IRV · అధ్యాయం 28 / 150
కీర్తనలు 28
1దావీదు కీర్తన. యెహోవా, నేను నీకు మొరపెడుతున్నాను. నా ఆధారశిలా, నన్ను నిర్లక్ష్యం చెయ్యకు. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే, నేను సమాధిలోకి దిగిపోయిన వాళ్ళలా అవుతాను.
2నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.
3దుర్మార్గులు, పాపులతోబాటు నన్ను ఈడ్చివేయకు. వాళ్ళు దురాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో శాంతి మాటలు మాట్లాడతారు.
4వాళ్ళ పనులను బట్టి, వాళ్ళ దుష్టక్రియలను బట్టి వాళ్లకు ఇవ్వాల్సింది ఇవ్వు. వాళ్ళ చేతి పనిని బట్టి వాళ్లకు చెల్లించు. తగిన సమయంలో వాళ్ళకు ఇవ్వు.
5యెహోవా మార్గాలు, ఆయన చేతిపనులు వాళ్ళు అర్థం చేసుకోరు గనక ఆయన వాళ్ళను కూలదోసి, ఇంకెన్నడూ తిరిగి కట్టడు.
6యెహోవా నా విజ్ఞాపన స్వరం ఆలకించాడు గనక ఆయనకు స్తుతి కలుగు గాక!
7యెహోవా నా బలం, నా డాలు. నా హృదయం ఆయనలో నమ్మిక ఉంచుతుంది గనక నాకు సహాయం కలిగింది. కాబట్టి, నా హృదయం ఉప్పొంగి పోతుంది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను.
8యెహోవా తన ప్రజలకు బలం, ఆయన తన అభిషిక్తునికి రక్షణాశ్రయం.
9నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org