Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 30 సెప్టెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · సెప్టెంబర్ 17 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 30 సెప్టెంబర్, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత 15వ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

Afterfeast of the Exaltation of the Cross

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

గలతీ 3:23–4:5

23మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకూ, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము. 24కాబట్టి దేవుడు మనలను విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరికి మనలను నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉంది. 25అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము. 26యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు. 27క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు. 28ఇందులో యూదుడు-గ్రీసుదేశస్థుడనీ దాసుడు-స్వతంత్రుడనీ పురుషుడు-స్త్రీ అనీ తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు. 29మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు. 4:1నేను చెప్పేదేమిటంటే, వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు. 2తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకూ అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు. 3అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము. 4అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి, 5మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు.

సువార్త

మార్కు 6:30–45

30అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు. 31వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, “నాతో మీరు మాత్రమే ఒక నిర్జన ప్రదేశానికి వచ్చి, కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు. 32అందువల్ల వారు మాత్రమే పడవలో ఏకాంతంగా నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను గుర్తుపట్టి వివిధ గ్రామాల నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ నిర్జన ప్రదేశానికి చేరుకున్నారు. 34పడవలో యేసు అక్కడికి చేరినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించ సాగాడు. 35చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది. 36ఈ ప్రజలకు తినడానికి ఏమీ లేదు కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి” అన్నారు. 37అయితే యేసు వారితో, “మీరే వారికి ఆహారం పెట్టండి!” అన్నాడు. అందుకు వారు ఆయనతో, “రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని, వారికి పంచి పెట్టమంటావా” అని ఆయనను అడిగారు. 38ఆయన వారితో “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి” అన్నాడు. వారు వెళ్ళి చూసి, “ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి” అని అన్నారు. 39అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40ప్రజలు గుంపుకు యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు. 41యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు. 42అందరూ తిని సంతృప్తి చెందారు. 43శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను, చేప ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 44ఆ రోజు అక్కడ రొట్టెలు తిన్న పురుషులు ఐదు వేల మంది. 45ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు బేత్సయిదాకు వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 17 సెప్టెంబర్ పౌర కాలెండర్‌లో 30 సెప్టెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు