Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 4 అక్టోబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 4 అక్టోబర్, 2027

సోమవారం · సామాన్య కాలం 27వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 27వ వారపు సోమవారం

స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు

అస్సీసి పునీత ఫ్రాన్సిస్ · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యోనా 1:1–17; 2:10

1యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. 2“నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.” 3కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు. 4అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. 5అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు. 6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు. 7అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది. 8కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు. 9అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.” 10వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు. 11అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది. 12యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు. 13అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు. 14కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.” 15ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. 16అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు. 17ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు. 2:10అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది.

ప్రతిస్పందన కీర్తన

యోనా 2:2–4, 7

2“నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు. 3నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి. నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి. 4నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను. 7నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది.

సువార్త

లూకా 10:25–37

25ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?” అని అడిగాడు. 26అందుకాయన, “ధర్మశాస్త్రంలో ఏమని రాసి ఉంది? నువ్వు దానినెలా అర్థం చేసుకున్నావు?” అని అడిగాడు. 27అతడు, “నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణీ ప్రేమించాలి” అన్నాడు. 28దానికి ఆయన, “సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు” అన్నాడు. 29అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు, “అది సరే గానీ, నా పొరుగువాడు ఎవడు?” అని యేసును అడిగాడు. 30అందుకు యేసు, “ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు. 31అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు. 32ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు. 33అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. అతణ్ణి చూసి జాలి పడ్డాడు. 34అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకువెళ్ళి అతని బాగోగులు చూశాడు. 35మరుసటి రోజు అతడు రెండు వెండి నాణాలు తీసి ఆ సత్రం యజమానికిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను’ అనిచెప్పి వెళ్ళిపోయాడు. 36అయితే ఇప్పుడు ఆ ముగ్గురిలో దొంగల చేతిలో చిక్కిన వాడికి పొరుగువాడు ఎవరని నీకు అనిపిస్తుంది?” అని అతనిని అడిగాడు. 37దానికి అతడు, “అతని మీద జాలి చూపిన వాడే” అన్నాడు. యేసు, “నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి” అని అతనితో చెప్పాడు.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు