IRV · అధ్యాయం 124 / 150
కీర్తనలు 124
1దావీదు రాసిన యాత్రల కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
2మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
3వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
4నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
5జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
6వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
7వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
8భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org