Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › సౌలు, దావీదు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · సౌలు, దావీదు

దావీదు విజయాలు

2 సమూ 8:1–14 · 1 దిన 18:1–13

2 సమూయేలు

2 సమూ 8:1–14

1దావీదు ఫిలిష్తీయులను ఓడించి వారిని లోబరచుకుని వారి ఆధీనంలో ఉన్న మెతెగమ్మాను ఆక్రమించుకున్నాడు.

2అతడు మోయాబీయులను ఓడించి, పట్టుకున్న వారిని నేలపై బారుగా పడుకోబెట్టి తాడుతో కొలిపించాడు. రెండు కొలతల పొడవు ఉన్న వారిని చంపివేయాలనీ, ఒక కొలత పొడవు ఉన్న వారిని బతకనివ్వాలనీ నిర్ణయించాడు. అప్పటినుండి మోయాబీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు.

3సోబా రాజు రెహోబు కుమారుడు హదదెజరు ఫరాతు నది దాకా తన రాజ్యాన్ని వ్యాపింపజేయాలని బయలు దేరాడు. దావీదు అతణ్ణి ఓడించి

4అతని దగ్గరనుండి వెయ్యీ ఏడు వందల మంది గుర్రపు రౌతులను, ఇరవై వేల కాల్బలాన్ని పట్టుకుని, వారి గుర్రాల మందలో వంద ఉంచుకుని, మిగిలినవాటి చీలమండ నరాలను కోయించాడు.

5దమస్కులో ఉన్న అరామీయులు సోబా రాజైన హదదెజెరుకు సహాయంగా వచ్చారు. దావీదు అరామీయ సైన్యంలో ఇరవై రెండు వేలమందిని హతమార్చాడు.

6దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.

7హదదెజెరు సేవకుల దగ్గర ఉన్న బంగారు శూలాలను దావీదు స్వాధీనం చేసుకుని యెరూషలేము పట్టణానికి తీసుకువచ్చాడు.

8దావీదు రాజు హదదెజెరుకు చెందిన బెతహు, బేరోతై అనే పట్టణాల్లో ఉన్న విస్తారమైన ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు.

9దావీదు హదదెజెరు సైన్యం మొత్తాన్ని హతం చేశాడన్న వార్త హమాతు రాజైన తోయికి వినబడింది.

10హదదెజెరు, తోయిల మధ్య విరోధం ఉంది. వాళ్ళ మధ్య తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. దావీదు హదదెజెరుతో యుద్ధం చేసి అతణ్ణి ఓడించాడు. ఆ వార్త తెలుసుకున్న తోయి తన కొడుకు యోరాము ద్వారా బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి, క్షేమ సమాచారాలు అడిగి దావీదుతో కలసి సంతోషించి సమయం గడపడానికి దావీదు దగ్గరికి పంపించాడు.

11రాజైన దావీదు అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల, ఫిలిష్తీయుల, అమాలేకీయుల రాజ్యాలను జయించి దోచుకొన్న బంగారం, వెండితో పాటు,

12రెహోబు కొడుకు హదదెజెరు అనే సోబా రాజు దగ్గర దోచుకొన్న వాటితో తోయి కొడుకు యోరాము తెచ్చిన బంగారం, వెండి, ఇత్తడి వస్తువులను కూడా చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించాడు.

13దావీదు ఉప్పు లోయలో పద్దెనిమిది వేలమంది అరామీయ సైన్యాలను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు అతని పేరు అన్నిచోట్లా ప్రసిద్ది చెందింది.

14ఎదోమీయులు దావీదుకు దాసులయ్యారు. దావీదు ఎదోము దేశమంతటిలో తన సైన్యాన్ని నిలిపాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ వచ్చాడు.

1 దినవృత్తాంతాలు

1 దిన 18:1–13

1ఇది జరిగిన తరువాత దావీదు ఫిలిష్తీయుల మీద దాడి చేసి వాళ్ళను జయించాడు. గాతు పట్టణాన్ని, దాని గ్రామాలను, ఫిలిష్తీయుల ఆధీనంలోనుంచి లాగేసుకున్నాడు.

2తరువాత అతడు మోయాబీయులను జయించగా వాళ్ళు దావీదుకు కప్పం కట్టి దాసోహమయ్యారు.

3తరువాత, సోబా రాజు హదరెజెరు యూఫ్రటీసు నది వరకూ తన అధికారం స్థాపించడానికి బయలు దేరగా హమాతు దగ్గర దావీదు అతన్ని ఓడించాడు.

4అతని దగ్గర నుంచి వెయ్యి రథాలను, ఏడువేల గుర్రపు రౌతులను, ఇరవైవేల మంది సైనికులను స్వాధీనం చేసుకున్నాడు. దావీదు వాటిలో వంద రథాలకు సరిపడిన గుర్రాలు ఉంచుకుని, మిగిలిన వాటికి చీలమండ నరాలు తెగవేయించాడు.

5సోబా రాజు హదరెజెరుకు సాయం చెయ్యాలని దమస్కులోని అరామీయులు వచ్చినప్పుడు, దావీదువారిలో ఇరవై రెండు వేలమందిని హతం చేశాడు.

6తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు కప్పం కట్టి దాసోహమన్నారు. ఈ ప్రకారం దావీదు వెళ్లిన ప్రతి చోటా యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు.

7దావీదు ఇంకా, హదరెజెరు సేవకులు స్వాధీనంలో ఉన్న బంగారు డాళ్లను యెరూషలేముకు తీసుకొచ్చాడు.

8హదరెజెరు పట్టణాలు టిబ్హతు నుంచీ కూను నుంచీ దావీదు లెక్క లేనంత ఇత్తడిని తీసుకొచ్చాడు. తరువాతి కాలంలో సొలొమోను దీనితోనే ఇత్తడి సముద్రాన్ని, స్తంభాలను, ఇత్తడి వస్తువులను చేయించాడు.

9దావీదు సోబా రాజు హదరెజెరు సైన్యం అంతటినీ ఓడించాడన్న వార్త హమాతు రాజు తోహూకు వినబడింది.

10హదరెజెరుకూ తోహూకూ మధ్య విరోధం ఉంది కాబట్టి రాజైన దావీదు హదద్ ఎజెరుతో యుద్ధం చేసి అతన్ని ఓడించినందుకు, దావీదు క్షేమం తెలుసుకోడానికీ, అతనితో శుభవచనాలు పలకడానికీ, బంగారంతో, వెండితో, ఇత్తడితో చేసిన అనేక రకాలైన పాత్రలు ఇచ్చి, తోహూ తన కొడుకు హదోరమును అతని దగ్గరికి పంపించాడు.

11ఈ వస్తువులను కూడా రాజైన దావీదు, తాను ఎదోమీయుల దగ్గర నుంచి, మోయాబీయుల దగ్గర నుంచి, అమ్మోనీయుల దగ్గర నుంచి, ఫిలిష్తీయుల దగ్గర నుంచి, అమాలేకీయుల దగ్గర నుంచి తీసుకొన్న వెండి బంగారాలతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించాడు.

12ఇంకా సెరూయా కొడుకు అబీషై ఉప్పు లోయలో ఎదోమీయుల్లో పద్దెనిమిది వేలమందిని హతం చేశాడు.

13దావీదు ఎదోములో కావలి సైన్యాన్ని ఉంచాడు. ఎదోమీయులందరూ అతనికి దాసులయ్యారు. దావీదు వెళ్లిన ప్రతిచోటా యెహోవా అతన్ని రక్షించాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు