హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › డిసెంబర్ 2027 › 16 డిసెంబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 16 డిసెంబర్, 2027
గురువారం · ఆగమన కాలం మూడవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
ఆగమన కాలం మూడవ వారపు గురువారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు. 2నీ డేరా పెద్దదిగా చెయ్యి. నీ డేరా తెరలను ఇంకా పొడిగించు. నీ తాళ్ళు పొడుగు చెయ్యి. నీ మేకులు దిగ్గొట్టు. 3ఎందుకంటే నువ్వు కుడివైపుకూ ఎడమవైపుకూ వ్యాపిస్తావు. నీ సంతానం రాజ్యాలను స్వాధీనం చేసుకుంటుంది. పాడైన పట్టణాలను నివాస స్థలాలుగా చేస్తారు. 4భయపడవద్దు. నువ్వు సిగ్గు పడనక్కరలేదు. నీకు అవమానం కలగదు. అధైర్య పడవద్దు. చిన్నతనంలోని నీ అవమానాన్నీ సిగ్గునూ మరచిపోతావు. నీ వైధవ్యపు నిందను ఇకమీదట జ్ఞాపకం చేసుకోవు. 5నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు. 6భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు. 7కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను. 8కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు. 9“ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను. 10పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు.
ప్రతిస్పందన కీర్తన
1ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు. 3యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు. 4యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి. 5ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది. 10యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి. 11నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు. 12అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.
సువార్త
24యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు, “మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా? 25అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు. 26అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను. 27‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను. 28స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.” 29ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు. 30కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం C, వారపు రోజుల సంవత్సరం II.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు