Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › అక్టోబర్ 2027 › 3 అక్టోబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 3 అక్టోబర్, 2027

ఆదివారం · సామాన్య కాలం 27వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 27వ ఆదివారం

ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

ఆది 2:18–24

18దేవుడైన యెహోవా “మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను” అనుకున్నాడు. 19దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరికి వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. 20అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది. 21అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరికి తీసుకువచ్చాడు. 23ఆదాము “ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. మనిషిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు మానుషి” అన్నాడు. 24ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 128:1–6

1యాత్రల కీర్తన. యెహోవా అంటే భయభక్తులు కలిగి, ఆయన విధానాల్లో నడుచుకునే వాళ్ళు ధన్యులు. 2నువ్వు కష్టపడి సంపాదించినది తప్పకుండా అనుభవిస్తావు. నీకు అంతా శుభం కలుగుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. 3నీ ఇంట్లో నీ భార్య ఫలవంతమైన ద్రాక్షాతీగెలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా ఉంటారు. 4యెహోవాను గౌరవించేవాడు ఈ విధంగా ఆశీర్వాదాలు పొందుతాడు. 5సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు గాక. నువ్వు జీవిత కాలమంతా యెరూషలేము సుసంపన్నం కావడం చూస్తావు. 6నీ మనవలు, మనవరాళ్ళను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

రెండవ పఠనం

హెబ్రీ 2:9–11

9అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు. 10ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే. 11పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు.

సువార్త

మార్కు 10:2–16

2కొందరు పరిసయ్యులు ఆయనను పరీక్షించే ఉద్దేశంతో, “ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ధర్మమేనా?” అని అడిగారు. 3యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు. 4వారు, “విడాకుల పత్రం రాసిచ్చి భార్యతో తెగతెంపులు చేసుకోవడానికి మోషే అనుమతి ఇచ్చాడు” అన్నారు. 5యేసు, “మీరు దేవునికి లోబడని వారు, కాబట్టి మోషే ఆ విధంగా ఆదేశించాడు. 6కాని, సృష్టి ఆరంభం నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు. 7అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యతో కలిసి జీవిస్తాడు. 8వారిద్దరు ఐక్యమై ఒకే శరీరంగా మారిపోతారు. కాబట్టి అప్పటి నుంచి వారు ఇద్దరు కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9కాబట్టి దేవుడు కలిపిన వారిని ఏ మనిషీ వేరు చేయకూడదు” అని వారితో చెప్పాడు. 10అందరూ ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ సంగతి గురించి వివరంగా చెప్పమని కోరారు. 11యేసు, “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచారం చేస్తున్నట్టే. 12అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుణ్ణి పెళ్ళి చేసుకున్న స్త్రీని వ్యభిచారిణిగా పరిగణించాలి” అని వారితో అన్నాడు. 13యేసు తమ చిన్న బిడ్డలను తాకాలని కొంతమంది వారిని తీసుకు వచ్చారు గాని, శిష్యులు వారిని అడ్డుకున్నారు. 14ఇది చూసి యేసుకు చాలా బాధ కలిగింది. ఆయన శిష్యులతో, “చిన్న బిడ్డలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిదే. 15మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వారు అందులో ఎన్నడూ ప్రవేశించరు” అన్నాడు. 16ఆయన ఆ చిన్నపిల్లలను దగ్గరికి పిలిచి వారిపై చేతులుంచి వారిని దీవించాడు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు