హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2026 › 27 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 27 డిసెంబర్, 2026
ఆదివారం · క్రిస్మస్ కాలం
పండుగలు మరియు పరిశుద్ధులు
పవిత్ర కుటుంబం: యేసు, మరియ, యోసేపు
పండుగ · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1ఈ సంగతులు జరిగిన తరువాత యెహోవా దూత అబ్రాముకు దర్శనమిచ్చాడు. “అబ్రామూ, భయపడకు! నేనే నీకు డాలును, గొప్ప బహుమానాన్ని” అన్నాడు. 2అబ్రాము “ప్రభూ యెహోవా, నాకేం ఇస్తావు? నేను సంతానం లేనివాడిగా ఉండిపోతున్నాను కదా. దమస్కు వాడైన ఎలీయెజెరే నా ఆస్తికి వారసుడు అవుతాడు కదా! 3నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు గనుక, చూడు, నా సేవకుల్లో ఒకడు నాకు వారసుడు అవుతాడు” అన్నాడు. 4యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి “ఇతడు నీ వారసుడు కాడు. నీ ద్వారా నీకు పుట్టబోయేవాడే నీ వారసుడు అవుతాడు” అన్నాడు. 5ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు. 6అతడు యెహోవాను నమ్మాడు. ఆ నమ్మకాన్నే ఆయన అతనికి నీతిగా పరిగణించాడు. 21:1యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు. 2అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భం ధరించి అతనికి ఒక కొడుకును కన్నది. అబ్రాహాముతో దేవుడైన యెహోవా చెప్పిన సమయంలోనే ఇది జరిగింది. 3అబ్రాహాము తన భార్య శారా ద్వారా తనకు పుట్టిన తన కొడుక్కి ఇస్సాకు అనే పేరు పెట్టాడు.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. 2ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 3ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. 4యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. 5ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. 6ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 8తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, 9ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
రెండవ పఠనం
8దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను వారసత్వంగా పొందబోయే స్థలానికి ప్రయాణమై వెళ్ళాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ప్రయాణం అయ్యాడు. 11విశ్వాసాన్ని బట్టి అబ్రాహామూ, శారా ఎంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తమకు కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని భావించారు కనుక శారా గర్భం ధరించడానికి శక్తి పొందింది. 12అందుచేత చావుకు దగ్గరైన ఈ వ్యక్తి నుండి లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు. వారు ఆకాశంలో నక్షత్రాల్లాగా సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా విస్తరించారు. 17విశ్వాసాన్ని బట్టి అబ్రాహాము తీవ్ర పరీక్ష ఎదుర్కొని ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. 18“ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు” అని ఈ ఇస్సాకును గూర్చి దేవుడు చెప్పాడు. 19దేవుడు ఇస్సాకును చనిపోయిన వారిలో నుండి లేపగలిగే సమర్ధుడని అబ్రాహాము భావించాడు. అలంకారికంగా చెప్పాలంటే చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
సువార్త
22మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయినాయి. “ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి” అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది. కాబట్టి ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించడానికి, ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతను గానీ రెండు పావురం పిల్లలను గానీ బలిగా సమర్పించడానికి వారు ఆయనను యెరూషలేముకు తీసుకు వెళ్ళారు. 25యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు. 26అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. 27ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు చంటి బిడ్డ యేసును దేవాలయంలోకి తెచ్చారు. 28సుమెయోను తన చేతుల్లో ఆయనను ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు, 29“ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా! 30అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన నీ రక్షణ నేను కళ్ళారా చూశాను.” 33యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు. 34అతడు వారిని దీవించి, మరియతో ఇలా అన్నాడు, “అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో చాలా మంది పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు. 35అంతేగాక నీ హృదయంలోకి ఒక కత్తి దూసుకు పోతుంది.” 36దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, 37ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. 38ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది. 39ఆ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్ళిపోయారు. 40పసివాడు ఎదుగుతూ, బలపడుతూ జ్ఞానంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
ఈరోజు పరిశుద్ధులు
- అపొస్తలుడు, సువార్తికుడైన పునీత యోహాను
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు