Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › యూదా రాజులు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · యూదా రాజులు

ఇశ్రాయేలు రెహబాము మీద తిరుగుబాటు చేస్తుంది

1 రాజులు 12:1–19 · 2 దిన 10:1–19

1 రాజులు

1 రాజులు 12:1–19

1రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు రాగా రెహబాము షెకెము వెళ్ళాడు.

2నెబాతు కొడుకు యరొబాము, సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్నాడు. యరొబాము ఐగుప్తులోనే ఉండి రెహబాము పట్టాభిషేకం సంగతి విన్నాడు.

3ప్రజలు అతనికి కబురంపి పిలిపించారు. యరొబాము, ఇశ్రాయేలీయుల సమాజమంతా వచ్చి రెహబాముతో ఇలా మనవి చేశారు.

4“మీ నాన్న బరువైన కాడిని మా మీద ఉంచాడు. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యాన్ని, మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు తేలిక చేస్తే మేము నీకు సేవ చేస్తాం.”

5అందుకు రాజు “మీరు వెళ్లి మూడు రోజులైన తరువాత నా దగ్గరికి మళ్ళీ రండి” అని చెప్పగా ప్రజలు వెళ్లిపోయారు.

6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను బతికి ఉన్నప్పుడు అతని దగ్గర సేవ చేసిన పెద్దలను సంప్రదించి “ఈ ప్రజలకు ఏం జవాబు చెప్పాలి?” అని వారిని అడిగాడు.

7వారు “ఈ దినాన నీవు ఈ ప్రజలకు సేవచేయ గోరితే వారికి మృదువైన మాటలతో వారికి జవాబిస్తే వాళ్ళు ఎప్పటికీ నీకు సేవకులుగా ఉంటారు” అన్నారు.

8అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన సలహా పక్కనబెట్టి, తనతో కూడ పెరిగిన తన పరివారంలోని యువకులను పిలిచి సలహా అడిగాడు. అతడు వారిని

9“మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని తేలిక చేయమని నాతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఏమని జవాబు చెప్పాలి? మీరిచ్చే సలహా ఏంటి?” అని ప్రశ్నించాడు.

10అప్పుడు అతనితో బాటు పెరిగిన ఆ యువకులు అతనితో అన్నారు. “నీ తండ్రి మా కాడిని భారం చేసాడు గాని నీవు దాన్ని తేలిక చేయాలని నీతో చెప్పుకున్న ఈ ప్రజలకు ఇలా చెప్పు. మా నాన్న నడుం కంటే నా చిటికెన వేలు పెద్దది.

11మా నాన్న భారమైన కాడిని పెట్టాడు కానీ నేను ఆ కాడిని ఇంకా భారం చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

12“మూడో రోజు నా దగ్గరికి రండి” అని రాజు చెప్పినట్టు యరొబాము, ప్రజలంతా మూడో రోజు రెహబాము దగ్గరికి వచ్చారు.

13అప్పుడు రాజు పెద్దలు చెప్పిన సలహా పక్కనబెట్టి, యువకులు చెప్పిన సలహా ప్రకారం వారికి కఠినంగా జవాబిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు.

14“మా నాన్న మీ కాడిని భారం చేశాడు గాని నేను మీ దాన్ని మరింత భారంగా చేస్తాను. మా నాన్న చెర్నాకోలలతో మిమ్మల్ని శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను.”

15ప్రజలు చేసిన మనవిని రాజు వినిపించుకోలేదు. షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో తాను పలికించిన మాట నెరవేరాలని యెహోవా ఇలా జరిగించాడు.

16కాబట్టి ఇశ్రాయేలు వారంతా రాజు తమ విన్నపం వినలేదని తెలుసుకుని రాజుకిలా బదులిచ్చారు: “దావీదు వంశంతో మాకేం సంబంధం? యెష్షయి కొడుకుతో మాకు వారసత్వం ఏముంది? ఇశ్రాయేలు ప్రజలారా, మీ మీ గుడారాలకు వెళ్ళండి. దావీదు వంశమా, నీ వంశం సంగతి నువ్వే చూసుకో.” ఇలా చెప్పి ఇశ్రాయేలువారు తమ గుడారాలకు వెళ్లిపోయారు.

17అయితే యూదా పట్టణాల్లో ఉన్న ఇశ్రాయేలు వారిని రెహబాము పాలించాడు.

18తరువాత రెహబాము రాజు వెట్టిపనివారి మీద అధికారి అదోరామును ఇశ్రాయేలు వారి దగ్గరికి పంపాడు. ఇశ్రాయేలు వారంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. రెహబాము రాజు తన రథం మీద వెంటనే యెరూషలేము పారిపోయాడు.

19ఈ విధంగా ఇశ్రాయేలువారు ఇప్పటికీ దావీదు వంశం మీద తిరగబడుతూనే ఉన్నారు.

2 దినవృత్తాంతాలు

2 దిన 10:1–19

1రెహబాముకు పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేలీయులంతా షెకెముకు చేరుకున్నారు. రెహబాము షెకెముకు వెళ్ళాడు.

2సొలొమోను రాజు దగ్గర నుండి పారిపోయి ఐగుప్తులో నివసిస్తున్న నెబాతు కొడుకు యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు.

3ప్రజలు అతణ్ణి పిలిపించగా యరొబాము, ఇశ్రాయేలువారు కలిసి వచ్చి రెహబాముతో “నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాడు.

4నీ తండ్రి నియమించిన కఠిన దాస్యాన్ని, అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నువ్వు ఇప్పుడు తేలికగా చేస్తే మేము నిన్ను సేవిస్తాము” అని మనవి చేశారు.

5అందుకు అతడు “మీరు మూడు రోజుల తరవాత నా దగ్గరికి రండి” అని వారితో చెప్పాడు. కాబట్టి ప్రజలు వెళ్లిపోయారు.

6అప్పుడు రెహబాము రాజు తన తండ్రి సొలొమోను జీవించి ఉండగా అతని ముందు నిలిచి సేవ చేసిన పెద్దలను పిలిపించి “ఈ ప్రజలకు నన్నేమి జవాబు చెప్పమంటారు? మీ సలహా ఏమిటి?” అని వారిని అడిగాడు.

7అందుకు వారు “నువ్వు ఈ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలు చూపి వారితో మృదువుగా మాట్లాడితే వారు ఎప్పటికీ నీకు దాసులుగా ఉంటారు” అని అతనితో చెప్పారు.

8అయితే అతడు ఆ పెద్దలు తనకు చెప్పిన ఆలోచన తోసిపుచ్చి, తనతో పెరిగి తన దగ్గర ఉన్న యువకులతో ఆలోచన చేశాడు.

9అతడు “‘నీ తండ్రి మామీద ఉంచిన కాడిని తేలిక చెయ్యి’ అని నన్నడిగిన ఈ ప్రజలకి నేనేం జవాబు చెప్పాలని మీరు ఆలోచిస్తారో చెప్పండి” అని వారిని అడిగాడు.

10అతనితో కూడా పెరిగిన ఆ యువకులు అతనితో ఇలా అన్నారు “‘నీ తండ్రి మా కాడిని బరువు చేశాడు, నువ్వు దాన్ని తేలిక చెయ్యి’ అని నిన్ను అడిగిన ఈ ప్రజలతో నువ్వేమి చెప్పాలంటే, ‘నా చిటికెన వ్రేలు నా తండ్రి నడుము కంటే బరువు.

11నా తండ్రి బరువైన కాడి మీమీద మోపాడు గాని నేను మీ కాడిని మరింత బరువు చేస్తాను. నా తండ్రి చెర్నాకోలతో మిమ్మల్ని దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను’ అని చెప్పు.”

12“మూడవ రోజున నా దగ్గరికి తిరిగి రండి” అని రాజు చెప్పిన ప్రకారం యరొబాము, ప్రజలు మూడో రోజున రెహబాము దగ్గరకి వచ్చారు.

13రెహబాము పెద్దలు చెప్పిన ఆలోచనను త్రోసిపుచ్చి, యువకులు చెప్పిన ప్రకారం వారితో కఠినంగా జవాబిచ్చాడు.

14అతడు వారితో “నా తండ్రి మీ కాడిని బరువు చేశాడు, నేను దాన్ని మరింత బరువు చేస్తాను. నా తండ్రి మిమ్మల్ని చెర్నాకోలతో దండించాడు. నేనైతే మిమ్మల్ని కొరడాలతో దండిస్తాను” అని చెప్పాడు.

15యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కొడుకు యరొబాముతో చెప్పిన తన మాటను స్థిరపరచేలా దేవుని నిర్ణయ ప్రకారం ప్రజలు చేసిన మనవి రాజు ఆలకించలేదు.

16రాజు తమ మనవి అంగీకరించక పోవడం చూసి ఇశ్రాయేలు ప్రజలు, “దావీదులో మాకు భాగమెక్కడ ఉంది? యెష్షయి కుమారుడిలో మాకు వారసత్వం లేదు. ఇశ్రాయేలు ప్రజలారా, మీ గుడారాలకి వెళ్ళిపోండి. దావీదూ, నీ సంతతి వారిని నువ్వే చూసుకో” అని రాజుతో చెప్పి ఎవరి గుడారానికి వారు వెళ్లిపోయారు.

17అయితే యూదా పట్టణాల్లో నివసించే ఇశ్రాయేలు వారిని రెహబాము పరిపాలించాడు.

18రెహబాము రాజు వెట్టి పనివారి మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు వారి దగ్గరకి పంపించాడు. కానీ వారు అతణ్ణి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు రెహబాము రాజు త్వరగా తన రథం ఎక్కి యెరూషలేముకు పారిపోయాడు.

19ఇశ్రాయేలు వారు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి ఇప్పటికీ వారికి లోబడకుండా ఉన్నారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు