Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 30 సెప్టెంబర్

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 30 సెప్టెంబర్, 2027

గురువారం · సామాన్య కాలం 26వ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

సామాన్య కాలం 26వ వారపు గురువారం

స్మరణ దినం · ఆరాధన రంగు: తెలుపు

పునీత జెరోమ్, గురువు, సంఘ పండితుడు · స్మరణ దినం

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

నెహె 8:1–12

1అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకు రమ్మని ఎజ్రాశాస్త్రితో చెప్పారు. 2ఎజ్రా ఏడవ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు. 3అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు. 4ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తయిన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవాళ్ళు. ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు. 5అప్పుడు అందరికంటే ఎత్తయిన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. 6ఎజ్రా గొప్ప దేవుడైన యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్‌, ఆమేన్‌ అని కేకలు వేస్తూ, క్రిందికి నేల వైపుకు తమ తలలు వంచుకుని యెహోవాకు నమస్కరించారు. 7ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయంలో యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదీయా, మయశేయా, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. 8ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేసారు. 9ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా, ప్రజలకు వివరించే లేవీయులు వారితో “మీరు ఏడవ్వద్దు. ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు” అని చెప్పారు. 10అప్పుడు నెహెమ్యా “బయలు దేరండి. కొవ్విన మాంసం తినండి. ఏదైనా తియ్యటిది తాగండి. ఇప్పటి దాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి. ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది. మీరు దుఃఖపడొద్దు. యెహోవాలో ఆనందమే మీ బలం” అని చెప్పాడు. 11ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. “మీరు దుఃఖించడం ఆపండి. చింతించకండి. ఇది పవిత్రమైన రోజు” అన్నారు. 12ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి, తినడానికీ, తాగడానికీ, లేని వారికి వాటాలు పంపించడానికీ, సంతోషంగా గడపడానికీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్లారు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 19:7–10

7యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. 8యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి. 9యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. 10అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.

సువార్త

లూకా 10:1–12

1ఆ తరువాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు. 2వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి. 3మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. 4మీరు డబ్బుగానీ సంచిగానీ చెప్పులుగానీ తీసుకువెళ్ళవద్దు. దారిలో ఎవరినీ పలకరించవద్దు. 5మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా ‘ఈ ఇంటికి శాంతి కలుగు గాక,’ అని చెప్పండి. 6శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది. 7వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.ఇంటింటికీ తిరగవద్దు. 8మీరు ఏదైనా ఊరిలో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ఎదుట పెట్టినవి తినండి. 9ఆ ఊరిలో ఉన్న రోగులను బాగు చేయండి. ‘దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది’ అని వారికి ప్రకటించండి. 10ఒకవేళ ఏ ఊరి వారైనా మిమ్మల్ని స్వీకరించక పోతే, 11మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి, ‘మా కాళ్ళకు అంటిన మీ పట్టణం దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం సమీపించిందని తెలుసుకోండి’ అని చెప్పండి. 12తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెబుతున్నాను.

ఈరోజు పరిశుద్ధులు

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు