Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 10 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 25 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 10 మార్చి, 2027

బుధవారం · జున్ను విరమణ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

జున్ను విరమణ వారపు బుధవారం

జున్ను వారం

మాంసం లేదు; పాలు, గుడ్లు మరియు చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యోవే 2:12–26

12యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.” 13మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. 14ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? 15సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 16ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. 17యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” 18అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు. 19యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. మీరు వాటితో తృప్తి చెందుతారు. ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను. 20ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.” 21దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. యెహోవా గొప్ప పనులు చేశాడు. 22పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. 23సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు. 24కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. 25“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. 26మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.

సాయంకాల ప్రార్థన: పఠనం

యోవే 3:12–21

12రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. చుట్టు పక్కలుండే రాజ్యాలకు తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. 13పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. తొట్లు పొర్లి పారుతున్నాయి. వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది. 14తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 15సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది. 16యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు. 17మీ యెహోవా దేవుణ్ణి నేనే, నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు యెరూషలేము పవిత్ర పట్టణంగా ఉంటుంది. వేరే దేశాల సేనలు దానిగుండా మళ్ళీ వెళ్ళరు. 18ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, షిత్తీము లోయను తడుపుతుంది. 19కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు. 20యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు. తరతరాలకు యెరూషలేము నివాస స్థలంగా ఉంటుంది. 21వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను. యెహోవా సీయోనులో నివసిస్తున్నాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 25 ఫిబ్రవరి పౌర కాలెండర్‌లో 10 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు