Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 31 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 18 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 31 అక్టోబర్, 2027

ఆదివారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

పెంతెకొస్తు తర్వాత 19వ ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

1 యోహా 1:1–7

1ఆది నుండి ఉన్న జీవ వాక్కును గురించి మేము విన్నదీ, మా కళ్ళతో చూసిందీ, దగ్గరగా గమనించిందీ, మా చేతులతో తాకిందీ మీకు ప్రకటిస్తున్నాం. 2ఆ జీవం వెల్లడైంది. తండ్రితో ఉండి ఇప్పుడు బయటకు కనిపించిన ఆ శాశ్వత జీవాన్ని మేము చూశాం కాబట్టి మీకు సాక్షమిస్తూ దాన్ని మీకు ప్రకటిస్తున్నాం. 3మీరు కూడా మాతో సహవాసం కలిగి ఉండాలని మేము చూసిందీ, విన్నదీ మీకు ప్రకటిస్తున్నాం. నిజానికి మన సహవాసం తండ్రితోను, ఆయన కుమారుడు యేసు క్రీస్తుతోను ఉంది. 4మీ ఆనందం సంపూర్తి కావాలని ఈ సంగతులు మీకు రాస్తున్నాం. 5దేవుడు వెలుగు. ఆయనలో చీకటి లేనే లేదు. దీన్ని మేము ఆయన దగ్గర విని మీకు ప్రకటిస్తున్నాం. 6మనకు ఆయనతో సహవాసం ఉందని చెప్పుకుంటూ, చీకటి మార్గంలో ఉంటే మనం అబద్ధం ఆడుతున్నట్టే. సత్యాన్ని ఆచరిస్తున్నట్టు కాదు. 7అయితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిస్తే, మనకు ఒకరితో ఒకరికి అన్యోన్యసహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడు యేసు క్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యాకో 1:1–12

1దేవునికి, ప్రభువైన యేసు క్రీస్తుకు దాసుడైన యాకోబు, చెదరిపోయిన పన్నెండు గోత్రాల వారికి అభినందనలు. 2నా సోదరులారా, మీ విశ్వాసానికి వచ్చే పరీక్ష మీకు ఓర్పు కలిగిస్తుందని తెలుసుకుని 3రక రకాల పరీక్షలకు మీరు లోనైనప్పుడు, దాన్ని ఆనందంగా భావించండి. 4ఓర్పు తన కార్యాన్ని సంపూర్ణం చేయనివ్వండి. అప్పుడు మీరు పూర్తిగా పరిణతి చెంది ఏ కొదువా లేకుండా ఉంటారు. 5మీలో ఎవరికైనా జ్ఞానం కావలిస్తే, దాన్ని ఇచ్చే దేవుణ్ణి అడగండి. అడిగినందుకు దేవుడు ఎవరినీ గద్దించడు. అడిగిన వారందరికీ ధారాళంగా ఇస్తాడు. 6కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు. 7అలాటివాడు తన విన్నపాలకు జవాబుగా ప్రభువు నుంచి తనకు ఏమైనా దొరుకుతుందని అనుకోకూడదు. 8అలాటి వాడు చంచలమైన మనసు గలవాడు. తన విషయాలన్నిటిలోనూ నిలకడ లేనివాడు. 9దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి. 10ధనవంతుడైన సోదరుడు, తాను కూడా గడ్డి పువ్వులా రాలిపోతానని తెలిసి, తన దీనస్థితిని బట్టి సంతోషించాలి. 11సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు. 12పరీక్షను ఓర్పుతో భరించేవాడు ధన్యుడు. ఆ పరీక్షలో గెలుపొందిన తరవాత దేవుణ్ణి ప్రేమించిన వారికి వాగ్దానంగా ఇచ్చే జీవ కిరీటం అతడు పొందుతాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

యూదా 1:1–7, 17–25

1తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. 2దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. 3ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది. 4ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. 5ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. 6తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. 7అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. 17కాని ప్రియులారా, అంతకు ముందు మన ప్రభువైన యేసు క్రీస్తు అపొస్తలులు పలికిన మాటలను గుర్తు చేసుకోండి. 18చివరి కాలంలో భక్తిలేని తమ ఆశలననుసరించి నడుచుకొంటూ ఉండే పరిహాసకులు ఉంటారు అని అపొస్తలులు మీతో చెప్పారు. 19వీరు సహజ సిద్ధంగా దైవాత్మ లేని వారు. ప్రకృతి సంబంధులు, భేదాలు కలిగించేవారు. 20కాని ప్రియులారా, అతి పవిత్రమైన విశ్వాసంలో ఎదుగుతూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ 21మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి. 22అనుమానంతో ఉన్న కొంతమంది పట్ల దయగా ఉండండి. 23అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని రక్షించండి. ఇంకొంత మందిపై భయంతో కూడిన దయ చూపండి. పాపంతో మలినమైన దుస్తులను సైతం మీరు అసహ్యించుకోండి. 24మీరు తడబడకుండా భద్రం చేయడానికి ఆయన తన మహిమగల సన్నిధి ఎదుట మహా గొప్ప ఆనందంలో మిమ్మల్ని మచ్చలేని వారుగా ఉంచగలవాడు. 25ఏకైక దేవుడైన మన రక్షకునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమ, ఘనత, ఆధిపత్యం, శక్తి అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ కలుగు గాక. ఆమెన్.

ఉదయ ప్రార్థన ఎనిమిదవ సువార్త

యోహా 20:11–18

11కానీ మరియ సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె సమాధిలోకి వంగి చూసింది. 12ఆమెకు ఇద్దరు దేవదూతలు కనిపించారు. వారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నారు. యేసు దేహం ఉంచిన చోట ఒకడు తల వైపునా మరొకడు కాళ్ళ వైపునా కూర్చుని ఉన్నారు. 13వారు మరియతో “ఎందుకు ఏడుస్తున్నావమ్మా?” అని అడిగారు. దానికి ఆమె, “ఎవరో నా ప్రభువును తీసుకు వెళ్ళిపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అంది. 14ఆమె ఇలా పలికి వెనక్కి తిరిగి అక్కడ యేసు నిలబడి ఉండడం చూసింది. కానీ ఆయనను ఆమె గుర్తు పట్టలేదు. 15యేసు, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు?” అని ఆమెను అడిగాడు. ఆమె ఆయనను తోటమాలి అనుకుంది. “అయ్యా, ఒకవేళ నువ్వు ఆయనను తీసుకు వెళ్తే ఆయనను ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయనను తీసుకుపోతాను” అంది. 16అప్పుడు యేసు ఆమెను చూసి, “మరియా” అని పిలిచాడు. ఆమె ఆయన వైపుకు తిరిగి, “రబ్బూనీ” అని పిలిచింది. రబ్బూనీ అనే మాటకు హీబ్రూ భాషలో ఉపదేశకుడు అని అర్థం. 17యేసు ఆమెతో, “నేను ఇంకా తండ్రి దగ్గరికి ఎక్కి పోలేదు. కాబట్టి నన్ను తాకవద్దు. కానీ నా సోదరుల దగ్గరికి వెళ్ళి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయన దగ్గరికి ఆరోహణం అవుతున్నానని వారికి చెప్పు” అన్నాడు. 18మగ్దలేనే మరియ వచ్చి శిష్యులతో, “నేను ప్రభువును చూశాను. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు” అంటూ ఆయన మాటలన్నీ వారికి తెలియజెప్పింది.

పత్రిక

2 కొరింతీ 11:31–12:9

31ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు. 32దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు. 33అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను. 12:1నేను అతిశయించాలి, అయితే దాని వలన ప్రయోజనమేమీ రాదు. ప్రభువు దర్శనాలూ ప్రత్యక్షతలూ మీకు తెలియజేస్తాను. 2క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు అతణ్ణి మూడవ ఆకాశానికి కొనిపోయాడు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 3అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు శరీరంతో వెళ్ళాడో లేకపోతే శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. దేవునికే తెలుసు. 4దేవుడు అతణ్ణి ఆనంద నివాసంలోకి కొనిపోయాడు. అతడక్కడ ఎవరూ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాడు. 5అలాంటి వ్యక్తి తరపున నేను అతిశయిస్తాను. అయితే నా బలహీనతల విషయంలో తప్ప నా తరపున నేను అతిశయించను. 6ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను. 7నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత. 8అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను. 9అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, “నా కృప నీకు చాలు. బలహీనతలోనే బలం పరిపూర్ణమవుతుంది.” కాగా క్రీస్తు బలం నా మీద నిలిచి ఉండేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.

పత్రిక (పరిశుద్ధ లూకా కోసం)

కొలస్స 4:5–9, 14, 18

5సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. 6మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు. 7ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు. 8ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను. 9ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు. 14ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు. 18పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.

సువార్త

లూకా 8:5–15

5“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి. 6మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి. 7మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి. 8మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు. 9ఆయన శిష్యులు, “ఈ ఉపమానం అర్థం ఏమిటి?” అని అడిగారు 10ఆయన, “దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులైతే చూస్తూ ఉన్నా నిజంగా చూడకుండా, వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉంటారు గనక వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను. 11ఈ ఉపమానానికి అర్థం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం. 12దారి పక్కన పడిన విత్తనాలు ఎవరంటే వీరు వాక్కును వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి ఆ వాక్యాన్ని తీసివేస్తాడు. 13రాతి నేలపై పడిన విత్తనాలు ఎవరంటే వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే వారు. కానీ వారిలో వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తరువాత విషమ పరీక్షల కాలంలో తొలగిపోతారు. 14ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎవరిని పోలిన వారంటే, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు. 15మంచి నేలపై పడే విత్తనాలు ఎవరంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్కును విని, భద్రంగా చేపట్టి ఓపికతో ఫలించేవారు.

సువార్త (పరిశుద్ధ లూకా కోసం)

లూకా 10:16–21

16మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు. నన్ను నిరాకరించేవాడు నన్ను పంపిన వాణ్ణి నిరాకరిస్తాడు.” 17ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, “ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెబితే మాకు లోబడుతున్నాయి” అని చెప్పారు. 18అప్పుడు ఆయన, “సాతాను మెరుపులా ఆకాశం నుండి పడడం చూశాను. 19ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హని చేయదు. 20అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి” అని వారికి చెప్పాడు. 21ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. “తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలం ఆయింది.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 18 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 31 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు