హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 26 ఫిబ్రవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 26 ఫిబ్రవరి, 2027
శుక్రవారం · తపస్సు కాలం రెండవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం రెండవ వారపు శుక్రవారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఉపవాసం మరియు పశ్చాత్తాపం
మాంసం నుండి విరమణ
ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
3యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతణ్ణి ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిలువుటంగీ కుట్టించాడు. 4అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు. 12యోసేపు సోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపడానికి వెళ్ళారు. 13అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీ సోదరులు షెకెములో మందను మేపుతున్నారు. నిన్ను వారి దగ్గరికి పంపుతాను, రా” అన్నప్పుడు అతడు “అలాగే” అని చెప్పాడు. 17అందుకు ఆ మనిషి “వారు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. వారు ‘దోతానుకు వెళ్దాం పదండి’ అని చెప్పుకోవడం నేను విన్నాను” అని చెప్పాడు. అప్పుడు యోసేపు తన సోదరుల కోసం వెదుకుతూ వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. 18అతడు దగ్గరికి రాక ముందే వారు అతణ్ణి దూరం నుండి చూసి అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. 19వారు “అడుగో, కలలు కనేవాడు వస్తున్నాడు. 20వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు. 21రూబేను ఆ మాట విని “మనం వాణ్ణి చంపకూడదు” అని చెప్పి వారి చేతుల్లో చావకుండా యోసేపును తప్పించాడు. 22ఎలాగంటే రూబేను అతణ్ణి తమ తండ్రికి అప్పగించాలని, వారు అతణ్ణి చంపకుండా విడిపించాలని ఉద్దేశించి “రక్తం చిందించ వద్దు. అతణ్ణి చంపకుండా అడవిలో ఉన్న ఈ గుంటలో తోసేయండి” అని వారితో చెప్పాడు. 23యోసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు యోసేపు తొడుక్కొన్న ఆ అందమైన నిలువుటంగీని తీసేసి, 24అతణ్ణి పట్టుకుని ఆ గుంటలో పడదోశారు. అది నీళ్ళు లేని వట్టి గుంట. 25వారు భోజనానికి కూర్చున్నపుడు, ఐగుప్తుకు సుగంధ ద్రవ్యాలు, మస్తకి, బోళం మోసుకుపోతున్న ఒంటెలతో ఇష్మాయేలీ యాత్రికులు గిలాదు నుండి రావడం చూశారు. 26అప్పుడు యూదా “మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం? 27ఈ ఇష్మాయేలీయులకు వాణ్ణి అమ్మేద్దాం రండి. ఎలాగైనా వాడు మన తమ్ముడు, మన రక్త సంబంధి గదా? వాడిని చంపకూడదు” అని తన సోదరులతో చెప్పాడు. అందుకు అతని సోదరులు అంగీకరించారు. 28ఆ మిద్యాను వర్తకులు దగ్గరికి వచ్చినపుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరవై షెకెల్ ల వెండికి అతణ్ణి అమ్మేశారు. వారు యోసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు.
ప్రతిస్పందన కీర్తన
16దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. 17వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. 18వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. 19అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు. 20రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు. 21ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,
సువార్త
33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. 34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. 35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. 37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. 39వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. 40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. 41వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. 42అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా? 43“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను. 45ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు. 46వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు