Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › సొలొమోను

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · సొలొమోను

గిబియోనులో సొలొమోను జ్ఞానం అడుగుతాడు

1 రాజులు 3:4–15 · 2 దిన 1:2–13

1 రాజులు

1 రాజులు 3:4–15

4ఉన్నత స్థలాల్లో గిబియోను ముఖ్యమైనది కాబట్టి రాజు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

5గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు.

6సొలొమోను ఈ విధంగా వేడుకున్నాడు “నీ దాసుడు, నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలంగా సత్యాన్ని, నీతిని అనుసరించి యథార్థమైన మనసు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి నీవు అతని మీద పరిపూర్ణ కటాక్షం చూపించి, ఈ రోజు ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చోబెట్టి అతని పై గొప్ప అనుగ్రహం చూపించావు.

7నా దేవా, యెహోవా, నీవు నా తండ్రి దావీదుకు బదులుగా నీ సేవకుడైన నన్ను రాజుగా నియమించావు. అయితే నేను బాలుణ్ణి. రాజ్య వ్యవహారాలు జరిపించడానికి నాకు తెలివి చాలదు.

8నీ దాసుడినైన నేను నీవు ఎన్నుకొన్న ప్రజల మధ్య ఉన్నాను. వారు గొప్ప జనాంగం కాబట్టి వారిని లెక్క పెట్టడం, ఈ విశాలమైన దేశాన్ని అజమాయిషీ చేయడం నాకు అసాధ్యం.

9నీ ఈ గొప్ప జనాంగానికి ఎవరు న్యాయం తీర్చగలరు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ ప్రజలకు న్యాయం తీర్చగలిగేలా నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం ఇవ్వు.”

10సొలొమోను చేసిన ఈ మనవి దేవునికి ఇష్టమైంది.

11కాబట్టి దేవుడు అతనితో “దీర్ఘాయువునూ ఐశ్వర్యాన్నీ, నీ శత్రువుల ప్రాణాలనూ అడగకుండా, న్యాయాన్ని గ్రహించడానికి వివేకం ఇమ్మని నీవు అడిగావు.

12నీవు ఈ విధంగా అడిగినందువల్ల నీ మనవి ఆలకించాను. జ్ఞాన వివేకాలు గల హృదయం నీకిస్తున్నాను. పూర్వికుల్లో నీవంటివాడు ఒక్కడూ లేడు, ఇక మీదట ఉండడు.

13ఇంకో విషయం, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను ఇమ్మని అడక్కపోయినా నేను వాటిని కూడా నీకిస్తున్నాను. కాబట్టి నీ జీవిత కాలం అంతటిలో రాజుల్లో నీలాంటివాడు ఒక్కడైనా ఉండడు.

14నీ తండ్రి దావీదు నా మార్గాల్లో నడిచి, నా కట్టడలనూ నా ఆజ్ఞలనూ నెరవేర్చినట్టు నీవు కూడా నడుచుకుంటే నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను” అన్నాడు.

15అంతలో సొలొమోను మేలుకుని అది కల అని గ్రహించాడు. తరవాత అతడు యెరూషలేముకు వచ్చి యెహోవా నిబంధన ఉన్న మందసం ఎదుట నిలబడి దహనబలులూ సమాధానబలులూ అర్పించి తన సేవకులందరికి విందు చేయించాడు.

2 దినవృత్తాంతాలు

2 దిన 1:2–13

2సొలొమోను దాని గురించి ఇశ్రాయేలీయులందరికీ అంటే సహస్రాధిపతులతో శతాధిపతులతో న్యాయాధిపతులతో ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలతో మాట్లాడాడు.

3అప్పుడు వారంతా సొలొమోనుతో కలసి గిబియోనులో ఉన్న బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. యెహోవా సేవకుడు మోషే అరణ్యంలో చేయించిన దేవుని ప్రత్యక్ష గుడారం గిబియోనులో ఉంది.

4దావీదు రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని మందసాన్ని కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేములో తాను సిద్ధం చేసిన చోట గుడారం వేసి అక్కడ ఉంచాడు.

5అక్కడ యెహోవా నివాసస్థలం ముందు హూరు మనవడు ఊరీ కొడుకు బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం ఉంది. సొలొమోను, సమాజం వారంతా దాని దగ్గర విచారణ చేశారు.

6సొలొమోను ప్రత్యక్ష గుడారం దగ్గర యెహోవా సన్నిధి లోని ఇత్తడి బలిపీఠం దగ్గరకి వెళ్లి దాని మీద వెయ్యి దహనబలులు అర్పించాడు.

7ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. “నేను నీకు ఏమి ఇవ్వాలో అడుగు” అన్నాడు.

8సొలొమోను దేవునితో ఇలా మనవి చేశాడు. “నీవు నా తండ్రి దావీదు మీద ఎంతో నిబంధన కృప చూపించి అతని స్థానంలో నన్ను రాజుగా నియమించావు.

9కాబట్టి యెహోవా దేవా, నీవు నా తండ్రి దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. నేల ధూళి వలే ఉన్న విస్తారమైన ప్రజలకు నీవు నన్ను రాజును చేశావు.

10ఇంత గొప్ప జన సమూహానికి న్యాయం తీర్చే శక్తి ఎవరికుంది? నేను ఈ ప్రజల మధ్య పనులు చక్కపెట్టడానికి సరిపడిన జ్ఞానమూ తెలివీ నాకు దయచెయ్యి.”

11అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా అన్నాడు. “నీవు ఈ విధంగా ఆలోచించి, ఐశ్వర్యాన్నీ ధనాన్నీ ఘనతనీ నీ శత్రువుల ప్రాణాన్నీ దీర్ఘాయుష్షునూ అడగకుండా, నేను ఎవరి మీదైతే నిన్ను రాజుగా నియమించానో ఆ నా ప్రజలకి న్యాయం తీర్చడానికి కావలసిన జ్ఞానాన్నీ తెలివినీ అడిగావు.

12కాబట్టి జ్ఞానం, తెలివీ రెండూ నీకిస్తాను. అంతేగాక నీకు ముందు గానీ, నీ తరవాత గానీ వచ్చే రాజులకెవరికీ లేనంత ఐశ్వర్యాన్నీ ధనాన్నీ గొప్ప పేరునూ నీకిస్తాను.”

13తరువాత సొలొమోను గిబియోనులో ఉన్న సమాజపు గుడారం ముందున్న బలిపీఠం దగ్గర నుంచి యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలించసాగాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు