిన నిప్పు తీసి నా దగ్గరికి ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించాడు. 7“ఇది నీ పెదాలకు తగిలింది గనక నీ పాపానికి ప్రాయశ్చిత్తం అయింది. నీ దోషం తొలగి పోయింది” అన్నాడు. 8అప్పుడు “నేను ఎవరిని పంపాలి? మా పక్షంగా ఎవరు వెళ్తారు?” అని ప్రభువు అంటుండగా విన్నాను. అప్పుడు నేను “ఇదుగో నేనున్నాను, నన్ను పంపు” అన్నాను. 9ఆయన “నీవు వెళ్లి ఈ ప్రజలతో చెప్పు. మీరు అస్తమానం వింటూ ఉంటారు గానీ గ్రహించరు. ఎప్పుడూ చూస్తుంటారు గానీ తెలుసుకోరు. 10వారు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని, స్వస్థత పొందకుండా ఉండేలా ఈ ప్రజల హృదయం కొవ్వెక్కేలా చేసి, వారి చెవులకు చెవుడు, వారి కళ్ళకు గుడ్డితనం కలిగించు” అని చెప్పాడు. 11“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా, 12యెహోవా ప్రజలను దూరప్రాంతానికి తీసుకు పోయే దాకా, దేశం నిర్జనమై చవిటిపర్ర అయ్యే దాకా.”
సాయంకాల ప్రార్థన: పఠనం
1ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు. 2వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు. 3ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు. 4షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. 5ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు. 6షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు. 7ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 8షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు. 9ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు. 10కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 11ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు. 12కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు. 13మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 14కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు. 15మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు. 16యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 17మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు. 18యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు. 19హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 20యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు. 21హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు. 22మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు. 23హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు. 24హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
సాయంకాల ప్రార్థన: పఠనం
3కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో. 4నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో. 5వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో. 6సోమరీ, చీమల దగ్గరికి వెళ్ళు. వాటి పద్ధతులు చూసి జ్ఞానం తెచ్చుకో. 7వాటికి న్యాయం తీర్చే అధికారి ఉండడు. వాటిపై అధికారం చెలాయించేవాడు ఉండడు. 8అయినప్పటికీ అవి ఎండాకాలంలో తమకు తిండి సిద్ధం చేసుకుంటాయి. పంట కోత కాలంలో ఆహారం సమకూర్చుకుంటాయి. 9సోమరీ, ఎంతసేపటి వరకూ నిద్రపోతూ ఉంటావు? ఎప్పుడు నిద్రలేస్తావు? 10ఇంకా ఎంతసేపు కునికిపాట్లు పడుతూ “కొంచెం సేపు నిద్రపోతాను, కాస్సేపు చేతులు ముడుచుకుని పడుకుంటాను” అనుకుంటావు? 11అందువల్ల దోపిడీ దొంగ వచ్చినట్టు దరిద్రం నీకు ప్రాప్తిస్తుంది. ఆయుధం ధరించిన శత్రువు వలే లేమి నీ దగ్గరికి వస్తుంది. 12కుటిలంగా మాట్లాడేవాడు దుర్మార్గుడు, నిష్ప్రయోజకుడు. 13వాడు కన్ను గీటుతూ కాళ్లతో సైగలు చేస్తాడు. చేతి వేళ్లతో గుర్తులు చూపిస్తాడు. 14వాడి హృదయం దుష్ట స్వభావంతో ఉంటుంది. వాడు ఎప్పుడూ కీడు తలపెట్టాలని చూస్తాడు. 15అలాంటివాడి మీదికి హఠాత్తుగా ప్రమాదం ముంచుకు వస్తుంది. ఆ క్షణంలోనే వాడు తిరిగి లేవకుండా కూలిపోతాడు. 16యెహోవాకు అసహ్యం కలిగించేవి ఆరు అంశాలు. ఈ ఏడు పనులు ఆయన దృష్టిలో నీచ కార్యాలు. 17అవేమిటంటే, గర్వంతో కూడిన చూపు, అబద్ధాలు చెప్పే నాలుక, నీతిమంతులను చంపే చేతులు, 18దుష్టతలంపులు ఉన్న హృదయం, కీడు చేయడానికి తొందరపడుతూ పరిగెత్తే పాదాలు, 19లేనివాటిని ఉన్నవన్నట్టు, ఉన్నవాటిని లేవన్నట్టు అబద్ధాలు చెప్పే సాక్షి, అన్నదమ్ముల్లో కలహాలు పుట్టించేవాడు. 20కుమారా, నీ తండ్రి బోధించే ఆజ్ఞలు పాటించు. నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని నిర్ల్యక్షం చెయ్యకు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 12 మార్చి పౌర కాలెండర్లో 25 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు