హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 10 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 10 మార్చి, 2027
బుధవారం · తపస్సు కాలం నాల్గవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం నాల్గవ వారపు బుధవారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
8యెహోవా ఇలా చెబుతున్నాడు, “అనుకూల సమయంలో నేను నీకు జవాబిస్తాను. విమోచన దినాన నీకు సహాయం చేస్తాను. దేశాన్ని తిరిగి కట్టడానికీ పాడైన వారసత్వాన్ని మళ్ళీ అప్పగించడానికీ నిన్ను కాపాడతాను. ప్రజలకు నిబంధనగా నిన్ను నియమిస్తాను. 9నువ్వు బందీలతో, ‘బయలుదేరండి’ అనీ చీకట్లో ఉన్నవారితో, ‘బయటికి రండి’ అనీ చెబుతావు. వాళ్ళు దారిలో మేస్తారు. చెట్లు లేని కొండలమీద వారికి మేత దొరుకుతుంది. 10వారిమీద జాలిపడేవాడు వారిని వెంటపెట్టుకుని వెళ్తాడు. నీటిఊటల దగ్గరికి వారిని నడిపిస్తాడు. కాబట్టి వారికి ఆకలి గానీ దప్పిక గానీ వేయదు. ఎండ, వడగాడ్పులూ వారికి తగలవు. 11నా పర్వతాలన్నిటినీ దారిగా చేస్తాను. నా జాతీయ రహదారులను సరిచేస్తాను.” 12చూడండి. వీళ్ళు దూర ప్రాంతం నుంచి వస్తున్నారు. కొంతమంది ఉత్తరం నుంచీ పడమటి నుంచి వస్తున్నారు. మరికొంతమంది సీనీయుల దేశం నుంచి వస్తున్నారు. 13బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి. 14అయితే సీయోను “యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరచిపోయాడు” అంది. 15స్త్రీ, తన గర్భాన పుట్టిన బిడ్డ మీద జాలిపడకుండా ఉంటుందా? తన చంటిపిల్లను మరచిపోతుందా? వాళ్ళు మరచిపోవచ్చు గానీ నేను నిన్ను మరచిపోను.
ప్రతిస్పందన కీర్తన
8యెహోవా దయ, వాత్సల్యం గలవాడు. ఆయన కోపం విషయంలో నిదానించే వాడు. నిబంధన విశ్వసనీయత ఆయనలో పొంగి పొరలుతూ ఉంది. 9యెహోవా అందరికీ మేలు చేస్తాడు. సృష్టి అంతటి మీదా ఆయన వాత్సల్యం చూపుతాడు. 13నీ రాజ్యం కలకాలం ఉంటుంది. నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలిచి ఉంటుంది. 14కూలిపోతున్న వాళ్ళను యెహోవా స్థిరపరుస్తాడు. కృంగిన వాళ్ళను లేవనెత్తుతాడు. 17యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు. 18ఆయన తనను వేడుకునే వాళ్ళందరికీ, తనకు యథార్ధంగా ప్రార్థన చేసే వాళ్ళందరికీ చేరువగా ఉన్నాడు.
సువార్త
17యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు. 18ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు. 19కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు. 20తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు. 21“తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు. 22తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు. 23దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు. 24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు. 26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. 28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు. 30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు