హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 24 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 11 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 24 మార్చి, 2027
బుధవారం · మహా ఉపవాస కాలం రెండవ వారం · స్వరం 1
పండుగలు మరియు పరిశుద్ధులు
Holy Hierarch Sophronius the Patriarch of Jerusalem (638-644)
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
16సేనల ప్రభువు యెహోవాయే తన న్యాయాన్ని బట్టి ఘనత పొందుతాడు. పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన పరిశుద్ధతను కనపరుస్తాడు. 17అప్పుడు ధనికుల స్థలాలు గొర్రెలకు మేత బీడుగా ఉంటాయి. వారి శిథిలాల్లో గొర్రెపిల్లలు మేస్తాయి. 18శూన్యత తాళ్ళతో అతిక్రమాన్ని లాక్కుంటూ ఉండే వారికి బాధ. మోకులతో పాపాన్ని లాగే వారికి బాధ. 19“దేవుడు త్వరపడాలి. ఆయన వెంటనే పని జరిగించాలి, మేము ఆయన కార్యాలు చూడాలి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలిసేలా అది కార్యరూపం దాల్చాలి” అనే వారికి బాధ. 20కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ. 21తమ దృష్టికి తాము జ్ఞానులమనీ తమ అంచనాలో తాము బుద్ధిమంతులమనీ ఊహించుకునే వారికి బాధ. 22ద్రాక్షారసం తాగడంలో పేరు తెచ్చుకున్న వారికి, మద్యం కలపడంలో చాతుర్యం గల వారికి బాధ. 23వారు లంచం పుచ్చుకుని దుర్మార్గుణ్ణి వదిలేస్తారు. నిర్దోషి హక్కులు హరిస్తారు. 24అగ్నిజ్వాల చెత్త పరకలను కాల్చివేసినట్టు, ఎండిన గడ్డి మంటలో భస్మమై పోయినట్టు వారి వేరు కుళ్లి పోతుంది. వారి పువ్వు ధూళివలె కొట్టుకుపోతుంది. ఎందుకంటే వారు సేనల ప్రభువు యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపెట్టారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాక్కును కొట్టి పారేసారు. 25దాన్నిబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతున్నది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టాడు. పర్వతాలు వణుకుతున్నాయి. వీధుల్లో వారి శవాలు చెత్తలాగా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు. కొట్టడానికి ఆయన చెయ్యి ఇంకా చాపి ఉంది.
సాయంకాల ప్రార్థన: పఠనం
16కాబట్టి కయీను యెహోవా సన్నిధిలోనుంచి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పువైపు ఉన్న నోదు ప్రాంతంలో నివాసం ఉన్నాడు. 17కయీను తన భార్యను కలిసినప్పుడు ఆమె గర్భం ధరించి హనోకుకు జన్మనిచ్చింది. అతడు ఒక ఊరు కట్టించి దానికి తన కొడుకు పేర హనోకు అని పెట్టాడు. 18హనోకు ఈరాదుకు తండ్రి. ఈరాదు మహూయాయేలుకు తండ్రి. మహూయాయేలు మతూషాయేలుకు తండ్రి. మతూషాయేలు లెమెకుకు తండ్రి. 19లెమెకు ఇద్దరిని పెళ్ళి చేసుకున్నాడు. వారిలో ఒకామె పేరు ఆదా, రెండవ ఆమె సిల్లా. 20ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. అతడు పశువులు పెంపకం చేస్తూ గుడారాల్లో నివాసం ఉండేవాళ్లకు మూలపురుషుడు. 21అతని తమ్ముడు యూబాలు. ఇతను తీగె వాయుద్యాలు, వేణువు వాయించే వాళ్ళందరికీ మూలపురుషుడు. 22సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా. 23లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు. “ఆదా, సిల్లా, నా మాట వినండి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించండి. నన్ను గాయపరచినందుకు నేను ఒక మనిషిని చంపాను. కమిలిపోయేలా కొట్టినందుకు ఒక యువకుణ్ణి చంపాను. 24ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.” 25ఆదాము మళ్ళీ తన భార్యను కలిసినప్పుడు ఆమె ఒక కొడుకును కన్నది. అతనికి షేతు అని పేరు పెట్టి “కయీను చంపిన హేబెలుకు బదులుగా దేవుడు నాకు మరొక కొడుకును ఇచ్చాడు” అంది. 26షేతుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ఎనోషు. అప్పటినుండి మనుషులు యెహోవాను ఆరాధించడం ఆరంభించారు.
సాయంకాల ప్రార్థన: పఠనం
15నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు. 16నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా? 17పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా. 18నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు. 19ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు. 20కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు? 21మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు. 22దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు. 23అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు. 6:1కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు, 2నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు. 3కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 11 మార్చి పౌర కాలెండర్లో 24 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు