హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 29 సెప్టెంబర్
ఆర్థడాక్స్ కాలెండర్ · సెప్టెంబర్ 16 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 29 సెప్టెంబర్, 2027
బుధవారం · పెంతెకొస్తు తర్వాత 15వ వారం · స్వరం 5
పండుగలు మరియు పరిశుద్ధులు
Afterfeast of the Exaltation of the Cross
ఉపవాస దినం
ఉపవాసం: నూనెతో
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
15సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు. 16అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే. 17నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. 18ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వల్లనే వారసత్వాన్ని ఇచ్చాడు. 19అలాగైతే ధర్మశాస్త్రమెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దాన్ని కలిపాడు. ఎవరి గూర్చి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకూ అది అమలులో ఉంది. దాన్ని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు. 20మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే. 21ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వల్లనే నీతి కలిగి ఉండేది. 22యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
పత్రిక (పరిశుద్ధ యూఫేమియా కోసం)
1అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 2“అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను. రక్షణ దినాన మీకు సాయం చేశాను,” అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. 3మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం. 4దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో 5దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కాయకష్టంలో నిద్ర లేని రాత్రుల్లో ఆకలిలో-ఎంతో సహనం చూపాం. 6పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో 7సత్యవాక్యంలో దేవుని శక్తిలో-కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో 8ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే. 9అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు. 10ఏడుస్తున్నాము కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.
సువార్త
7యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, వారికి దయ్యాల మీద అధికారమిచ్చి ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. 8“ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, చేతి సంచిగాని, నడికట్టులో డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి. 9చెప్పులు వేసుకోండి గాని, మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి. 11ఏ గ్రామం వారైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి వ్యతిరేక సాక్షంగా మీ పాద ధూళిని దులిపి వేయండి.” 12శిష్యులు వెళ్ళి ‘పశ్చాత్తాప పడండి’ అంటూ ప్రకటించారు. 13ఎన్నో దయ్యాలను వదిలించారు. శిష్యులు అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
సువార్త (పరిశుద్ధ యూఫేమియా కోసం)
36పరిసయ్యుల్లో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు. 37ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుడి ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి 38ఆయనకు వెనుకగా ఆయన పాదాల దగ్గర ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది. 39ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, “ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలడు. ఈమె పాపాత్మురాలు” అని తనలో తాను అనుకున్నాడు. 40దానికి యేసు, “సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి” అని అతనితో అన్నాడు. అతడు, “బోధకా, చెప్పు” అన్నాడు. 41అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. 42ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు. 43అందుకు సీమోను, “అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అనిపిస్తుంది” అన్నాడు. దానికి యేసు, “సరిగ్గా ఆలోచించావు” అని అతనితో చెప్పి, 44ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, “ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. 45నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకోవడం ఆపలేదు. 46నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. 47దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే ఎక్కువ పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచెమే ప్రేమిస్తాడు” అని చెప్పాడు. 48తరువాత యేసు ఆమెతో, “నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 49అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు, “పాపాలు క్షమించడానికి ఇతనెవరు?” అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు. 50అప్పుడు ఆయన, “నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు” అని ఆమెతో చెప్పాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 16 సెప్టెంబర్ పౌర కాలెండర్లో 29 సెప్టెంబర్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు