హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 24 అక్టోబర్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 24 అక్టోబర్, 2027
ఆదివారం · సామాన్య కాలం 30వ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం 30వ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
7యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి. 8చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు. 9వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.”
ప్రతిస్పందన కీర్తన
1యాత్రల కీర్తన సీయోను నగరవాసులను యెహోవా చెరలో నుండి తిరిగి రప్పించినప్పుడు మనం కల కంటున్నవాళ్ళ వలే ఉన్నాం. 2మన నోరు నవ్వుతో నిండిపోయింది. మన నాలుక ఆనంద గీతాలు ఆలపిస్తుంది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్పకార్యాలు జరిగించాడు, అని అన్యజనులు చెప్పుకున్నారు. 3మనకి ఎంత ఆనందం! ఎందుకంటే యెహోవా మన కోసం ఘన కార్యాలు చేశాడు. 4దక్షిణ ప్రాంతపు సెలయేరులవలే యెహోవా, మా అదృష్టాన్ని తిరిగి చిగురింపజెయ్యి. 5కన్నీళ్లు కారుస్తూ విత్తనాలు చల్లేవాళ్ళు కేరింతలతో పంట కోస్తారు. 6విత్తనాలు చేతబట్టుకుని ఏడుస్తూ చల్లేవాడు సంబరంగా పనలు మోసుకుంటూ తిరిగి వస్తాడు.
రెండవ పఠనం
1దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతి ప్రధాన యాజకుడి నియామకమూ ప్రజల్లో నుండే జరుగుతుంది. 2అతడు అజ్ఞానుల విషయంలోనూ, దారి తప్పిన వారి విషయంలోనూ సానుభూతి చూపుతాడు. ఎందుకంటే అతణ్ణి కూడా అలాంటి బలహీనతలు చుట్టుముట్టి ఉంటాయి గనక 3ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది. 4ఈ గొప్పదనాన్ని ఎవరూ తమకు తామే ఆపాదించుకునే వీలు లేదు. అహరోనుకు ఉన్నట్టుగా దీనికి దేవుని ప్రత్యేక పిలుపు ఉండాలి. 5అలానే క్రీస్తు కూడా ప్రధాన యాజకుని స్థానానికి తనను తానే హెచ్చించుకోలేదు గానీ దేవుడే ఆయనతో ఇలా అన్నాడు. “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” 6అలాగే మరొక చోట ఆయన, “నువ్వు మెల్కీసెదెకు క్రమంలో కలకాలం ఉండే యాజకుడివి” అన్నాడు.
సువార్త
46ఆ తరువాత వారు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వారితో ఉన్న జనసమూహం ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఉన్నాడు. అతడు భిక్షగాడు. 47ఆ గుడ్డివాడు, వస్తున్నది నజరేయుడైన యేసు అని తెలుసుకుని, “యేసూ! దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని కేకలు పెట్టసాగాడు. 48చాలా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నా మీద దయ చూపు!” అని ఇంకా పెద్దగా కేకలు వేశాడు. 49యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అన్నాడు. ప్రజలు ఆ గుడ్డివానితో, “ధైర్యంగా ఉండు! లే! ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అన్నారు. 50ఆ గుడ్డివాడు తాను కప్పుకొన్న పైబట్టను అవతల పారవేసి, గభాలున లేచి యేసు దగ్గరికి వెళ్ళాడు. 51యేసు, “ఏం కావాలి?” అని అడిగాడు. ఆ గుడ్డివాడు, “రబ్బీ! నాకు మళ్లీ చూపు ప్రసాదించు” అని వేడుకున్నాడు. 52యేసు, “నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది, ఇక వెళ్ళు” అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయనతో వెళ్ళాడు.
ఈరోజు పరిశుద్ధులు
- పునీత అంతోని మరియ క్లారెట్, పీఠాధిపతి
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు