Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 4 ఆగస్టు

ఆర్థడాక్స్ కాలెండర్ · జూలై 22 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 4 ఆగస్టు, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత ఏడవ వారం · స్వరం 5

పండుగలు మరియు పరిశుద్ధులు

Holy Myrrhbearer and Equal-to-the-Apostles Mary Magdalene (1st C)

ఉపవాస దినం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 కొరింతీ 7:12–24

12మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు. 13అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు. 14అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే. 15అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు. 16మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? 17అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను. 18ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు. 19దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు, 20ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి. 21దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది. 22ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస. 23ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు. 24సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.

పత్రిక (పరిశుద్ధ మగ్దలేనే మరియ కోసం)

1 కొరింతీ 9:2–12

2నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు. 3నాపై నిందారోపణ చేసే వారికి నేనిచ్చే జవాబు ఇదే. 4తినటానికీ తాగటానికీ మాకు అధికారం లేదా? 5మిగతా అపొస్తలులు, ప్రభువు సోదరులు, కేఫా, వీరందరిలాగా విశ్వాసురాలైన భార్యను తీసుకుని తిరగడానికి మాకు అధికారం లేదా? 6బర్నబా, నేను మాత్రమే పని చేస్తూ ఉండాలా? 7ఎవరైనా సైనికుడు తన ఖర్చులు తానే భరిస్తూ సైన్యంలో పని చేస్తాడా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తినని వాడెవడు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగని వాడెవడు? 8ఈ మాటలు నేను మానవ అధికారంతో చెబుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఇదే చెబుతున్నది కదా? 9“ధాన్యపు కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు” అని మోషే ధర్మశాస్త్రంలో రాసి ఉంది. దేవుడు కేవలం ఎడ్ల గురించేనా ఇక్కడ రాస్తున్నది? 10నిజానికి ఆయన కచ్చితంగా మన కోసం దీన్ని చెప్పడం లేదా? అవును, ఈ మాట మన కోసమే రాసి ఉంది. ఎందుకంటే, దున్నేవాడు ఆశతో దున్నాలి. కళ్ళం తొక్కించేవాడు పంటలో భాగం పొందుతాను అనే ఆశతో ఆ పని చేయాలి. 11మీ కోసం మేము ఆధ్యాత్మిక విషయాలు విత్తనాలుగా చల్లాము. దానికి ప్రతిఫలంగా మీ నుండి శరీర సంబంధమైన పంట కోసుకోవడం గొప్ప విషయమేమీ కాదు. 12వేరే వారికి మీ మీద ఈ అధికారం ఉందంటే మాకు మరి ఎక్కువ అధికారం ఉంటుంది కదా? అయితే మేము ఈ అధికారాన్ని ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్తకు ఏ విధమైన ఆటంకమూ కలిగించకుండా ఉండడం కోసం అన్నిటినీ సహిస్తున్నాం.

సువార్త

మత్తయి 14:35–15:11

35అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు. 36“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు. 15:1ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి, 2“నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు. 3అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు. 4ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు. 5కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు. 6ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు. 7వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.” 10ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే, 11ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు.

సువార్త (పరిశుద్ధ మగ్దలేనే మరియ కోసం)

లూకా 8:1–3

1ఆ తరువాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్త బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు. 2పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, 3హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఇంకా అనేకమంది ఇతర స్త్రీలూ ఆయనతో కూడా ఉన్నారు. వారంతా తమ స్వంత ధనం, సామగ్రిని వెచ్చించి ఆయనకు, ఆయన శిష్యులకు సహాయం చేసేవారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 22 జులై పౌర కాలెండర్‌లో 4 ఆగస్టు. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు