IRV · అధ్యాయం 53 / 150
కీర్తనలు 53
1ప్రధాన సంగీతకారుని కోసం. మహలతు రాగంలో దావీదు రాసిన దైవధ్యానం. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు.
2జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు.
3వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు.
4వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు. వారికి ఏమీ తెలియడం లేదా?
5భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు.
6సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org