హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 15 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 2 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 15 మార్చి, 2027
సోమవారం · మహా ఉపవాస కాలం మొదటి వారం · స్వరం 8
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా ఉపవాస కాలం ప్రారంభం
మహా ఉపవాస కాలం
ఆహారం నుండి పూర్తి విరమణ
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఆరవ ఘడియ
1యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా పాలించే రోజుల్లో యూదా గురించీ, యెరూషలేము గురించీ ఆమోజు కొడుకు యెషయాకు కలిగిన దర్శనం. 2ఆకాశమా, విను. భూమీ, ఆలకించు. యెహోవా నాతో ఇలా మాట్లాడాడు. “నేను పిల్లలను పెంచి పోషించాను. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారు. 3ఎద్దుకు తన యజమాని తెలుసు. తన మేత తొట్టి గాడిదకు తెలుసు. కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.” 4ఓ పాపిష్టి జాతీ, దోషం కింద మగ్గిపోతున్న జనమా, దుష్టుల సంతానమా, అవినీతి చేసే పిల్లలారా మీకు బాధ. వాళ్ళు యెహోవాను విడిచిపెట్టారు. ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి అలక్ష్యం చేశారు. ఆయనతో తెగతెంపులు చేసుకున్నారు. 5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 6అరి కాలు నుంచి తల వరకు పుండు పడని భాగం లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, మానని పుళ్ళు. అవి నయం కాలేదు. వాటిని ఎవరూ కడగలేదు, కట్టు కట్టలేదు, నూనెతో చికిత్స చెయ్యలేదు. 7మీ దేశం పాడైపోయింది. మీ పట్టణాలు మంటల్లో కాలిపోయాయి. మీ కళ్ళముందే పరాయివారు మీ పంటలు దోచుకుంటున్నారు. తమ కంట పడినవన్నీ నాశనం చేస్తున్నారు. 8సీయోను కుమార్తె ద్రాక్షతోటలో ఒక గుడిసెలాగా, దోసపాదుల్లో ఒక పాకలాగా, ముట్టడి వేసిన పట్టణంలాగా మిగిలిపోయింది. 9జాతులకు ప్రభువైన యెహోవా కొంత శేషం మన కోసం ఉంచకపోతే, మనం సొదొమలాగా ఉండేవాళ్ళం. మనం గొమొర్రాతో సమానంగా ఉండేవాళ్ళం. 10సొదొమ పాలకులారా, యెహోవా మాట వినండి. గొమొర్రా ప్రజలారా, మన దేవుని ధర్మశాస్త్రం ఆలకించండి. 11“యెహోవా ఇలా అంటున్నాడు. విస్తారమైన మీ బలులు నాకెందుకు?” “దహనబలులుగా అర్పించిన పాట్టేళ్లు, బలిసిన దూడల కొవ్వు నాకు వెగటు పుట్టించాయి. దున్నపోతుల రక్తం, గొర్రె పిల్లల రక్తం, మేకపోతుల రక్తం అంటే నాకు ఇష్టం లేదు. 12మీరు నా సన్నిధిలో నన్ను కలుసుకోడానికి వస్తున్నప్పుడు, నా ప్రాంగణాలు తొక్కమని మిమ్మల్ని ఎవరడిగారు? 13అర్థం లేని అర్పణలు మీరు ఇక తీసుకు రావొద్దు. ధూపార్పణ నాకు అసహ్యం. అమావాస్య, విశ్రాంతి దినాలు, సమాజ కూటాలు జరుగుతున్నాయి కాని, మీ దుర్మార్గ సమావేశాలు నేను సహించలేను. 14మీ అమావాస్య ఉత్సవాలు, నియామక ఉత్సవాలు నాకు అసహ్యం. అవి నాకు బాధాకరం. వాటిని సహించలేక విసిగిపోయాను. 15మీరు మీ చేతులు ప్రార్థనలో చాపినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పేసుకుంటాను. మీరు ఎంత ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. 16మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.” 17మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి. 18యెహోవా ఇలా అంటున్నాడు. “రండి మనం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం.” “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి. కెంపులా ఎర్రగా ఉన్నా, అవి గొర్రెబొచ్చులా తెల్లగా ఔతాయి. 19మీరు ఇష్టపడి నాకు లోబడితే, మీరు ఈ దేశం అందించే మంచి పదార్ధాలు అనుభవిస్తారు. 20తిరస్కరించి తిరుగుబాటు చేస్తే, కత్తి మిమ్మల్ని నాశనం చేస్తుంది.” యెహోవా నోరు ఈ మాట పలికింది.
సాయంకాల ప్రార్థన: పఠనం
1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. 3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. 6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. 9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. 11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1దావీదు కుమారుడు, ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సామెతలు. 2జ్ఞానం, ఉపదేశం నేర్చుకోవడానికీ, వివేకం, జ్ఞానవాక్కులు బోధించడానికీ, 3నీతి, న్యాయం, యథార్థతల ప్రకారం నడుచుకుంటూ దిద్దుబాటు చేసుకోవడానికి, 4ఉపదేశం పొందని వారికి వివేకం ఇవ్వడానికి, యువతకు తెలివి, విచక్షణ కలిగేలా చేయడానికి ఉపకరిస్తాయి. 5తెలివి గలవాడు ఈ సామెతలు విని తన జ్ఞానం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు విని నీతి సూత్రాలు అలవర్చుకుంటాడు. 6వీటి మూలంగా సామెతలు, ఉపమానాలు, జ్ఞానుల మాటలు, వారు చెప్పిన నిగూఢ సత్యాలు ప్రజలు గ్రహిస్తారు. 7యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలకారణం. మూర్ఖప్రజలు జ్ఞానాన్ని, నీతి వాక్యాలను వ్యతిరేకిస్తారు. 8కుమారా, నీ తండ్రి చెప్పే సద్బోధ విను. నీ తల్లి చెప్పే మాటలు నిర్ల్యక్ష్యం చెయ్యకు. 9అవి నీ తలపై అందమైన పుష్ప కిరీటంలా ఉంటాయి. నీ మెడలో హారాలుగా నిలబడతాయి. 10కుమారా, దుష్టులు నిన్ను ప్రేరేపిస్తే అంగీకరించవద్దు. 11దుష్టులు నీతో “మాతో చేతులు కలుపు. ఎవరినైనా చంపడానికి కాపు కాద్దాం. అమాయకుడైన ఒకణ్ణి పట్టుకుందాం. 12ఆరోగ్య వంతుణ్ణి పాతాళం అకస్మాత్తుగా తీసేసుకున్నట్టు వారిని సజీవంగా మింగేద్దాం. సమాధిలోకి దిగే వారిలా వారిని చేసేద్దాం. 13దోచుకున్న సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, రకరకాల విలువైన వస్తువులు మనకు దొరుకుతాయి. 14నువ్వు మాతో కలసి ఉండు, మనమంతా ఒకే చోట సొమ్ము దాచుకుందాం” అని నీతో చెబితే వాళ్ళ మాటలు లక్ష్యపెట్టవద్దు. 15కుమారా, నువ్వు వాళ్ళు నడిచే దారిలో వెళ్ళ వద్దు. వాళ్ళ ఆలోచన ప్రకారం చేయకుండేలా నీ పాదాలు అదుపులో ఉంచుకో. 16మనుషులను చంపడానికి వాళ్ళు తొందరపడుతూ ఉంటారు. హాని కలిగించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. 17ఒక పక్షి చూస్తూ ఉండగా దానికి వల వేయడం అనవసరం. 18వాళ్ళు తమ స్వంత నాశనానికే మాటు వేస్తారు. తాము పట్టబడతామని దాక్కుని ఉంటారు. 19అక్రమ ఆర్జన ఆశించే వాళ్లకు ఇదే గతి పడుతుంది. ఆ మార్గంలో నడిచే వాళ్ళ ప్రాణాలు అదే తీస్తుంది. 20జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తూ ఉంది. వీధుల వెంబడి బిగ్గరగా మాట్లాడుతూ ఉంది.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 2 మార్చి పౌర కాలెండర్లో 15 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు