Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 24 అక్టోబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · అక్టోబర్ 11 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 24 అక్టోబర్, 2027

ఆదివారం · స్వరం 1

పండుగలు మరియు పరిశుద్ధులు

పెంతెకొస్తు తర్వాత 18వ ఆదివారం

ఏడవ విశ్వ సంఘ మహాసభ పితరులు

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 14:14–20

14తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు. 15రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు. 16అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు. 17అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు. 18అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. 19అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక. 20నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ద్వితీ 1:8–11, 15–17

8ఇదిగో, ఆ దేశాన్ని మీకు అప్పగించాను. మీరు వెళ్లి, యెహోవా మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకూ, వారి సంతానానికీ ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోండి.” 9ఆ సమయంలో, నేను మీతో “నేను ఒక్కడినే మిమ్మల్ని మోయలేను. 10యెహోవా దేవుడు మిమ్మల్ని విస్తరింపజేశాడు కనుక ఈ రోజు మీరు ఆకాశంలో నక్షత్రాల్లాగా విస్తరించారు. 11మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి, తాను మీతో చెప్పినట్టు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు గాక. 15కాబట్టి నేను మీ గోత్రాల్లో పేరు పొంది, తెలివీ జ్ఞానమూ కలిగిన వారిని పిలిచి, మీ గోత్రాలకు వెయ్యి మందికి ఒకడు, వంద మందికి ఒకడు, యాభై మందికి ఒకడు, పది మందికి ఒకడు చొప్పున వారిని మీ మీద న్యాయాధికారులుగా నియమించాను. 16అప్పుడు నేను వారితో “మీ సోదరుల వివాదాలు తీర్చి, ప్రతివాడికీ వాడి సోదరుడికీ వాడి దగ్గర ఉన్న పరదేశికీ న్యాయం ప్రకారం తీర్పు తీర్చండి. 17అలా చేసేటప్పుడు తక్కువ, ఎక్కువ అనే పక్షపాతం లేకుండా వినాలి. న్యాయపు తీర్పు దేవునిది కాబట్టి మీరు మనుషుల ముఖం చూసి భయపడవద్దు. మీకు కష్టమైన వివాదాన్ని నా దగ్గరికి తీసుకు రండి. దాన్ని నేను విచారిస్తాను” అని ఆజ్ఞాపించాను.

సాయంకాల ప్రార్థన: పఠనం

ద్వితీ 10:14–21

14చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు. 16కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు. 19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. 20మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే.

ఉదయ ప్రార్థన ఏడవ సువార్త

యోహా 20:1–10

1ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది. 2కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది. 3కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు. 4వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు. 5అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు. 6ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు. 7అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు. 8ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు. 9అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు. 10అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

పత్రిక

2 కొరింతీ 9:6–11

6“కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు” అని దీని గురించి చెప్పవచ్చు. 7సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు. 8అన్నిటిలో మీకు చాలినంతగా ఎప్పుడూ ఉండేలా, ప్రతి మంచి పని కోసమూ మీకు సమృద్ధి ఉండేలా దేవుడు మీలో తన కృపను అధికం చేయగలడు. 9దీని గురించి “అతడు తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు. అతని నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది” అని లేఖనంలో రాసి ఉంది. 10విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు మీకు విత్తనాన్ని దయచేసి వృద్ధి చేస్తాడు. మీ నీతి ఫలాన్ని అధికం చేస్తాడు. 11ఎప్పుడూ ఉదారంగా ఇవ్వడానికి మీకు సర్వ సమృద్ధి కలుగుతుంది. దాన్ని బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞత తెలియజేసే కారణం దొరుకుతుంది.

పత్రిక (పితరుల కోసం)

హెబ్రీ 13:7–16

7మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి. 8యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. 9అనేక రకాలైన కొత్త బోధలకు తిరిగిపోకండి. దైవకృపతో మన హృదయాలు శక్తి పొందాలి గాని ఆహారనియమాలతో కాదు. వాటి ప్రకారం ప్రవర్తించిన వారికి వాటివల్ల ఏ ప్రయోజనం కలగదు. 10మనకు ఒక బలిపీఠం ఉంది. గుడారంలో సేవ చేసే వారికి దానిపై నుండి ఏదీ తినడానికి అధికారం లేదు. 11ఎందుకంటే పాప పరిహార బలి అయిన జంతువుల రక్తం మాత్రమే ప్రధాన యాజకుడి ద్వారా పరిశుద్ధ స్థలానికి వస్తుంది. వాటి కళేబరాలను శిబిరం బయట కాల్చివేస్తారు. 12కాబట్టి యేసు కూడా ప్రజలను తన రక్తం ద్వారా శుద్ధీకరించడానికి నగరద్వారం బయట హింసలు పొందాడు. 13కాబట్టి మనం ఆయన అపనిందను భరిస్తూ శిబిరం బయటకు ఆయన దగ్గరికి వెళ్దాం. 14ఎలాంటి నిత్యమైన పట్టణమూ ఇక్కడ మనకు లేదు. మనం రాబోయే పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం. 15యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. 16ఒకరికొకరు ఉపకారం చేసుకోవడం, ఒకరికొకరు మేలు చేసుకోవడం మర్చిపోవద్దు. అలాంటి బలులు దేవునికి ఇష్టం.

సువార్త

లూకా 7:11–16

11ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. 12ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. 13ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. 14ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. 15ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు. 16అందరూ భయంతో నిండిపోయి, “మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలను సందర్శించాడు” అంటూ దేవుణ్ణి కీర్తించారు.

సువార్త (పితరుల కోసం)

యోహా 17:1–13

1యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. 2నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. 3ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. 4నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను. 5తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు. 6లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు. 7నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు. 8ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు. 9“నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. 10నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది. 11నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు. 12నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను. 13ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 11 అక్టోబర్ పౌర కాలెండర్‌లో 24 అక్టోబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు