Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 16 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 3 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 16 మార్చి, 2027

మంగళవారం · మహా ఉపవాస కాలం మొదటి వారం · స్వరం 8

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyrs Eutropius, Cleonicus and Basiliscus of Amasea († c. 308)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 1:19–2:3

19మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. 20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది. 21నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! అది న్యాయంతో నిండి ఉండేది. నీతి దానిలో నివాసం ఉండేది. ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు. 22నీ వెండి మలినమైపోయింది. నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది. 23నీ అధికారులు ద్రోహులు. వాళ్ళు దొంగలతో సావాసం చేస్తారు. అందరూ లంచం ఆశిస్తారు. చెల్లింపుల వెంటబడతారు. తండ్రి లేని వాళ్ళ పక్షంగా ఉండరు. వితంతువుల న్యాయమైన అభ్యర్ధన వాళ్ళు పట్టించుకోరు. 24కాబట్టి ప్రభువూ, ఇశ్రాయేలు బలిష్టుడూ, సైన్యాల అధిపతీ అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “వాళ్లకు బాధ! నా విరోధులపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను. 25నీకు వ్యతిరేకంగా నా చెయ్యి తిప్పుతాను. నీలో ఉన్న చెత్తను శుద్ధిచేసి, నీ కల్మషం అంతా తీసేస్తాను. 26మొదట్లో ఉన్నట్టు న్యాయాధిపతులను మళ్ళీ నీకు ఇస్తాను. ఆరంభంలో ఉన్నట్టు నీకు సలహాదారులను మళ్ళీ నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణం అనీ, నమ్మదగిన నగరమనీ నీకు పేరొస్తుంది.” 27సీయోనుకు న్యాయాన్ని బట్టీ, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిని బట్టీ విమోచన కలుగుతుంది. 28అతిక్రమం చేసేవాళ్ళూ, పాపులూ కలిసి ఏకంగా నాశనమౌతారు. యెహోవాను విడిచి పెట్టేసిన వాళ్ళు లయమౌతారు. 29“మీరు కోరుకున్న సింధూర వృక్షాలను బట్టి మీరు సిగ్గుపడతారు. మీరు ఎంపిక చేసుకున్న తోటలను బట్టి మీరు అవమానం పాలవుతారు. 30మీరు ఆకులు వాడిపోయే సింధూరవృక్షంలాగా, నీళ్ళు లేని తోటల్లాగా అయిపోతారు. 31బలవంతుడు సుళువుగా నిప్పు రాజుకునే నార పీచులా ఉంటాడు. అతని పని నిప్పు రవ్వలా ఉంటుంది. రెండూ కలిసి కాలిపోతాయి. ఆర్పే వాళ్ళు ఎవరూ ఉండరు.” 2:1యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది. 2రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది. అన్ని కొండల కంటే ఘనత పొందుతుంది. జాతులన్నీ దానిలోకి ప్రవాహంలా వస్తారు. 3అనేక మంది వచ్చి ఇలా అంటారు. “ఆయన మార్గాల్లో మనం నడిచేందుకు, ఆయన మనకు తన త్రోవలు నేర్పించేలా, యాకోబు దేవుని మందిరం ఉన్న యెహోవా పర్వతానికి ఎక్కి వెళ్దాం రండి.” ఎందుకంటే, సీయోనులో నుంచి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలు వెళ్తుంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 1:14–23

14దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. 16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు. 20దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 22దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 1:20–33

20జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది. 21జ్ఞానం సందడిగా ఉన్న ప్రాంతాల్లో ప్రకటన చేస్తూ ఉంది. పట్టణ ప్రధాన ప్రవేశాల్లో ప్రచారం చేస్తూ ఇలా తెలియజేస్తూ ఉంది. 22“జ్ఞాన హీనులారా, జ్ఞానం తెచ్చుకోకుండా ఎంతకాలం ఉండాలని కోరుకుంటారు? అపహాసకులారా, మీరు ఎగతాళి చేస్తూ ఎన్నేళ్ళు ఆనందంగా కాలం గడుపుతారు? బుద్ధిహీనులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు? 23నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను. 24నేను పిలిచినప్పుడు నా మాట మీరు వినలేదు. నా చెయ్యి చాపినప్పుడు ఎవ్వరూ అందుకోలేదు. 25నేను మిమ్మల్ని గద్దించి మంచి మాటలు బోధించినప్పుడు నా మాటలు లక్ష్యపెట్టలేదు, లోబడలేదు. 26కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను. మీరు భయంతో వణుకుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎగతాళి చేస్తాను. 27తుఫాను వచ్చినట్టు మీకు భయం కలుగుతుంది, సుడిగాలి రేగినట్టు ప్రమాదం వచ్చి పడుతుంది. మీకు కష్ట సమయాలు, దుఃఖ సమయాలు సంభవిస్తాయి. అప్పుడు నేను మిమ్మల్ని నవ్వుల పాలు చేస్తాను. 28అప్పుడు వాళ్ళు నా కోసం మొరపెడతారు, కానీ నేను ఎలాంటి జవాబూ ఇవ్వను. నా కోసం ఆసక్తిగా వెతుకుతారు కానీ నేను వాళ్లకు కనబడను. 29జ్ఞానం అంటే వాళ్లకు అసహ్యం వేస్తుంది. యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం వాళ్లకు ఇష్టం లేకుండా పోయింది. 30వాళ్ళు నేను చెప్పిన నా మంచి ఆలోచనలు అంగీకరించలేదు. నా మందలింపును నిర్లక్ష్యం చేశారు. 31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అనుభవిస్తారు. విరక్తి కలిగే దాకా తమ స్వంత ఆలోచనలు అనుసరిస్తారు. 32ఉపదేశం పొందని వారు దేవుణ్ణి తిరస్కరించి నాశనమవుతారు. మూర్ఖుల నిర్లక్ష్యం వారిని నిర్మూలం చేస్తుంది. 33నా ఉపదేశం విని దాని ప్రకారం నడుచుకునేవాడు సురక్షితంగా నివసిస్తాడు. కీడు కలుగుతుందన్న భయం లేకుండా ప్రశాంతంగా ఉంటాడు.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 3 మార్చి పౌర కాలెండర్‌లో 16 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు