Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › సొలొమోను

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · సొలొమోను

మందసాన్ని దేవాలయంలోకి తీసుకురావడం

1 రాజులు 8:1–11 · 2 దిన 5:2–14

1 రాజులు

1 రాజులు 8:1–11

1తరవాత సీయోను అనే దావీదుపురం నుండి యెహోవా నిబంధన మందసాన్ని తీసుకు రావడానికి సొలొమోను రాజు ఇశ్రాయేలీయుల పెద్దలనూ గోత్రాల నాయకులనూ, అంటే ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబాల పెద్దలను యెరూషలేములో తన దగ్గరకి పిలిపించాడు.

2కాబట్టి ఇశ్రాయేలీయులంతా ఏతనీము అనే ఏడో నెలలో పండగ కాలంలో సొలొమోను రాజు దగ్గర సమావేశమయ్యారు.

3ఇశ్రాయేలీయుల పెద్దలంతా వచ్చినప్పుడు యాజకులు యెహోవా మందసాన్ని పైకెత్తుకున్నారు.

4ప్రత్యక్ష గుడారాన్ని, గుడారంలో ఉన్న పరిశుద్ధ సామగ్రిని యాజకులు, లేవీయులు తీసుకు వచ్చారు.

5సొలొమోను రాజు, అతని దగ్గర సమావేశమైన ఇశ్రాయేలు సమాజమంతా మందసం ఎదుట నిలబడి, లెక్క పెట్టలేనన్ని గొర్రెలనూ ఎద్దులనూ బలిగా అర్పించారు.

6యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని దాని స్థలంలో, అంటే మందిరం గర్భాలయమైన అతి పరిశుద్ధ స్థలం లో, కెరూబుల రెక్కల కింద ఉంచారు.

7కెరూబుల రెక్కలు మందసం మీదికి చాపుకుని ఉన్నాయి. ఆ కెరూబులు మందసాన్ని, దాని మోత కర్రలనీ కమ్ముకుని ఉన్నాయి.

8ఆ మోత కర్రల కొనలు గర్భాలయం ఎదుట పరిశుద్ధ స్థలం లోకి కనబడేటంత పొడవుగా ఉన్నప్పటికీ అవి బయటికి కనబడలేదు. అవి ఈ రోజు వరకూ అక్కడే ఉన్నాయి.

9ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన తరవాత యెహోవా వారితో నిబంధన చేసినపుడు హోరేబులో మోషే ఆ పలకలను మందసంలో ఉంచాడు. దానిలో ఆ రెండు రాతిపలకలు తప్ప మరేమీ లేవు.

10యాజకులు పరిశుద్ధ స్థలం లో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘం యెహోవా మందిరాన్ని నింపింది.

11కాబట్టి యెహోవా మహిమ తేజస్సు ఆయన మందిరంలో నిండిపోయి ఆ మేఘం వలన యాజకులు సేవ చేయడానికి నిలబడ లేకపోయారు.

2 దినవృత్తాంతాలు

2 దిన 5:2–14

2తరువాత సొలొమోను యెహోవా నిబంధన మందసాన్ని సీయోను అనే దావీదు పట్టణం నుండి తెప్పించడానికి ఇశ్రాయేలీయుల పెద్దలనూ ఇశ్రాయేలీయుల వంశాలకు అధికారులైన గోత్రాల పెద్దలందరినీ యెరూషలేములో సమావేశపరిచాడు.

3ఏడవ నెలలో పండగ జరిగే సమయానికి ఇశ్రాయేలీయులంతా రాజు దగ్గరికి వచ్చారు.

4ఆ పెద్దలంతా వచ్చిన తరువాత లేవీయులు మందసాన్ని ఎత్తుకున్నారు.

5సొలొమోను రాజు, ఇశ్రాయేలీయుల సమాజమంతా సమావేశమై, లెక్కించ లేనన్ని గొర్రెలనూ పశువులనూ బలిగా అర్పించారు.

6లేవీయులు, యాజకులు కలిసి, మందసాన్ని, సమాజపు గుడారాన్నీ దానిలో ఉండే ప్రతిష్ఠిత వస్తువులన్నిటినీ తీసుకువచ్చారు.

7యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని గర్భాలయమైన అతి పరిశుద్ధస్థలం లో కెరూబుల రెక్కల కింద ఉంచారు.

8మందసం ఉండే స్థలానికి పైగా కెరూబులు తమ రెండు రెక్కలనూ చాపి మందసాన్నీ దాని మోత కర్రలనూ కప్పాయి.

9మోతకర్రల కొనలు గర్భాలయం ఎదుట ఉన్న పరిశుద్ధ స్థలం లో కనబడేటంత పొడవుగా ఉన్నాయి గానీ అవి బయటికి కనబడలేదు. ఇప్పటి వరకూ అవి అక్కడే ఉన్నాయి.

10ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెళ్లిన తరవాత యెహోవా హోరేబులో వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసంలో ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానిలో ఇంకేమీ లేవు.

11యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయలుదేరి వచ్చినప్పుడు అక్కడ సమావేశమైన యాజకులంతా తమ వంతులతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

12ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, సహోదరులు, గాయకులైన లేవీయులంతా, సన్నని నార వస్త్రాలు ధరించి, తాళాలు, తంబురలు, సితారాలు చేత పట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపు నిలబడ్డారు.

13వారితో బాటు 120 మంది బాకాలు ఊదే యాజకులు నిలబడ్డారు. బూరలూదే వారూ గాయకులూ ఒకేసారి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ గానం చేసినప్పుడు యాజకులు పరిశుద్ధస్థలం నుండి బయటికి వెళ్ళి ఆ బాకాలతో తాళాలతో ఇతర వాద్యాలతో కలిసి గొంతెత్తి “యెహోవా దయ గలవాడు. ఆయన కృప నిత్యమూ ఉంటుంది” అని స్తోత్రం చేశారు.

14అప్పుడు ఒక మేఘం యెహోవా మందిరాన్ని నింపింది. యెహోవా తేజస్సుతో ఆ మందిరం నిండిపోవడం వలన సేవ చేయడానికి యాజకులు ఆ మేఘం దగ్గర నిలబడలేక పోయారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు