Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › యూదా రాజులు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · యూదా రాజులు

యెహోషాపాతు పరిపాలన

1 రాజులు 22:41–50 · 2 దిన 20:31–37; 21:1

1 రాజులు

1 రాజులు 22:41–50

41ఆసా కొడుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు అహాబు పరిపాలన నాలుగో ఏట యూదాను పరిపాలించడం మొదలెట్టాడు.

42యెహోషాపాతు పరిపాలించడం మొదలెట్టినప్పుడు అతడు ముప్ఫై అయిదేళ్ళ వాడు. యెరూషలేములో అతడు ఇరవై ఐదేళ్ళు పాలించాడు. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్హీ కూతురు.

43అతడు తన తండ్రి, ఆసా విధానాన్ని అనుసరించి, యెహోవా దృష్టికి సరిగా ప్రవర్తించాడు. అయితే ఉన్నత పూజా స్థలాలను తీసేయలేదు. ఉన్నత స్థలాల్లో ప్రజలింకా బలులు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చారు.

44యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజుతో ఒప్పందం చేసుకున్నాడు.

45యెహోషాపాతును గురించిన ఇతర విషయాలు, అతడు చూపించిన బల ప్రభావాలు, యుద్ధం చేసిన పద్ధతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉంది.

46తన తండ్రి ఆసా రోజుల్లోనుంచి మిగిలి ఉన్న మగ వ్యభిచారులను అతడు దేశం నుంచి వెళ్లగొట్టాడు.

47ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. ఒక అధికారి పాలించేవాడు.

48యెహోషాపాతు బంగారం తెప్పించాలని ఓఫీరు దేశానికి వెళ్ళడానికి తర్షీషు ఓడలను కట్టించాడు గానీ ఆ ఓడలు బయలుదేర లేదు. అవి ఎసోన్గెబెరు దగ్గర బద్దలై పోయాయి.

49అప్పుడు అహాబు కొడుకు అహజ్యా “నా సేవకులను నీ సేవకులతో పాటు ఓడల మీద వెళ్ళనివ్వండి” అని యెహోషాపాతును అడిగాడు. యెహోషాపాతు దానికి ఒప్పుకోలేదు.

50యెహోషాపాతు చనిపోగా తన పూర్వీకుడైన దావీదు పట్టణంలో అతని పూర్వీకుల దగ్గర అతణ్ణి పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.

2 దినవృత్తాంతాలు

2 దిన 20:31–37; 21:1

20:31యెహోషాపాతు యూదారాజ్యాన్ని పరిపాలించాడు. అతడు పరిపాలించడం మొదలు పెట్టినపుడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 25 ఏళ్ళు పాలించాడు. అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా.

20:32అతడు యెహోవా దృష్టికి యథార్ధంగా ప్రవర్తించి తన తండ్రి ఆసా మార్గంలో నడుస్తూ దానిలోనుంచి తొలగిపోకుండా ఉన్నాడు.

20:33అయితే అప్పటికి ఇంకా ప్రజలు తమ పూర్వీకుల దేవుణ్ణి అనుసరించడానికి తమ హృదయాల్లో నిశ్చయం చేసుకోలేదు, అతడు అన్య దైవ మందిరాలను తీసివేయలేదు.

20:34యెహోషాపాతు చేసిన పనులన్నిటిని గురించి హనానీ కొడుకు యెహూ రచించిన గ్రంథంలో రాసి వుంది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో ఉంది.

20:35ఇది జరిగిన తరువాత, యూదా రాజు యెహోషాపాతు, చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజు అహజ్యాతో స్నేహం చేశాడు.

20:36తర్షీషుకు వెళ్ళగలిగిన ఓడలను చేయించాలని యెహోషాపాతు అతనితో స్నేహం చేశాడు. వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించారు.

20:37అప్పుడు మారేషా వాడు దోదావాహు కొడుకు, ఎలీయెజెరు “నీవు అహజ్యాతో స్నేహం చేసుకున్నావు కాబట్టి యెహోవా నీ ప్రయత్నాలను నాశనం చేశాడు” అని యెహోషాపాతుకు వ్యతిరేకంగా ప్రవచనం చెప్పాడు. ఆ ఓడలు తర్షీషుకు వెళ్లలేక బద్దలైపోయాయి.

21:1యెహోషాపాతు చనిపోయినప్పుడు తన పూర్వీకులతో పాటు అతణ్ణి దావీదు పట్టణంలో పాతిపెట్టారు. అతని కొడుకు యెహోరాము అతని బదులు రాజయ్యాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు